AYODHYA: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగేది ఈ ముహూర్తానికే..!

అయోధ్యలో శ్రీరాముడి దివ్య మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర కీలక విషయాన్ని ప్రకటించింది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ వేడుకకు అంతర్జాతీయ స్థాయి కల్పించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి నిర్వహిస్తారు. ఇప్పటికే మొదలైన మొదటి దశ..డిసెంబరు 20 వరకు కొనసాగుతుంది. డిసెంబరు 20న నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశలో డోర్ టు డోర్ కాంటాక్ట్ స్కీమ్ కింద 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేస్తారు. జనవరి 22న మూడో దశ మొదలవుతుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలగనుంి. నాలుగో దశ జనవరి 26న గణతంత్ర దినోత్సవం నుంచి మొదలై.. ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతుంది. ఇక అయోధ్యలో ఇవాళ ప్రదక్షిణలు జరుగుతున్నాయి. అందుకోసం తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. మఠాలు, ఆలయాను అందంగా అలంకరించారు. బస్సుల్లో వచ్చే వారు ఫైజాబాద్ బస్ స్టేషన్‌కు.. రైల్లో వచ్చే వారు అయోధ్య కాంట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ చేరుకొని.. ఆలయానికి వెళ్లవచ్చు.

2023-11-20T06:40:48Z dg43tfdfdgfd