CASE AGAINST AKHILA NANDAKUMAR: ఎలాంటి ఆధారాల్లేవ్.. ఆసియానెట్ న్యూస్ రిపోర్టర్‌పై కేసు ఉపసంహరణ..

Case against Akhila Nandakumar: కేరళలోని కొచ్చి మహారాజా కాలేజీ మార్క్ లిస్ట్ వివాదంలో ఏషియానెట్ న్యూస్ రిపోర్టర్ అఖిలా నందకుమార్‌పై నమోదైన ఫోర్జరీ కేసును ఎర్నాకుళం మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. రిపోర్టర్ అఖిల కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, చార్జి జాబితా నుంచి తప్పించాలని ఎర్నాకుళం మేజిస్ట్రేట్ పేర్కొంది. దీంతో జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు రిపోర్టర్‌పై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకున్నారు. 

వివరాల్లోకెళ్లే.. లెఫ్ట్-బ్యాక్డ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి పీఎం అర్షో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇక్కడ  షాకింగ్ విషయమేమిటంటే.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు ఆధారంగా అఖిల నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి పీఎం అర్షో ఫిర్యాదు మేరకు ఎర్నాకులం మహారాజా కళాశాల మాజీ కోఆర్డినేటర్ వినోద్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ జాయ్, కేఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు అలోసియస్ జేవియర్, ఫాజిల్ సీఏ, అకిలా నందకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, పరువు నష్టం మొదలైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సాధారణ ప్రజలకు చేరవేసేందుకు క్యాంపస్‌కు వెళ్లిన ఓ జర్నలిస్టుపై పోలీసులు కుట్రపూరితంగా కేసు నమోదు చేయడం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకురాలు విద్యా ఫోర్జరీ కేసులో వివరాల కోసం జూన్ 6న అఖిల, ఆమె కెమెరామెన్ మహారాజా కళాశాల క్యాంపస్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పదవి కోసం నకిలీ పత్రాలను రూపొందించినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు విద్య పరారీలో ఉంది. ఉదయం 11 గంటల వార్తపై ప్రిన్సిపాల్‌తో పాటు మలయాళ విభాగం టీచర్‌తో అఖిల లైవ్‌లో మాట్లాడి వివరాలు కోరింది.

విద్యా ఫోర్జరీకి సంబంధించి ప్రిన్సిపాల్ రూమ్‌లో ఉన్న విద్యార్థి ప్రతినిధులను అఖిల వారి స్పందన కోరింది. అప్పుడే విద్యార్థి ప్రతినిధి ఒకరు ఆర్షో మార్క్ లిస్ట్ వివాదాన్ని లేవనెత్తుతూ.. ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉందని అన్నారు. దీంతో ఫోర్జరీ కేసుతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మార్క్‌ లిస్టు వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఘటనను తనపై జరిగిన కుట్రగా అర్షో అర్థం చేసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై కొచ్చి సెంట్రల్ పోలీసులు అఖిలా నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. 

మీడియా, జర్నలిస్టులపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న కేరళ ప్రభుత్వం, పోలీసులపై నిరసన తెలిపేందుకు సాంస్కృతిక ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, పౌర హక్కుల వాదులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చారు. జర్నలిస్టులపై విచారణ జరిపి, ఆపై ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనని సాంస్కృతిక నేతలు వ్యాఖ్యానించారు. కేరళ మినరల్స్‌లో అవినీతిని వెలికి తీసిన ఆసియానెట్ న్యూస్ రిపోర్టర్లు అఖిలా నందకుమార్, అబ్జోద్ వర్గీస్, మలయాళ మనోరమ (కొల్లాం) స్పెషల్ కరస్పాండెంట్ జయచంద్రన్ ఇలాంకట్‌లపై కేరళ పోలీసుల చర్యలను వెంటనే నిలిపివేయాలని 137 మంది సాంస్కృతిక ప్రముఖులు సంయుక్త ప్రకటనలో కోరారు.

2023-09-19T17:26:06Z dg43tfdfdgfd