Telangana | హుజూరాబాద్‌టౌన్, మే 25 : ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వరుడిని చితక బాది వధువును అపహరించిన ఘటన హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన 23 ఏళ్ల కలయన్‌మంగయ్య రవికుమార్, అదే గ్రామానికి చెందిన బైరి ప్రసన్న ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరువురి ప్రేమ గురించి ప్రసన్న తల్లిదండ్రులకు చెప్పగా కులాలు వేరు కావడంతో ఒప్పుకోలేదు. దీంతో బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఎవరికీ చెప్పకుండా రవికుమార్ తన స్నేహితులో కలిసి యువతిని తీసుకొని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో కులాంతర వివాహం చేసుకున్నారు. వధువు తరుపు బంధువులు కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొని వారిని వెంబడించడంతో వారి నుంచి తప్పించుకొని హుజూరాబాద్ వైపు వచ్చి అంబేదర్ చౌరస్తాలోని నటరాజ్ ఉడిపి హోటల్‌లో రాత్రి అల్పాహారం చేసి కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో వధువు తల్లిదండ్రులు, సోదరులు భైరి ప్రశాంత్, భైరి ప్రణయ్, వారి స్నేహితులు దువ్వ అశోక్, బోగి మహేశ్, గణేశ్, శ్రీకాంత్, సందీప్, భరత్, తరుణ్, రాజేశ్, పుతిన్, రాజు, తదితరులు సుమారు 25 మంది కార్లలో వచ్చి వీరి కారుకు అడ్డం తిరిగారు. వధూవరులిద్దరినీ కారులో నుంచి దింపి చితకబాది వధువు ప్రసన్నను వెంట తీసుకువెళ్లారు. అలాగే, రవికుమార్‌ను పర్కాలక్రాస్ రోడ్ వద్దకు తీసుకువెళ్లి అకడ సైతం పిడి గుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని రోడ్డు పక్కన చెట్లలో పడేసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు రవికుమార్ తన బావ నామని శివకు సమాచారం ఇచ్చా డు. వెంటనే అతను వచ్చి రవికుమార్‌ను వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేర్పించి చికిత్స చేయించారు. గురువారం సాయంత్రం హుజూరాబాద్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి వరుడు రవికుమార్ అతని బావ శివ, అకతో కలిసివచ్చి ప్రసన్న సోదరులు, వారి స్నేహితులు తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, ప్రసన్నకు, తనకు వారితో ప్రాణ భయం ఉందని, ఆమె ను తనకు అప్పగించాలని, ప్రసన్న కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
మరో వధువును తీసుకెళ్లిన కుటుంబసభ్యులు?
అలాగే, బుధవారం అర్ధరాత్రి ఇదే సమయంలో మరొక ప్రేమజంట పట్టణంలోని అంబేదర్ చౌరస్తాలో హోటల్‌లో భోజనం చేస్తుండగా అమ్మాయి తరఫున బంధువులు ఇరువురిని గుర్తించారు. అబ్బాయికి నచ్చజెప్పి కరీంనగర్‌కు పంపించగా, అమ్మాయిని వారి వెంట భూపాలపల్లికి తీసుకువెళ్లారు. ఈ ఇద్దరు కూడా వేములవాడలో పెళ్లి చేసుకుని తిరిగి హుజూరాబాద్‌కు వచ్చి వెళ్తున్న క్రమంలో బంధువుల కంటపడ్డారు. ఈ ఘటన కూడా ఆ నోటా ఈనోటా తెలువడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే రోజు ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు జంటలను విడగొట్టి వెంట తీసుకెళ్లడం పట్టణంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
2023-05-25T21:35:48Z dg43tfdfdgfd