ఇన్నాళ్లు తెలంగాణలో దాచారా.. షూటింగ్‌లు లేనందునే టూర్ : పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 14 నుంచి చేపట్టనున్న వారాహి యాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తన యాత్రకు చంద్రవరం అని పేరు పెడితే బాగుండేదన్నారు. షూటింగ్‌లు లేకపోవడం వల్లనే పవన్ వారాహి యాత్ర మొదలుపెడుతున్నారని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు గెలవాలి.. జగన్ దిగాలి ఇదే పవన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు పాపులారిటీ తగ్గకుండా వుండేందుకే పవన్‌ను యాత్ర వేసుకోవాలని చంద్రబాబు ఆరోపించి వుంటారని పేర్ని నాని ఆరోపించారు. దసరా, సంక్రాంతి, ఉగాది పోయింది ఇప్పుడు ముహూర్తం కుదిరిందా అంటూ ఆయన సెటైర్లు వేశారు. వారాహి మీద పవన్ కళ్యాణ్‌కు టూర్ ప్యాకేజ్ వచ్చిందంటూ పేర్నినాని ఆరోపించారు. వారాహిని తెలంగాణలో దాచారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. 

ALso Read: ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. పొత్తుల కోసం కాదు: నాదెండ్ల

రాష్ట్ర విభజనకు చంద్రబాబు శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నారని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు  చెప్పారా అని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం  సమైక్యంగా  ఉండాలన్నదే  వైసీపీ  స్టాండ్ అని.. చంద్రబాబు  లాగా  పూటకో  నిర్ణయం  కాదని పేర్ని నాని స్పష్టం చేశారు. రెండు  రాష్ట్రాలు విడగొట్టాలని తానే చెప్పానని చంద్రబాబు అంటున్నారని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో  సాఫ్ట్‌వేర్ పార్క్ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని , మరి చంద్రబాబు ఏం  చేశాడని పేర్ని నాని ప్రశ్నించారు. 

2047కి పేదల్ని  కోటీశ్వరులను చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని అప్పటికి ఆయన వయసెంత అని నాని నిలదీశారు. 2020 పోయి 2047 వచ్చిందని.. అధికారంలో  ఉన్నప్పుడు ఆయన ఏది చెయ్యడన్నారు. చంద్రబాబు  సంపద  సృష్టించా అని చెబుతున్నారని..  అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా  ప్లాట్లు  ఇచ్చారా అని పేర్ని నాని నిలదీశారు. విజయవాడ -  గుంటూరు మధ్య రాజధానిని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు  కట్టచ్చుగా అని ఆయన ప్రశ్నించారు. పౌర విమనయాన శాఖా మంత్రి అప్పట్లో ఆయన జేబులో ఉంటే  కనీసం వైజాగ్ ఎయిర్‌పోర్ట్ పనులు కూడా చెయ్యలేదని ఎద్దేవా చేశారు. 

2023-06-02T14:03:21Z dg43tfdfdgfd