SRH ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్లాసెన్.. ఎందుకో తెలుసా..!

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా విజయాలు సాధిస్తోందంటే అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయడం ఇతడి స్టైల్. దీంతో ఇతడికి ఉన్న అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అతడికి జేజేలు కొడుతున్నారు. అయితే అదే సన్ రైజర్స్ ఫ్యాన్స్.. చేసిన పని పట్ల ఈ ప్రొటీస్ బ్యాటర్ అసహనం వ్యక్తం చేశాడు. తన చుట్టు పట్టుపక్కల వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కత్‌తో కలిసి హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్‌లోని ఓ మాల్‌ను సందర్శించాడు. ఈ క్రమంలో విధ్వంసకర బ్యాటర్‌ను చూసిన ఫ్యాన్స్.. క్లాసెన్.. క్లాసెన్ అని నినాదాలు చేశారు. అలానే నినాదాలు చేస్తూ.. సెల్ఫీ కోసం అతడిని చుట్టు ముట్టారు. క్లాసెన్‌తో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. అతడు వెళ్లే దారికి అడ్డుపడ్డారు.

అయితే చాలా వరకు ప్రశాంతంగానే ఉండేందుకు ప్రయత్నించిన క్లాసెన్.. కనీసం వెళ్లేందుకు కూడా సహకరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలుత అరవకండి అంటూ వారిని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఉనద్కత్‌తో కలిసి మాల్‌ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఫ్యాన్స్ తీరు పట్ల హైదరాబాద్ బ్యాటర్ అసహనం వ్యక్తం చేశాడు. వారి పట్ల కోపం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే అంతర్జాతీయ ప్లేయర్‌లకు రక్షణ కల్పించకపోవడం ఏంటని పలువురు నెటిజన్లు సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీని ప్రశ్నిస్తున్నారు. ప్లేయర్లు బయటకు వెళ్లేప్పుడు వారికి రక్షణ ఏర్పాట్లు చేయాలిగా అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచుల్లో ఆరింట్ల గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినట్లే! హైదరాబాద్ తన తర్వాతి మ్యాచులో మే 6న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T01:28:17Z dg43tfdfdgfd