చేతబడి పేరుతో ఇద్దరి సజీవ దహనం, నిందితుల్లో బాధితురాలి భర్త, కొడుకు

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని సజీవ దహనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగింది.

మహిళను దహనం చేసిన నిందితుల్లో బాధితురాలి భర్తతో పాటు కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఈ ఘటనలో 57 ఏళ్ల మహిళ జామ్నీ దేవాజీ తెలామితో పాటు అదే వయస్సున్న మరో వ్యక్తి దేవు కటియా అట్లామి ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలోని ఈతపల్లి తహశీల్‌ మారుమూల గ్రామం బర్సెవాడలో ఈ ఘటన జరిగింది. ఈ రీజియన్‌లో ఎక్కువగా మాడియా గిరిజనులు నివసిస్తుంటారు. ఈ గిరిజనులు చేతబడి, క్షుద్రపూజలు వంటి మూఢనమ్మకాలను బలంగా నమ్ముతారు.

ఇలాంటి నమ్మకాలే ఈ దారుణ ఘటనకు దారి తీశాయని అనుమానిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మే 1న రాత్రి 8 నుంచి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో సంబంధమున్న 15 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసు ఏంటి?

ఈతపల్లి సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ చైతన్య కడమ్ ఈ కేసు గురించి బీబీసీకి వెల్లడించారు. బర్సెవాడకు చెందిన జామ్నీ దేవాజీ తెలామిని ఆమె కుటుంబసభ్యులతో పాటు ఇతర గ్రామస్తులు కలిసి సజీవ దహనం చేశారని ఆయన చెప్పారు

‘‘జామ్నీపై చేతబడి చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. సొంత కుటుంబీకులే ఆమెను అనుమానించేవారు. జామ్నీ తమపైనే చేతబడి చేస్తోందంటూ సొంత కుటుంబ సభ్యులే ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం జామ్నీ మూడేళ్ల మనవరాలు అకస్మాత్తుగా చనిపోయారు. జామ్నీ చేతబడి చేయడం వల్లే పాప చనిపోయిందని కుటుంబీకులు అనుమానించారు.

ఆ తర్వాత కొన్నిరోజులకే జామ్నీ కోడలికి గర్భస్రావం అయింది. ఆ కుటుంబం అలా మరో బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ఇలాంటి బాధాకర ఘటనలు జరుగుతుండటంతో వారు తీవ్రంగా నిరాశ చెందారు’’ అని చైతన్య చెప్పారు.

జామ్నీ చేతబడి, క్షుద్రపూజలు చేసినట్లుగా గ్రామంలో ఊహాగానాలు వచ్చాయి. జామ్నీ తన పూజలతో పిల్లలకు హాని తలపెడుతుందంటూ సొంత కుటుంబీకులే ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశారు.

జామ్నీ భర్త దేవాజీ తెలామీ గ్రామ పంచాయతీని సమావేశపరిచి జామ్నీ గురించి చర్చించారు. పంచాయతీ పెద్దలు జామ్నీని విచారించారు.

తాను అలాంటి పనులు చేయలేదంటూ ఆమె తనపై వచ్చిన ఆరోపణల్ని తిరస్కరించారు. తాను చేతబడి చేయలేనని ఆమె చెప్పారు. అయితే, దేవు కటియా అట్లామి చేతబడి చేస్తున్నట్లుగా జామ్నీ చెప్పినట్లు ఆమె సోదరుడు పోలీసులకు వెల్లడించారు.

దీంతో జామ్నీతో పాటు దేవును పంచాయతీ ఎదుటే తీవ్రంగా కొట్టారు. తర్వాత గ్రామ సమీపంలోని ఒక వాగు వద్దకు వారిని తీసుకెళ్లి ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసులకు ఈ విషయం ఎలా తెలిసింది?

మే 1న బర్సెవాడ గ్రామ పంచాయతీ సమావేశమైనప్పుడు బాధితురాలి సోదరుడు సాధు మాసా ముహోండా కూడా అక్కడే ఉన్నారు. ఆయన ద్వారానే పోలీసులకు ఈ విషయం తెలిసింది.

