హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ కి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో దళపతి విజయ్ నుంచి ఓ విభిన్న తరహా అప్డేట్ వచ్చింది. అయితే అది సినిమా గురించి మాత్రం కాదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దళపతి విజయ్ కొందరు విద్యార్థులను ఘనంగా సన్మానించబోతున్నారు. చెన్నైలో జూన్ 17వ తేదీన ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్ గా జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హీరో విజయ్ అధికార ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

"ఓ చక్కటి స్ఫూర్తివంతమైన పనితో దళపతి విజయ్ మరోసారి ప్రజల, అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ ఏడాది 10వ తరగతి 12వ తరగతిలో మొదటి, రెండు, మూడో స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈ సందర్భంగా హీరో విజయ్ గౌరవించనున్నారు. ఈనెల 17వ తేదీన చెన్నైలో జరిగే ఈ కార్యక్రమంలో సదరు విద్యార్థులను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టాపర్లైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం హాజరుకానున్నారు. ఇక స్టూడెంట్స్ కి సర్టిఫికెట్లు, సన్మానం తో పాటు నగదు బహుమతులను కూడా విజయ్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు, ప్రజలు ఈ  కార్యక్రమానికి హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమం చెన్నై నీలగిరిలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది" అని విజయ్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు.

కాగా మరోవైపు గత కొన్ని రోజులుగా దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ పార్టీ నుంచి కొందరు అభ్యర్థులు బరిలో ఉంటారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక దళపతి విజయ్ సినిమాల విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'లియో' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. సినిమాలో ఆయన విజయ్ కి ఫాదర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

విజయ్ కెరీర్లో 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్,  ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా అనంతరం వెంకట్ ప్రభు డైరెక్షన్లో తన 68వ సినిమా చేయబోతున్నాడు దళపతి విజయ్. ఈ సినిమాకి 'సీఎస్ కే'(CSK) అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Also Read: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

2023-06-08T16:07:36Z dg43tfdfdgfd