ఒక దేశాన్ని కుదిపేసిన చిన్నారి హత్య: పెంపుడు తల్లిదండ్రులే ఆ బిడ్డను చంపేశారా, మిస్టరీ ఏంటి....

హెచ్చరిక: ఈ కథనంలో ‘‘ద అసుంటా కేస్’’ సిరీస్‌లోని కొన్ని అంశాలను చర్చిస్తాం.

పూర్తిగా రహస్య అంశాలతో నిండిన కేసు ఇది. వాటిలో కొన్ని అంశాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈ కారణంగానే ఈ కేసు ఒక దేశం మొత్తాన్ని సస్పెన్స్‌లో ఉంచింది.

ఒక 12 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం, శివార్లలో ఆమె మృతదేహం దొరకడం, దానిపై పోలీస్ ఆపరేషన్ జరగడం ఈ పరిణామాలన్నీ త్వరగానే మీడియా దృష్టిని ఆకర్షించాయి.

చైనాకు చెందిన ఏడాది వయస్సున్న ఒక బాలికను స్పెయిన్‌కు చెందిన దంపతులు అల్ఫోన్సో బస్టెర్రా, రొసారియా పోర్టో దత్తత తీసుకున్నారు. వారు సంపన్నులు. సాంటియాగో డి కంపోస్టెలా కమ్యూనిటీలో వారు నివసిస్తారు.

పెంపుడు తల్లిదండ్రులు ఆ బాలికకు అసుంటా అని పేరు పెట్టారు. ఆమెను సుఖ సంతోషాలతో పెంచినట్లు చెప్పారు. కానీ, పోలీసుల దర్యాప్తులో న్యాయ విచారణలో తేలిన అంశాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

2013లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన ‘‘ద అసుంటా కేస్’’ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కానీ, ఈ కేసులోని వ్యక్తుల గుర్తింపును బయటపెట్టకుండా కల్పిత, సృజనాత్మక అంశాలను ఈ సిరీస్‌లో జోడించారు.

చావు, అదృశ్యం

చైనాలోని యాంగ్జూ నగరంలో 2000 సెప్టెంబర్ 30న ఫాంగ్ యాంగ్‌ జన్మించారు. మొదటి పుట్టినరోజు తర్వాత ఆమెను స్పెయిన్‌కు చెందిన దంపతులు అల్ఫొన్సో బస్టెర్రా, రొసారియో పోర్టోలకు దత్తత ఇచ్చారు. సిరీస్‌లో ట్రిస్టాన్ ఉల్లోవా, కాండెలా గ్రీఫ్ ఈ పాత్రలను పోషించారు.

అల్ఫొన్సో ఒక జర్నలిస్ట్. రొసారియో ఒక లాయర్. ఫ్రాన్స్‌ గౌరవ కాన్సుల్, నగరంలో ఎంతో పేరున్న సంపన్నుడైన తన తండ్రి వృత్తినే రొసారియో చేపట్టారు.

రొసారియోకు లూపస్ ఎరిథెమటోసుస్ అనే వ్యాధి ఉన్నందున పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు వారికి చెప్పారు. ఒకవేళ రొసారియో గర్భం దాల్చితే అది ఆమెకు ప్రాణాంతకంగా మారొచ్చు.

ఈ దంపతులు దత్తత తీసుకున్న ఆ బాలిక అసుంటా బస్టెర్రాగా కొత్త గుర్తింపు పొందారు. పాఠశాలలో చురుగ్గా అన్నీ నేర్చుకునే అసుంటాకు చాలా మంది స్నేహితులు అయ్యారు. సెలవుల్లో కుటుంబంతో ఆమె ఆనందంగా గడిపేవారు. పెంపుడు తాత, బామ్మలు ఆమె అంటే చాలా ఇష్టపడేవారు.

అసుంటా 13వ పుట్టినరోజుకు కేవలం వారం రోజుల ముందు ఆమె కనిపించడం లేదంటూ అల్ఫోన్సో, రొసారియో ఒక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అది 2013 సెప్టెంబర్ 21, శనివారం రాత్రి.

