FISHERMAN DEATH: చెరువులో చేపలు పడుతూ మత్స్యకారుడి మృతి

Fisherman Death: చేపల వేటకోసం వెళ్లి చెరువులోనే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరగగా.. సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కమలాపూర్ గ్రామానికి చెందిన పెద్దవేని సాంబయ్య(46), సమ్మయ్య, రమేశ్ అనే ముగ్గురు మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఆదివారం సాయంత్రం గ్రామంలోని దమ్మన్నకుంట చెరువులోకి వెళ్లారు.

సాయంత్రం 4 గంటల నుంచి పొద్దుపోయే వరకు చేపలు పట్టారు. చేపలు పట్టడం పూర్తై ఒడ్డుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే చెరువు మధ్యలో ఉన్న సాంబయ్య ఛాతిలో నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుండటంతో గుండెనొప్పి వస్తోందని సమ్మయ్య, రమేశ్కు చెప్పి ఆయన అక్కడే కుప్పకూలాడు.

దీంతో కంగారు పడిన ఆ ఇద్దరూ చేపలన్నింటినీ అక్కడే వదిలేసి హుటాహుటిన సాంబయ్యను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోగా.. ఛాతిపై నొక్కుతూ బతికించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి విషమించడం, శ్వాస ఆడకపోవడంతో సాంబయ్య చెరువు ఒడ్డునే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో సమ్మయ్య, రమేశ్ వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చేపలు వేటకు వెళ్లి చెరువులోనే మృతిచెందండతో సాంబయ్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరునవిలపించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, మిగతా మత్స్యకారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)

2023-11-20T08:01:24Z dg43tfdfdgfd