ఎల్లారెడ్డిపేట, మే 26: ముప్పై ఏండ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డేకేర్ సెంటర్‌లో ప్రత్యక్షమయ్యాడు. సమాచారం అందుకున్న ఆయన అక్క తన పిల్లలు, అల్లుండ్లతో కలిసి శుక్రవారం కలుసుకొని భావోద్వేగానికి గురైంది. ఒళ్లంతా తడిమిచూసి కంటతడిపెట్టింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లకు చెందిన కముటం పోచయ్య (60) తన చిన్నతనంలో పెద్ద రైతుల వద్ద పాలేరుగా పనిచేసేది. ఆయనకు పెండ్లయిన కొంతకాలానికే కుటుంబకలహాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఆయన సోదరి లక్ష్మికి వివాహమై ప్రస్తుతం గంభీరావుపేటలో ఉంటున్నది. ముప్పై ఏండ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పశువులను గంగకు తీసుకెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లాడు. నాటి నుంచి కనిపించకుండాపోయాడు. కొంతకాలం బంధువులు, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు.
నాటి నుంచి తమ్ముడి జాడ కోసం ఎదురుచూసేది. ఈక్రమంలో రెండు నెలల క్రితం పోచయ్య తన సొంతూరైన మద్దిమల్ల గ్రా మానికి చేరుకున్నాడు. తన ఇల్లు, తల్లిదండ్రు లు, ఇరుగుపోరుగువారు కనిపించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోనే అక్కడా ఇక్కడా గడుపుతున్నాడు. కొందరు గ్రామస్తులు అతడిని ఈ నెల 21న ఎల్లారెడ్డిపేటలోని డేకేర్ సెంటర్‌లో చేర్పించేందుకు తీసుకువచ్చారు. సెంటర్ హోమ్ కో-ఆర్డినేటర్ ముచ్చ మమత డేకేర్ సెంటర్‌లో చేర్చుకున్నది. ఆయనకు ఆధార్, ఓటరు కార్డు లేకపోవడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. పోచయ్యతో మాట్లాడగా తన అక్క గంభీరావుపేటలో ఉంటదని చెప్పాడు. దీంతో ఆమెకు సమాచారం అందించగా శుక్రవారం మ ధ్యాహ్నం డేకేర్ సెంటర్‌కు తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చింది. బక్కచిక్కిన తమ్ముడిని చూసి భావోద్వేగానికి గురైంది. ఆప్యాయతతో ఒళ్లంతా నిమిరి కంటతడి పెట్టింది. తన పిల్లలకు పోచయ్యను చూపించి పరిచయం చేసింది. తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లి ఆరోగ్యం బాగు చేయించుకుంటానని అనుమతి కోరగా నిర్వాహకులు పంపించారు.
2023-05-26T22:05:57Z dg43tfdfdgfd