భీమ్లా నాయక్ విషయంలో అన్యాయం జరిగింది... కేరాఫ్ కంచరపాలెం నటుడు ఆవేదన!

కేరాఫ్ కంచరపాలెం మూవీ అప్పట్లో ఒక సంచలనం. పెద్దగా పరిచయం లేని నటులతో, తక్కువ బడ్జెట్ తో కంచరపాలెం తెరకెక్కింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని గొప్పగా మార్చింది. వెంకటేష్ మహా ఈ చిత్ర దర్శకుడు. కేరాఫ్ కంచరపాలెంలో వినాయకుడు బొమ్మలు తయారు చేసే మూగవాడి పాత్ర చేశాడు కిషోర్ కుమార్. కేరాఫ్ కంచరపాలెం అనంతరం పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో కిషోర్ కుమార్ పాత్రకు నిడివి ఉంటుంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిషోర్ కుమార్ భీమ్లా నాయక్, ఆచార్య చిత్రాల విషయంలో అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన చెందాడు. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ లో ఓ పాత్రకు కిషోర్ కుమార్ ఎంపిక అయ్యాడట. ఒకరోజు షూటింగ్ కూడా చేశాడట. రెండో రోజు తన స్థానంలో మరొక నటుడిని తీసుకున్నారట. ఎందుకు అలా చేశారో అర్థం కాలేదట. 

అలాగే ఆచార్య మూవీలో కిషోర్ కుమార్ నటించాడట. 20 రోజులు షూటింగ్ చేశాడట. చిరంజీవి బాగా నటించావని మెచ్చుకున్నాడట. భుజం మీద చేయివేసి మాట్లాడేవాడట. తీరా సినిమా విడుదలయ్యాక తన సీన్స్ లేవట. ఎడిటింగ్ లో తీసేశారట. ఈ పరిణామం చాలా బాధకు గురి చేసిందట. చిత్ర పరిశ్రమలో ఇవన్నీ సాధారణమే. షూటింగ్స్ కి గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు నటులను మార్చేస్తూ ఉంటారు. మొదట్లో బాధ వేసేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. పెద్దగా బాధపడటం లేదని కిషోర్ కుమార్ అన్నారు. 

అలాగే నేపథ్యం లేకుండా రాణించడం కష్టమే అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. టాలెంట్ ఉన్నా కూడా పరిచయాలు లేకుంటే పరిశ్రమలో రాణించడం కష్టం. అవకాశాల కోసం అనేక పైరవీలు నడుస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ భజన చేస్తూ ప్రసన్నం చేసుకున్నవారికి ఏ ఢోకా ఉండదు. అందుకే చిత్ర పరిశ్రమలో ముఖస్తుతి చేసేవారికి, లౌక్యంగా మెలిగేవారికి మాత్రమే కెరీర్ ఉంటుంది. 

2024-04-23T11:20:16Z dg43tfdfdgfd