జర్మనీ: లైంగికంగా వేధించారేమోనని 7 నెలల వయసులోనే భారత చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేశారు

‘‘తల్లిదండ్రులున్నప్పటికీ నా కూతురు అనాథలా బతుకుతోంది. రెండేళ్లుగా నేను ఆమె‌కు దూరంగా ఉంటున్నాను. నా కూతురికి ఆకలిగా ఉంటే ఎవరు అన్నం తినిపిస్తున్నారు? ఆమెను ఎవరు చూసుకుంటున్నారు? బిడ్డ నా పాల కోసం ఏడుస్తున్నప్పుడు ఆమెను నా నుంచి దూరం చేశారు. నా కూతుర్ని త్వరగా నా వద్దకు చేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని చేతులు జోడించి కోరుతున్నా’’ అంటూ ధారా షా కన్నీరుమున్నీరవుతున్నారు.

రెండేళ్ల ఆమె కూతురు అరిహా జర్మనీలోని బెర్లిన్‌లో ఒక అనాథ శరణాలయంలో ఉంది.

జర్మన్ ప్రభుత్వం అరిహాను ఏడాదిన్నరగా అక్కడే ఉంచుతోంది.

అరిహా తల్లి ధారా, తండ్రి భవేష్ షా తమ కూతుర్ని తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లుగా పోరాడుతున్నా వారి కూతురు వారి వద్దకు రాలేదు.

అరిహాను ఎందుకు తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు? ఎందుకు అనాథ శరణాలయంలో ఉంచారు?

ఆస్పత్రిలో ఏం జరిగింది?

అహ్మదాబాద్‌కు చెందిన భవేష్ షా తన భార్య ధారా షాతో కలిసి జర్మనీలో నివసించే వారు.

తమ 7 నెలల కూతురు అరిహాతో చూడముచ్చటగా ఉండేది ఈ కుటుంబం. కూతురి నవ్వులతో ఎప్పుడూ ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండేది.

2021 సెప్టెంబర్ నెలలో, అరిహా యోనికి దగ్గర్లో రక్తం కనిపించడంతో, ఆమెను దగ్గర్లోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు భవేష్, ధారా షా. డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారు.

చికిత్స చేసినప్పటికీ, ఆ తర్వాత రోజు మళ్లీ యోనిలో రక్తం కనిపించింది. దీంతో అరిహాను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు డాక్టర్లు.

అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అరిహాను తమ వద్ద నుంచి తీసేసుకున్నారు. అసలేం జరిగిందో భవేష్, ధారాలకు అర్థం కాలేదు.

ఇది లైంగిక వేధింపుల కేసు అని పిల్లల సంరక్షణ బృందానికి డాక్టర్లు చెప్పారు.

వెంటనే రంగంలోకి దిగిన వీరు ఆస్పత్రిలోనే 7 నెలల అరిహాను తల్లిదండ్రుల నుంచి తీసేసుకుని, బెర్లిన్‌లోని అనాథ శరణాలయానికి తీసుకెళ్లారు.

‘‘ఇంత చిన్న వయసులో కూతుర్ని ఎవరైనా తల్లిదండ్రులు లైంగికంగా వేధిస్తారా? మేమే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమెకు చికిత్స చేయాల్సింది పోయి, మమ్మల్ని నిందిస్తున్నారు. మేం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. భారత్‌‌కు వేల కి.మీల దూరంలో ఉన్న మాకు ఈ పరిస్థితి ఎదురైంది’’ అని అరిహా తండ్రి భవేష్ షా అన్నారు.

భాష తమకు చాలా సమస్యాత్మకంగా మారిందని, ఆ సమయంలో ఒక పాకిస్తానీ ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకున్నట్లు చెప్పారు. భవేష్, ధారా తమ అభిప్రాయాలను జర్మన్ అధికారులకు తెలియజేసినప్పటికీ, వారు తమ కూతురి విషయంలో ఎలాంటి ఊరటను పొందలేకపోయారు.

ఆ తర్వాత జర్మన్ అధికారులు భవేష్, ధారాలపై ఫిర్యాదు దాఖలు చేశారు.

