నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

  • ఆలయ భూమిని రంజిత్​రెడ్డి కబ్జా చేసింది నిజం కాదా?
  • చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి 

శంషాబాద్/శంకర్ పల్లి, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వందల కోట్ల విలువ చేసే జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం భూమిని కబ్జా చేసింది నిజం కాదా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. సదరు స్థలంలో వెంచర్ వేసి, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించడం నిజం కాదా అని నిలదీశారు. కబ్జా విషయాన్ని తాను బయటపెట్టడంతోనే పనులు ఆపారని, నిర్మాణాలు సక్రమమే అయితే పనులు ఎందుకు ఆపేశారన్నారు. రంజిత్​రెడ్డి కబ్జా చేశాడని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని విశ్వేశ్వర్​రెడ్డి సవాల్​విసిరారు.

సోమవారం శంషాబాద్ లోని ఓ ఫంక్షన్​హాల్​లో తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు మజ్దూర్ మహా సంఘ్ రవాణా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిషోర్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రంజిత్​రెడ్డి కబ్జాలపై బీజేపీ స్టేట్ ఆఫీసులో అన్ని ఆధారాలు ఉన్నాయని, దాణా, కోడిగుడ్ల స్కాంకు సంబంధించిన ఆధారాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్ద ఉన్నాయని చెప్పారు.

గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ హనుమాన్ ఆలయ భూమితోపాటు, సీతారాంపూర్​లోని 1100 ఎకరాల రామాలయం భూములను రంజిత్​రెడ్డితోపాటు ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ కేసులు కోర్టులో ఉన్నాయన్నారు. తాను ఎవరిపైనా లేనిపోని ఆరోపణలు చేయనని, ఒకవేళ రంజిత్​రెడ్డి తప్పు చేయకపోతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చన్నారు. బండారం బయటపడుతుందని రంజిత్​రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. 

దేశానికి బీజేపీ ప్రభుత్వమే రక్ష

బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని కొండా విశ్వేశ్వర్​రెడ్డి చెప్పారు. సోమవారం బీజేపీ శ్రేణులు శంకర్​పల్లిలోని బీడీఎల్ చౌరస్తా నుంచి శంకర్​పల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వర్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మోదీతో పాలనతో ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం పెరిగిందన్నారు. రంజిత్​రెడ్డి లోకల్​కాదని, గెలిపిస్తే మళ్లీ కనిపించని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, ప్రొద్దటూర్​మాజీ సర్పంచి నర్సింహారెడ్డి, కొత్తపల్లి ఎంపీటీసీ శోభ విశ్వేశ్వర్​రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నాయకులు ప్రభాకర్​రెడ్డి, రాములు, సురేశ్, వాసుదేవ్ తదితరులు 

పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:18:10Z dg43tfdfdgfd