గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్ని, రాజకీయ విశ్లేషకుల్ని విపరీతంగా ఆకర్షించిన నియోజకవర్గం గాజువాక. ఐదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో గాజువాక పేరు తరచూ వినిపిస్తూనే ఉంది.

ఒకప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న గాజువాక 2009 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. పెందుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు అక్కడ పోటీ చేసిన ఇద్దరు ప్రముఖుల వారసులు, ఆ నియోజకవర్గం నుంచి విడిపోయి పుట్టిన గాజువాకలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.

ఇది ఈ ఎన్నికల్లో ఆసక్తిని కలిగించే అంశం.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన ఓటర్లు గాజువాక నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గం మినీ ఇండియా. ఇక్కడ స్థానికత అనే మాటకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

ఇక్కడ పోటీపడ్డ ఆ తండ్రి కొడుకులు ఎవరు? 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? గాజువాకలో ధనికులైన ఓటర్లు ఉండడానికి కారణాలేంటి?. వీటితో పాటు గాజువాక నియోజకవర్గానిక సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది?

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గాజువాక నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు ఇది పెందుర్తి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో గాజువాక, పెదగంట్యాడ మండలాలున్నాయి. గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో జనసాంద్రత.

2011 జనాభా లెక్కల ప్రకారం గాజువాక జనాభా 2లక్షల 52 వేలు. ప్రస్తుతం అది 5 లక్షలు ఉండవచ్చన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు.

ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు వేర్వేరు పార్టీలు గెలిచాయి. నియోజకవర్గంలో 3,28,468 మంది ఓటర్లున్నారు.

2009లో గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్‌కు తొలి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సి.హెచ్. వెంకటరామయ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై 17,907 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస రావు, తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 27,712 ఓట్లతో విజయం సాధించారు.

2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయాన్ని సాధించారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఓడిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో గాజువాక పేరు మార్మోగింది.

1989లో తండ్రులు, 2024లో కొడుకులు

గాజువాకలో ప్రస్తుతం పోటీ పడుతున్న గుడివాడ అమర్నాధ్, పల్లా శ్రీనివాసరావుల తండ్రులు 1989లో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు ఎన్నికల బరిలో దిగారు. అప్పుడు వారు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే...వారి వారసులు పెందుర్తి నుంచి విడిపోయి పునర్విభజనలో ఏర్పడిన గాజువాకలో ప్రత్యర్ధులుగా పోటీ పడుతున్నారు.

1989 ఎన్నిక‌ల్లో పెందుర్తి నియోజ‌క వర్గం నుంచి గుడివాడ అమ‌ర్నాధ్ తండ్రి గుడివాడ గురునాధ‌రావు కాంగ్రెస్ పార్టీ నుంచి...ప‌ల్లా శ్రీనివాస‌రావు తండ్రి ప‌ల్లా సింహాచ‌లం టీడీపీ నుంచి పోటీ చెశారు. ఈ ఎన్నికలో ప‌ల్లా సింహాచ‌లంపై గుడివాడ గురునాధరావు 19,903 ఓట్లు తేడాతో విజ‌యం సాధించారు.

ఇది జరిగి 35 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు వారి కుమారులైన పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాధ్ ప్రత్యర్థులుగా పోటీకి దిగారు. అయితే ఈసారి గాజువాక నియోజకవర్గం నుంచి వీరు ఎన్నికల బరిలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ

విశాఖ ఎంపీ సీటు విషయంలో గాజువాక నియోజకవర్గం కీలకం. 2019లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో గాజువాకకి పొలిటికల్ క్రేజ్ వచ్చింది.

అప్పటికే గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా 2009, 2014ల్లో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డి వైసీపీ తరపున రంగంలోకి దిగారు.

గాజువాకలో కాపు, యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. రెడ్డిక (రెడ్డి కాదు), గవర, వెలమ ఇతర బీసీ సామాజికవర్గాలకు 20వేల చొప్పున ఓట్లు ఉన్నాయి. 2009లో పీఆర్పీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే...2014లో యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు.

2019లో రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన తిప్పల గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గాజువాక నియోజకవర్గం వార్తల్లోనే ఉంటూ వచ్చింది.

“కాపులు ఎక్కువగా ఉండటంతో పాటు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానులు గాజువాకలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ 2019లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు.” అని రాజకీయ విశ్లేషకుడు యుగంధర్ రెడ్డి అన్నారు.

