కట్టు తప్పి వీధుల్లో పరుగులు పెట్టిన సైనిక గుర్రాలు.. పలువురికి గాయాలు.. వీడియో వైరల్

రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా పరుగులు తీస్తూ జనాలను గుర్రాలు హడలెత్తించాయి. వీటి నుంచి తప్పించుకోడానికి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. లండన్ విధుల్లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఐదు మిలటరీ గుర్రాలు కట్టుతప్పి రోడ్లపై పరుగులు తీశాయి. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొంటూ అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లాయి. బలిష్ఠంగా ఉన్న ఆ అశ్వాల నుంచి తప్పుకొనేందుకు చేసిన ప్రయత్నంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే, ఐదు గుర్రాల్లో ఒకటి రక్తమోడుతూ ఉంది.

ఏం జరిగిందంటే.. జూన్‌లో కింగ్ ఛార్లెస్-3 పుట్టినరోజు కావడంతో.. ఆ వేడుకల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కవాతుకు రిహార్సిల్ నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ రాజభవనం బకింగ్‌హమ్ ప్యాలెస్ వద్ద విన్యాసాలు జరుగుతున్న సందర్భంగా సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో ఆ శబ్దానికి భయపడిపోయిన సైనిక గుర్రాలు రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీశాయి. ఆల్డ్‌విచ్‌ మార్గంలోని భారత హై కమిషన్‌ కార్యాలయం ఎదురుగా కార్లను, డబుల్ డెక్కర్ బస్సును ఢీకొంటూ గుర్రాలు పరుగెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ గుర్రాలను అదుపులోకి తీసుకొని, వైద్యచికిత్స అందిస్తున్నట్లు బ్రిటిష్‌ ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడిన ముగ్గురు సైనికులను కూడా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. గుర్రాలు బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి ఐదు మైళ్ల కంటే ఎక్కువ దూరం పరుగులు తీశాయని, తూర్పు లండన్‌లోని లైమ్‌హౌస్ వద్ద చివరకూ పట్టుకున్నామని తెలిపారు. ఘటనలో ముగ్గురు సైనికులు, ఓ సైకిలిస్ట్ గాయపడ్డారు. బుధవారం ఉదయం సాధారణ కవాతు జరుగుతున్న సమయంలో పక్కనే నిర్మాణం జరుగుతున్న భవంతి నుంచి వచ్చి శబ్డానికి గుర్రాలు భయపడినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T07:48:19Z dg43tfdfdgfd