ముసలాయన హద్దుల్లో ఉంటే మంచిది.. కోట శ్రీనివాసరావుపై నట్టికుమార్ ఫైర్

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై (Kota Srinivasa Rao) నిర్మాత నట్టికుమార్ మండిపడ్డారు. కోట శ్రీనివాసరావుకు వయసు అయిపోయిందని.. ముసలాయన హద్దుల్లో ఉంటే మంచిదంటూ నట్టికుమార్ కాస్త ఘాటుగా మాట్లాడారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించి కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు ఈ విధంగా నట్టికుమార్ స్పందించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న ప్రస్తుత సమయంలో.. తనకు ప్యాకేజీలతో పనిలేదని, రోజుకి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నటుడిని తానని పవర్ స్టార్ రిప్లై ఇచ్చారు. సినిమాల్లో నటించడం ద్వారా తాను చాలా డబ్బు సంపాదిస్తున్నానని.. తాను ఎవరి దగ్గరా ప్యాకేజీ కోసం చేతులు చాచాల్సిన అవసరం లేదని తన రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం ద్వారా స్పష్టం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్‌ను బహిరంగంగా చెప్పడాన్ని కోట శ్రీనివాసరావు తప్పుబట్టారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కోట శ్రీనివాసరావును సన్మానించి ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు లాంటి గొప్ప నటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదని.. అలాంటిది ఈరోజు మైక్ పట్టుకుని రోజుకి రూ.2 కోట్లు తీసుకుంటానని, రూ.50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నానని చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు.

100837667

ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరును కోట శ్రీనివాసరావు ప్రస్తావించకపోయినా అది కచ్చితంగా ఆయన్నే అన్నారని అర్థమవుతోంది. దీంతో కోటపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి వైసీపీ మాట్లాడినప్పుడు ఈ కోట ఎక్కడ దాక్కున్నారంటూ విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు ఇదే అంశంపై నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నట్టి కుమార్.. కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించారు.

‘వయసు అయిపోయిన కోట శ్రీనివాసరావుకు ఎందుకు? ఆయనకు ఏం అవసరం? నిజాయతీగా, నీతిగా నేను ట్యాక్స్ కడుతున్నాను.. నేను ఇంత తీసుకుంటున్నాను.. నేను ఇంత తీసుకుని కూడా నా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం బతుకుతున్నా.. ప్రజల కోసం వస్తున్నా.. నేను మీ కోసం కష్టపడతా.. సేవచేస్తా అని ఆయన చెప్పాడు. ఆయన ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి చెప్పాడు. నువ్వు ట్యాక్స్ ఎగ్గొడుతున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా?’ అని కోటాపై నట్టి కుమార్ మండిపడ్డారు.

ఒక మనిషి మీద ఎప్పుడూ ఏడవకూడదని చెప్పిన నట్టి కుమార్.. పవన్ కళ్యాణ్ మీద కోట శ్రీనివాసరావుకు ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. తాను రోజుకి రూ.2 కోట్లు లేదంటే అంత కన్నా ఎక్కువే తీసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడంలో తనకేమీ తప్పనిపించడం లేదని.. మరి కోట శ్రీనివాసరావు ఎందుకు భుజాన వేసుకుంటున్నాడో అర్థం కావడం లేదని అన్నారు.

‘దీనికి కోట శ్రీనివాసరావుకు సంబంధం లేదు. ఎవరో మైక్ ఇచ్చారు కాబట్టి ఆయన వాగేయడం మొదలుపెట్టేశాడు. ఆయనకు ఇంతకు ముందు కూడా చెప్పాం. ముసలాయన.. వయసు అయిపోయింది. పెద్దాయన ఆయన హద్దుల్లో ఆయన ఉంటే మంచిది. పవన్ కళ్యాణ్ ఎవరినీ ఉద్దేశించి అనలేదు, ఎవరి కోసం ఆయన మాట్లాడలేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. మీకేం సంబంధం. మీకెందుకు బాధ. మీరు రోజుకు ఎంత తీసుకున్నారో అందరికీ తెలుసు. మీరు ఎంత మందిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కోట ఎవ్వరికీ రూపాయి ఇచ్చి ఉండడు. కానీ, పవన్ కళ్యాణ్ తన సినిమాలు ఆడకపోతే డబ్బులు తిరిగి ఇచ్చారు’ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

2023-06-08T06:04:21Z dg43tfdfdgfd