గాజువాక నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే గాజువాక ప్రజలు వినూత్న తీర్పు ఇస్తూ వస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం, 2019 లో వైసీపీలను గెలిపించారు.

ధనిక ఓటర్లకు కేరాఫ్ గాజువాక నియోజకవర్గం

ఏపీలో అధిక తలసరి ఆదాయం ఉన్న నియోజకవర్గం గాజువాక అని ఏయూ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

“2019-2020 ఆంధ్రప్రదేశ్ సోషియో-ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం గాజువాక ప్రజల తలసరి ఆదాయం రూ. 2,64,232. ఇది 2022-2023 సంవత్సరానికి గానూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగం లెక్కించిన ఏపీ తలసరి ఆదాయం రూ. రూ. 2, 19,518 కంటే ఎక్కువ.

నియోజకవర్గాల వారీగా అభివృద్ధి రిపోర్టుని రూపొందించిన ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల్లోని పరిశ్రమలు, సేవల రంగం, వ్యవసాయం, రహదారులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించింది.” అని ప్రొఫెసర్ ప్రసాదరావు చెప్పారు.

ప్రస్తుతం అంచనాల ప్రకారం గాజువాక తలసరి ఆదాయం రూ. 3 నుంచి 3.5 లక్షల వరకు ఉండవచ్చని అన్నారు.

పరిశ్రమలే ఇక్కడి ధనానికి మూలం...

గాజువాకలో స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్, ఐవోసీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, షిప్ యార్డ్ ఇలా అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయి. తూర్పు నౌకదళం, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్డర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి.

ఇక్కడి పరిశ్రమల్లో భారీ వేతనాలకు పని చేసే ఉద్యోగులు, ఈ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి వలనే మొత్తం గాజువాక తలసరి ఆదాయం పెరిగిందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు తెలిపారు.

భారీ పరిశ్రమలతో పాటు వాటి అవసరాలు తీర్చేందుకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు అనేకం ఉన్నాయని చెప్పారు.

స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం 16వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 వేల మంది ఉన్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకే 1200 చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పడ్డాయి. వీటి నుంచి భారీగా ఆదాయం జనరేట్ అవుతుంది.

ఇదో మినీ ఇండియా

కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పరిశ్రమలు, వాటి అనుబంధ సంస్థలు గాజువాకలో చాలా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడిపోయారు. వారు ఓటర్లుగా మారారు.

“గాజువాక అనేది మినీ ఇండియా లాంటింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఆ ప్రాంతానికి అనేక మంది వచ్చి ఉండటంతో ఇక్కడ ఒకరి డామినేషన్ ఉండదు. స్థానికత అనేది ఇక్కడ పనిచేయదు. పైగా దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉండటంతో దేశ రాజకీయాలను ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అందుకే గాజువాక ఎంపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లను తెచ్చే నియోజకవర్గంగా పేరు పొందింది. ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి సాధించే ఓట్లే విజయానికి కారణమైన సందర్భాలు అనేకం ఉన్నాయి.” అని సీనియర్ జర్నలిస్ట్ బి. రవికాంత్ బీబీసీతో చెప్పారు.

ఏనుగులు స్నానాలు చేసే ప్రాంతం

గాజువాక విశాఖ జిల్లాలో ఉండటంతో గాజువాక ఉన్న పరిశ్రమల కారణంగా విశాఖకి పారిశ్రామిక నగరం అనే పేరు వచ్చింది.

అలాగే గాజువాక పేరు వెనుక కూడా ఆసక్తికరమైన చరిత్ర ఉందని ఏయూ హిస్టరీ విభాగం ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ అన్నారు.

"గాజువాకలో ఒకప్పుడు గాజులు అమ్మేవారు అధిక సంఖ్యలో ఉండేవారు. అందువలనే ఈ ప్రాంతానికి గాజువాక అని పేరు వచ్చిందని చెప్తుంటారు. కానీ అది తప్పు. గాజువాకలో ఎన్నడూ గాజులు అమ్మే వ్యాపారులు ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, 150 ఏళ్ల క్రితం గాజువాకలో పెద్ద వాగు ఉండేది. దాంతో ఏనుగులకు స్నానం చేయించడానికి మావటీలు తీసుకుని వచ్చేవారు. ఏనుగుని గజం అంటారు. ఏనుగులు స్నానాలు చేసే వాగును గజాల వాగు అనేవారు. అది కాలక్రమంలో గాజువాకగా స్థిరపడింది" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

2024-05-02T10:09:16Z dg43tfdfdgfd