కొన్ని గంటల తర్వాత, ఆ బాలిక అటవీప్రాంతంలోని ఒక రోడ్డు పక్కన చనిపోయి కనిపించింది.

ఆమెను నారింజ రంగు తాళ్లతో కట్టేశారు. లైంగిక వేధింపుల సంకేతాలు కనిపించలేదు. ఆమె ఊపిరాడక చనిపోయినట్లు శవపరీక్షలో తేలింది.

ఈ కేసు దర్యాప్తులో బాలిక తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. కానీ, వారు చెబుతున్న వాంగ్మూలాల్లో తేడా ఉన్నట్లుగా ఏజెంట్లు గుర్తించారు. చివరకు బాలిక పెంపుడు తల్లిదండ్రులే ఆ కేసులో చిక్కుకున్నారు.

టియో పట్టణంలో బాలిక మృతి చెందిన చోటుకు సమీపంలో వారి కుటుంబానికి ఒక ఇల్లు ఉండటం, అసుంటాను కట్టేసిన నారింజ రంగు తాళ్లను ఆ ఇంట్లో గుర్తించడం ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలుగా మారాయి.

అంతేకాకుండా, బాలిక శరీరంలో అధిక మోతాదులో లారాజెపెమ్ అనే డ్రగ్ ఉన్నట్లుగా శవపరీక్షలో వెల్లడైంది. లారాజెపెమ్ అనేది శక్తిమంతమైన ట్రాంక్విలైజర్. ఈ మందును స్పెయిన్‌లో వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకే అమ్ముతారు.

శనివారం మధ్యాహ్నం బాలిక అదృశ్యమైనప్పుడు, తాము ఎక్కడ ఉన్నామనే విషయంలో రొసారియో, అల్ఫోన్సో భిన్నమైన వివరణలు ఇచ్చారు.

ఈ సాక్ష్యాల ఆధారంగా రొసారియోను సెప్టెంబర్ 24న, అల్ఫోన్సోను సెప్టెంబర్ 25న హత్యానేరం కింద అరెస్ట్ చేసి విచారించారు.

అనుమానాస్పద నేపథ్యం

ఈ కేసు విచారణ చాలా రోజుల పాటు సాగింది. అసుంటా మరణించిన రెండేళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.

కేసు దర్యాప్తులో రొసారియో- అల్ఫోన్సోల వివాహం, బాలికతో వారికున్న అనుబంధానికి సంబంధించిన కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ అంశాలే కేసు దర్యాప్తుతో పాటు తర్వాతి విచారణను ప్రభావితం చేశాయి.

రొసారియో, అల్ఫోన్సోలకు 2013 ఏడాది చాలా ఇబ్బందిగా సాగింది.

రొసారియోకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అల్ఫోన్సోకు అదే ఏడాది జనవరిలో తెలిసింది. ఇది వారిద్దరి విడాకులకు దారి తీసింది. అయితే, దత్త కూతురు బాగోగులు చూసుకునేందుకు వారిద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఒప్పందంలో భాగంగా రొసారియో, అసుంటాలు ఉండే ఇంటికి సమీపంలోని మరో అపార్ట్‌మెంట్‌కు అల్ఫోన్సో మారిపోయారు.

జులైలో ఒక అనూహ్య ఘటన జరిగింది. మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి రాత్రిపూట అసుంటా గదిలోకి వెళ్లి ఆమె గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించారు.

రొసారియో రావడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, రొసారియో ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అదే నెలలో అసుంటా మ్యూజిక్ క్లాస్‌లో మగతగా ఉండటాన్ని ఆమె టీచర్ గుర్తించారు. తన తల్లి తనకు ఏదో పౌడర్ ఇచ్చిందని, దాని వల్ల నిద్ర వచ్చిందని టీచర్‌కు చెప్పింది అసుంటా.

