నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

  • సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి
  • ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య
  • అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ

బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరు అవుతానని వెల్లడించారు. అయితే, అందుకు ఏడు రోజుల గడువు కావాలని కోరారు.

తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ  ప్రజ్వల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్‌‌బుక్ లో బుధవారం ఓ పోస్ట్‌‌ పెట్టారు. " నేను బెంగళూరులో లేనందున విచారణకు హాజరు కాలేకపోతున్నాను. అయినా కేసు దర్యాప్తులో భాగంగా నా లాయర్  ద్వారా  బెంగుళూరు సీఐడీతో కమ్యూనికేట్ అయ్యాను. త్వరలో నిజం గెలుస్తుంది" అని ప్రజ్వల్ పోస్ట్‌‌ చేశారు.

ప్రజ్వల్ పాస్‌‌పోర్ట్‌‌ రద్దుకు చర్యలు తీసుకోండి 

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోకుండా అతని డిప్లోమాటిక్ పాస్‌‌పోర్ట్‌‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కర్నాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. ప్రజ్వల్ విదేశాల్లో పర్యటించేందుకు తన డిప్లోమాటిక్ పాస్‌‌పోర్ట్‌‌ను ఉపయోగిస్తున్నాడని తెలిపారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లెటర్ రాశారు. పరారీలో ఉన్న ప్రజ్వల్ త్వరగా భారత్ వచ్చేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని తన లేఖ ద్వారా ప్రధానికి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు.

ప్రజ్వల్​పై నమోదైన లైంగిక ఆరోపణల కేసును దర్యాప్తు చేయడానికి సిట్ 24 గంటలు పనిచేస్తున్నదని తెలిపారు. అతన్ని తిరిగి దేశానికి రప్పించడం చాలా ముఖ్యమన్నారు. అప్పుడే, అతనిపై చట్ట ప్రకారం విచారణకు అవకాశం ఉంటుందన్నారు. అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీలు, విదేశీ వ్యవహారాల శాఖలు, హోంశాఖలను కేంద్రం అప్రమత్తం చేయాలని రిక్వెస్ట్ చేశారు.

ఇదంతా దేవెగౌడ ప్లాన్

మహిళలపై లైంగిక వేధింపుల కేసు నుంచి ప్రజ్వల్ తప్పించుకొని విదేశాలకు వెళ్లేలా మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ ప్లాన్ చేశారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. కర్నాటకలోని యాద్గిర్ జిల్లా దేవత్‌‌కల్ గ్రామంలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడారు.  'ప్రజ్వల్ విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్, వీసా ఎవరిచ్చారు? అలా చేసింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రానికి తెలియకుండా అతను విదేశాలకు వెళ్లగలడా ? ఇదంతా  దేవెగౌడ ప్లాన్" అని  సిద్ధరామయ్య ఆరోపించారు.

వీడియోల లీకేజీలో  డీకే శివకుమార్ హస్తం లేదు

వీడియోల లీకేజీ వ్యవహారంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమేయం ఉందంటూ జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణల్ని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. సిట్ దర్యాప్తులో తమ పార్టీ జోక్యం చేసుకోదని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-02T02:44:33Z dg43tfdfdgfd