ఈ ఫిర్యాదు దాఖలైన ఐదు నెలల తర్వాత, అరిహా లైంగిక వేధింపులకు గురి కాలేదనే రిపోర్టు వెలువడింది.

ఈ కేసులో అరిహా తల్లిదండ్రులకు క్లీన్ చీట్ వచ్చింది. ఇక తమ కూతుర్ని తాము పొందొచ్చని భవేష్, ధారా ఆశించారు. కానీ, అలా జరగలేదు.

తల్లిదండ్రులుగా మీరు అర్హులేనా?

జర్మన్ ప్రభుత్వ చట్టాల ప్రకారం తల్లిదండ్రులు ‘పేరెంటల్ ఎబిలిటీ రిపోర్ట్’ను సమర్పించాలి.

ఈ సర్టిఫికేట్ కోసం సైకియాట్రిస్ట్‌ల చేత కూతుర్ని చూసుకునేందుకు తాము తల్లిదండ్రులుగా అర్హులమని చెక్ చేయించుకోవాలి.

ఈ సర్టిఫికేషన్ ప్రక్రియకే ధారా, భవేష్‌లకు ఏడాది పాటు పట్టింది.

‘‘సైకాలజిస్ట్‌లు ఎన్నో వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారు. మీరెక్కడ పుట్టారు? ఇంట్లో ఎవరుంటారు? ఎలాంటి వాతావరణంలో మీరు పెరిగారు? పెళ్లి జీవితం ఎలా ఉంది? పిల్లల్ని కనే ముందే వారిని సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అడిగారు" అని ధారా షా చెప్పారు.

నెలకు రెండుసార్లు అరిహాను కలిసే అవకాశం భవేష్, ధారాలకు కల్పించారు.

‘‘మేం మా పాపను కలిసినప్పుడు, ముందట్లగానే మేం దగ్గరగా ఉన్నట్లు భావించాం. ఎలాంటి తేడాను నేను గుర్తించలేదు. మేం ఆమెను చూడటానికి వెళ్లినప్పుడు తను కూడా వేచిచూసేది. పొద్దున ఏమీ తినకపోయేది. మేం తీసుకెళ్లిన ఏదైనా చాలా ఇష్టంగా తినేది. ఈ చైల్డ్‌కేర్ సెంటర్‌లో పనిచేసే వారు కూడా, అరిహాకు భారతీయ వంటలంటే ఎంతో ఇష్టమని చెప్పేవారు. అలాగే, మమ్మల్ని బాగా మిస్ అయ్యేదని తెలిపారు" అని ధారా గుర్తుచేసుకున్నారు.

అయితే పాప‌కు ‘అటాచ్‌మెంట్ డిజార్డర్’ఉన్నట్లు సైకియాలజిస్ట్‌లు చెప్పినట్లు ధారా అన్నారు.

భారతీయ సంప్రదాయం ప్రకారం, పిల్లలు పుట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీతో కలిసి పెరుగుతుంటారని, ఇందులో ‘అటాచ్‌మెంట్ డిజార్డర్’ ఎక్కడుందని ధారా ప్రశ్నించారు.

పేరెంటల్ ఎబిలిటీ రిపోర్ట్‌ ప్రక్రియను ఏడాదిలో పూర్తి చేసిన తర్వాత, అరిహాను చూసుకునేటప్పుడు చాలా విషయాలను పాపకు నేర్పించలేకపోయామని పేరెంటల్ ఎబిలిటీ రిపోర్టులో నివేదించారు.

ప్రస్తుతం ధారా లేదా భవేష్‌లలో ఎవరో ఒకరు పాపతో కలిసి ఉండే అవకాశం ఉంది. కానీ, దీనిపై ఇంకా కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.

పేరెంటల్ ఎబిలిటీ రిపోర్టును బట్టి కోర్టు తీర్పు ఇవ్వనుంది. జూన్ రెండో వారంలో ఈ తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన

అరిహాను భారత్‌లోని పేరెంట్ చైల్డ్ కేంద్రానికి తీసుకురావాలని బీబీసీ ద్వారా ప్రధాని మోదీకి అభ్యర్థన పెట్టుకున్నారు భవేష్, ధారా.

అరిహా విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ సాయం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే కోరారు. త్వరలోనే అరిహా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-05-28T08:09:35Z dg43tfdfdgfd