అల్ఫోన్సో జులై (మ్యూజిక్ క్లాస్‌లో అసుంటా నిద్రపోయిన నెల), సెప్టెంబర్ (అసుంటా మరణానికి కొన్ని రోజుల ముందు) నెలల్లో పెయిన్ కిల్లర్ లారాజెపెమ్ డ్రగ్‌ బాక్సులను అనేకం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఆ మందులు తన భార్య కోసమంటూ, ఆమె ఎన్నోసార్లు ఆసుపత్రి పాలైందంటూ ప్రతీసారి అల్ఫోన్సో చెప్పుకొచ్చారు.

విచారణ, సీన్ రీక్రియేషన్

ఈ కేసు మౌఖిక విచారణ 2014 జూన్‌లో మొదలైంది.

అయితే, ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించిన తర్వాత 2015 సెప్టెంబర్ 29న కోర్ట్ ఆఫ్ లా కొరునాలో అసలైన విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విచారణలో 84 మంది సాక్షులు, 60 మంది నిపుణులు పాల్గొన్నారు.

నిజాలను తెలుసుకోవడానికి అన్ని రకాల సాక్ష్యాలను క్రోడీకరించారు.

ఫోరెన్సిక్ నిపుణులు బాలిక మృతి చెందిన కచ్చితమైన సమయాన్ని గుర్తించలేకపోయారు. సుమారుగా సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో ఆమె చనిపోయి ఉండొచ్చని వారు అంచనా వేశారు.

దీంతో ఆ రోజు అందుబాటులో ఉన్న వారి వాంగ్మూలాలు, ఘటనా స్థలంలోని కెమెరాలపై ఆధారపడి దర్యాప్తు చేశారు.

సీన్ రీకన్‌స్ట్రక్షన్

పరిశోధకులు చేసిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రకారం 2013 సెప్టెంబర్ 21న జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి:

  • అసుంటా మధ్నాహం 1:55 గంటలకు సాంటియాగో డి కంపోస్టెలాలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి తన తండ్రి అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్లు ఒక సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. అక్కడ అల్ఫోన్సో, రొసారియోలతో కలిసి అసుంటా మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత, సాయంత్రం 5:21 గంటలకు ఒంటరిగా తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లినట్లు అదే సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది.
  • రొసారియో సాయంత్రం 6:21 గంటలకు తన గ్యారేజీలోకి వెళ్లడం కనిపించింది. అక్కడి నుంచే ఆమె టియోలోని తమ కుటుంబానికి ఉన్న మరో ఇంటికి బయల్దేరారు. ఈ ఇంట్లోనే నారింజ రంగు తాళ్లు కనిపించాయి. అసుంటా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, సాంటియాగోలో తన ఇంట్లో రాత్రి 7 గంటలకు అసుంటాను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లానని, కొన్ని గంటల తర్వాత తిరిగొచ్చేసరికి అమ్మాయి కనిపించలేదంటూ రొసారియో పేర్కొన్నారు. అయితే, అసుంటాతో కలిసి రొసారియో కారులో టియో వైపు వెళ్తున్నట్లుగా దారిలోని ఒక గ్యాస్ స్టేషన్‌ కెమెరాలో రికార్డయింది.
  • సాయంత్రం 6:35 గంటలకు టియోలోని ఇంట్లో ఉన్న అలారమ్‌ను డీయాక్టివేట్ చేశారు.
  • రాత్రి 8:53 గంటలకు అలారమ్ మోగింది. అదే సమయంలో కారులో ఉన్న రొసారియోను పొరుగింటివారు పలకరించారు. కానీ, వారు పాపను చూడలేదు.
  • ఇక, అల్ఫోన్సో తన వాంగ్మూలంలో ఆరోజు మధ్యాహ్నం అంతా తన ఇంట్లోనే ఉన్నట్లు ఏదో చదువుకున్నట్లు చెప్పారు. కానీ, 9 గంటల సమయంలో సెక్యూరిటీ కెమెరాల్లో ఆయన కనిపించారు. 9:05 గంటలకు అసుంటా సెల్‌ఫోన్‌ మోగింది. ఆ తర్వాత ఆమె తండ్రి ఫోన్ నుంచి వివిధ నెంబర్లకు 20 కాల్స్ వెళ్లాయి.
  • రాత్రి 10:31 గంటలకు సాంటియాగోలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో తమ దత్త పుత్రిక కనిపించడం లేదంటూ రొసారియో, అల్ఫోన్సో ఫిర్యాదు నమోదు చేశారు.
  • అర్ధరాత్రి దాటాక బాలిక చనిపోయి పడి ఉండటాన్ని గుర్తించిన యువ జంట రాత్రి 1:30 గంటలకు మృతదేహం గురించి సివిల్ గార్డ్‌కు సమాచారం ఇచ్చారు.
  • సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం 7 గంటలకు ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  • ఈ కేసు విషయంలో రొసారియో, అల్ఫోన్సో తాము అమాయకులమనే నమ్మించారు.
  • జ్యూరీ 2015 అక్టోబర్ 30న వారిద్దరినీ దోషులుగా నిర్ధరించింది. తన మాజీ భర్త సహకారంతో రొసారియో ఆ బాలికను ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా జ్యూరీ గుర్తించింది.
  • రెండు వారాల తర్వాత అంటే నవంబర్ 12న ఈ కేసులో వారిద్దరికీ 18 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఎందుకు చంపారు?

