SRK: వెంటిలేటర్ సపోర్ట్‌తో 'జవాన్' సినిమా చూసిన అభిమాని వీడియోపై స్పందించిన కింగ్ ఖాన్!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే మూడు రోజుల క్రితం కింగ్ ఖాన్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు వెంటిలేటర్ సపోర్ట్‌ తో థియేటర్ కు వెళ్లి జవాన్ సినిమా చూసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా షారూక్ స్పందించారు. 

అనీస్ ఫరూఖీ అనే అభిమాని తన వెంటిలేటర్‌తో థియేటర్ కు వచ్చి వీల్ చైర్ లో కూర్చొని 'జవాన్' సినిమా చూసాడు. ఈ వీడియోని ఓ నెటిజన్ ట్విట్టర్ షేర్ చేస్తూ, కింగ్ ఖాన్ ను ట్యాగ్ చేసాడు. ''షారుఖ్ ఖాన్ వచ్చిన తర్వాత మనసు కాదు.. గుండె పని చేయడం మొదలవుతుంది. ఒక శారీరక వికలాంగుడు వెంటిలేటర్‌పై మీ సినిమా చూస్తున్నాడు. SRK సార్ ఇదీ ప్రజలకు మీపై ఉన్న ప్రేమ'' అని పేర్కొన్నాడు. దీనికి షారుక్ స్పందిస్తూ అనీస్ కి ధన్యవాదములు తెలిపారు. 

''థాంక్యూ మై ఫ్రెండ్.. భగవంతుడు మీకు ప్రపంచంలోని అన్ని ఆనందాలను ప్రసాదిస్తాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. మీరు ఈ సినిమాను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ప్రేమతో...'' అని షారుక్ ఖాన్ ఆ వీడియోని రీట్వీట్ చేసారు. ఫరూఖీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, వెంటిలేటర్‌తో 'జవాన్' మూవీ చూడటానికి థియేటర్‌కు రావడం అందరితో పాటుగా షారుక్ మనసుని కూడా తాకిందని ఆయన ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. 

Also Read: 'సో స్వీట్ ఆఫ్ యూ..' బన్నీ ట్వీట్ కి నయన్ స్పందన ఇదే!

డ్యూయెల్ రోల్ లో అదరగొట్టిన షారుఖ్..

ఇక 'జవాన్' సినిమా విషయానికొస్తే, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. హై-ఆక్టేన్ యాక్షన్ తో పాటుగా వివిధ సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేస్తూ ఈ సినిమా రూపొందించారు. ఇందులో షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలో కనిపించింది. సంజయ్ దత్ అతిధి పాత్రలో మెరిశారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

1000 కోట్ల క్లబ్ దిశగా 'జవాన్'.. 

'జవాన్' చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదలైంది. 11 రోజుల్లోనే రూ. 858 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, అత్యంత వేగంగా ఈ మైలురాయి సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించింది. కేవలం హిందీలోనే 430 కోట్ల వసూళ్లు అందుకొని, ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్ సినిమాగా నిలిచింది. ట్రెండ్ చూస్తుంటే ఈ వీకెండ్ లో షారుక్ ఖాన్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే 'పఠాన్' 'జవాన్' లతో ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా బాద్ షా చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఒకవేళ క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో రానున్న 'డుంకి' సినిమా కూడా హిట్టయితే మాత్రం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఎవరూ అందుకోలేని రేంజ్ కి షారుక్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: మోహన్ లాల్ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

2023-09-19T01:40:09Z dg43tfdfdgfd