తన సోదరిని గ్రామస్థులు, సొంత కుటుంబీకులంతా కలిసి క్రూరంగా కొడుతుండటంతో ఆయన వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనపై కూడా వారు పెట్రోల్ పోశారు. వెంటనే భయంతో సాధు అక్కడి నుంచి పారిపోయారు.

ఆ మరుసటి రోజు తన సోదరిని సజీవ దహనం చేసినట్లు సాధుకు తెలిసింది. వెంటనే ఆయన ఈతపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో బాధితులిద్దరి అవశేషాల్ని గుర్తించారు.

ఘటన జరిగిన తీరును బీబీసీతో మాట్లాడుతూ సాధు మాసా వివరించారు. ‘‘మా బావ నా సోదరిని తీసుకొచ్చి మా ఇంట్లో విడిచి వెళ్లారు. ఆరోజు రాత్రి ఆమె మా ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు దాదాపు 10-12 మంది బర్సెవాడ గ్రామస్థులు వచ్చి బలవంతంగా ఆమెను మా ఇంటి నుంచి తీసుకెళ్లారు.

ఆమె వారితో వెళ్లడానికి నిరాకరించింది. నేను కూడా వారి వెంటే బర్సెవాడ వెళ్లాను. అక్కడ గ్రామస్తులంతా గ్రామ పంచాయతీ సమావేశంలో కూర్చున్నారు. వారు మా సోదరిపై దాడి చేశారు. నేను వారిని అడ్డుకునేందుకు వెళ్తే నన్ను కూడా కొట్టారు. నాపై పెట్రోల్ పోశారు. నేను భయంతో అక్కడినుంచి పారిపోయాను. తర్వాత వారు మా సోదరిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. వారికి ఉరి శిక్ష వేయాలి’’ అని ఆయన అన్నారు.

15 మంది అరెస్ట్

కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామస్తులను విచారించారు. అనంతరం 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బాధితురాలి భర్త దేవాజీ తెలామి, కుమారుడు దివాకర్ తెలామి కూడా ఉన్నారు.

ఐపీసీలోని 302, 307, 201, 143, 147, 149 సెక్షన్లతోపాటు మహారాష్ట్ర మూఢనమ్మకాల నిరోధక చట్టం 2013 కింద అభియోగాలు మోపారు.

అహేరీలోని మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చిన తర్వాత వారందరికీ 5 రోజుల పోలీస్ కస్టడీ విధించారు.

‘‘అది చాలా మారుమూల గ్రామం. అక్కడ పెట్రోల్ దొరకడం అంత ఈజీ కాదు. కేసులోని అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నాం. గ్రామస్తులు ఎక్కడి నుంచి పెట్రోల్ తెచ్చారు? కుట్ర చేసి ఈ హత్యలకు పాల్పడ్డారా? వంటి అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేస్తున్నాం’’ అని పోలీసు అధికారి చైతన్య చెప్పారు.

ప్రజల్ని చేరని చట్టం

మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిరోధక చట్టం 2013లో అమల్లోకి వచ్చింది. నరబలి, అమానవీయ, చెడు, మంత్ర విద్యల నిర్మూలన అవగాహన పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.

ఈ చట్టం అమల్లోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, చేతబడి నెపంతో ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇంకా జరుగుతున్నాయి.

ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమంటూ అఖిల భారత మూఢనమ్మకాల నిర్మూలన సమితి విమర్శించింది. చేతబడి, క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలతో నేటికీ మనుషుల ప్రాణాలను తీయడం సిగ్గుచేటని సమితి జాతీయ అధ్యక్షుడు సురేశ్ జుర్మురే అన్నారు.

‘‘మూఢ నమ్మకాల నిరోధక చట్టంపై అవగాహన పెంచడానికి మేం కృషి చేస్తున్నాం. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం అందట్లేదు.

గ్రామ సేవకులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు వంటి వారందరినీ ప్రభుత్వం ఏకతాటిపైకి తెచ్చి ఇలాంటి విషయాలపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించాలి.

కానీ, మా డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రామస్థాయిలో ఈ చట్టంపై అవగాహన కల్పించి ఉంటే గడ్చిరోలిలో జరిగినటువంటి ఘటనల్ని నివారించి ఉండేవాళ్లం’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-04T15:53:10Z dg43tfdfdgfd