తీర్పులో అసుంటాను ఎందుకు చంపారనేది వెల్లడించలేదు. ఈ కేసులో నేటికి కూడా ఇది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.

అసుంటాను హత్య చేయడానికి దారి తీసిన అనేక కారణాలంటూ అనేక విషయాలు బయటకువచ్చాయి. కానీ, వీటిలో ఏదీ కచ్చితంగా నిర్ధారితం కాలేదు.

విడాకుల తర్వాత మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రొసారియో, అల్ఫోన్సోలు తమ సంబంధానికి అసుంటాను అడ్డంకి అని సూచనప్రాయంగా అనుకుంటున్నారు.

రొసారియో మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా దీనికి ఒక కారణమయ్యే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. విచారణ సమయంలో ఆమెకు ఉద్వేగ అస్థిరత, డిప్రెషన్, యాంగ్జైటీ, చనిపోవాలనే కోరిక ఉన్నట్లుగా నిర్ధారితమైంది.

ఆర్థికపరమైన కారణాలతో పాటు లైంగిక ఉద్దేశాలను కూడా ఈ కేసుకు ఆపాదించారు. కానీ, తర్వాత ఆ ఉద్దేశాలను తోసిపుచ్చారు.

ఇలా, ఈ కేసు అనేక సమాధానాలు లేని ప్రశ్నలతో మిగిలిపోయింది.

రొసారియో, అల్ఫోన్సోలకు ఏమైంది?

రొసారియో పోర్టో 2020 నవంబర్ 18న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంటే ముందు కూడా ఆమె రెండుసార్లు విఫలయత్నం చేశారు. అల్ఫోన్సో శిక్షను అనుభవిస్తున్నారు. 2031 వరకు ఆయన జైలులోనే ఉంటారు.

అల్ఫోన్సో 2017లో జైలునుంచి రామోన్ కాంపోస్‌కు ఒక లేఖ రాశారు. ద అసుంటా కేస్ సిరీస్ సృష్టికర్తే రామోన్ కాంపోస్.

లేఖలో కూడా ఆయన తాను అమాయకుడినని మరోసారి పేర్కొన్నారు. నిజమైన హంతకుల నుంచి తన కూతుర్ని రక్షించలేకపోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు.

‘‘జైలులో ఉండటం నాకు అసలైన శిక్ష కాదు. కానీ, నా కూతురికి సహాయపడలేని స్థితిలో ఉండటం నాకు అసలైన శిక్ష. నన్ను నేను ఎప్పుడూ క్షమించుకోలేను’’ అంటూ ఆయన లేఖలో రాశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-04T12:47:09Z dg43tfdfdgfd