‘రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో ఏడ్చేశాను, యుద్ధంలో ఎన్ని దారుణాలు చూశానంటే’: బీబీసీ గాజా రిపోర్టర్ అనుభవాలు

అద్నాన్ ఎల్ బుర్ష్ దాదాపు మూడు నెలల పాటు ఒక టెంట్‌లో నివసిస్తూ, రోజుకు ఒకే పూట తింటూ, తన భార్య అయిదుగురు పిల్లల క్షేమం కోసం తాపత్రయపడుతూ గాజా యుద్దంపై రిపోర్టింగ్ చేశారు.

యుద్ధాన్ని కవర్ చేసేటప్పుడు తాను ఎదుర్కొన్న భయంకర క్షణాల గురించి బీబీసీ అరబిక్ రిపోర్టర్ అయిన అద్నాన్ ఎల్ బుర్ష్ పంచుకున్నారు.

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని ఫోటోలు, వివరణలు కొందరు పాఠకులను కలచివేయవచ్చు.

గత ఆరు నెలల్లో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన క్షణాల్లో ఒకటి మేమంతా ఒకరోజు రాత్రి వీధిలో నిద్రపోవడం. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో తీవ్రమైన చలిలో పడుకున్న నా భార్యాపిల్లల ముఖాలను చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాను.

ఫుట్‌పాత్‌పై కవలలైన 19 ఏళ్ల జాకియా, బటౌల్ తన చెల్లెలు యుమ్నా (14)తో కలిసి పడుకోగా, ఎనిమిదేళ్ల నా మరో కుమారుడు మొహమ్మద్, ఐదేళ్ల కూతురు రజాన్ తమ తల్లి జైనాబ్ దగ్గర నిద్రించారు.

పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ బయట పడుకున్నప్పుడు, రాత్రంతా బాంబు దాడుల శబ్ధాలు వినిపించడంతో పాటు ఆకాశంలో డ్రోన్లు కనిపించాయి.

మేం ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాం. కానీ, అదేరోజు దాని యజమాని మాకు ఫోన్ చేసి, భవనంపై బాంబులు వేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఆయన్ను బెదిరించినట్లు చెప్పారు. ఆ సమయంలో నేను పనిలో ఉన్నాను. మా కుటుంబం అంతా బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది.

మళ్లీ మేమంతా రెడ్ క్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర కలుసుకున్నాం. అప్పటికే ఆ ప్రాంతమంతా నిరాశ్రయులైన ప్రజలతో కిక్కిరిసిపోయింది.

ఏం చేయాలని ఆలోచిస్తూ నేను, నా సోదరుడు రాత్రంతా కార్డ్‌బోర్డ్ పెట్టెల మీద కూర్చునే ఉన్నాం.

సురక్షితంగా ఉండాలంటే ఉత్తర గాజాలోని ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పిన తర్వాత అక్టోబర్ 13వ తేదీన మా ఊరును, ఇల్లును వదిలేసి వచ్చేశాం. జబాలియా పట్టణంలోని మా ఇంట్లోని సామానులో చాలావరకు అక్కడే వదిలేసి వచ్చాం.

సురక్షితంగా ఉంటుందని మమ్మల్ని వెళ్లాలని చెప్పిన ప్రాంతంలో కూడా బాంబు దాడులు జరిగాయి. మేం దక్షిణ గాజాకు వచ్చి ఇరుక్కుపోయాం. ఏమీ అంతుబట్టట్లేదు. చాలా కోపంగా, భయంగా, అవమానంగా ఉంది. నా కుటుంబ రక్షణ కోసం నేనేమీ చేయలేకపోతున్నా.

చివరకు మా కుటుంబం, సెంట్రల్ గాజాలోని సుసీరత్‌ ఏరియాలో ఒక అపార్ట్‌మెంట్‌కు మారింది. నేను బీబీసీ బృందంతో కలిసి ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి వద్ద ఒక టెంట్‌లోనే ఉంటూ నా పని కొనసాగించా. అప్పుడప్పుడు నా కుటుంబం వద్దకు వెళ్లేవాడిని.

ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ సమస్యల వల్ల కమ్యూనికేషన్ చాలా కష్టంగా ఉండేది. ఒక్కోసారి నాలుగైదు రోజులు మా కుటుంబంతో మాట్లాడలేకపోయేవాడిని.

ఏడుగురితో కూడిన మా బీబీసీ బృందం ఖాన్ యూనిస్‌లో టెంట్‌లో ఉంటూ రోజుకు ఒకపూటే తినేవాళ్లం. ఒక్కోసారి తినడానికి ఆహారం ఉన్నప్పటికి కూడా, టాయ్‌లెట్ సౌకర్యం లేకపోవడంతో తిండి తినకపోయేవాళ్లం. ఇదే సమయంలో నా స్నేహితుడు, అల్ జజీరా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దో చాలా నష్టపోయారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆయన కుటుంబం నివసిస్తోన్న ఇల్లు ధ్వంసమైంది. ఈ దాడిలో ఆయన భార్య, టీనేజీ కుమారుడు, ఏడేళ్ల కూతురు, ఏడాది వయస్సున్న మనవడు చనిపోయారు.

సాధారణ పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతుంది. ఈ కేసుకు సంబంధించి ఆ ఏరియాలోని హమాస్ తీవ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పింది.

వేల్‌తో నాకు 20 ఏళ్ల స్నేహం ఉంది. కవర్లలో చుట్టిన తన పిల్లల మృతదేహాలను వేల్ తన హృదయానికి హత్తుకుంటున్న దృశ్యాన్ని చూసి నేను కదిలిపోయాను. ఆ సమయంలో అతనితో ఉండాలని అనుకున్నా.

నాకు తెలిసిన ఇతర స్నేహితులు, బంధువులు, పొరుగువారి మరణాలు సంభవించిన సమయంలోనే వేల్ కుటుంబ విషాద వార్త కూడా నాకు తెలిసింది. బాధతో నా గుండె బరువెక్కిపోయింది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు నాకు తెలిసినవారే దాదాపు 200 మంది చనిపోయారు.

ఆ రోజు రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లోనే ఏడ్చేశాను. దు:ఖంతో రాత్రంతా నిద్రపోలేదు. వేల్‌ను అలా చూడటం నేను మర్చిపోలేను. నా మనసులో ఆ దృశ్యం ముద్రించుకుపోయింది.

గాజాలో 15 ఏళ్లుగా సంఘర్షణలను నేను కవర్ చేశాను. కానీ, ఇప్పుడు జరుగుతున్నయుద్ధం వాటికి భిన్నమైనది. ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల నుంచి ప్రాణ నష్టం వరకు ఇది చాలా వేరుగా ఉంది.

అక్టోబర్ 7న ఉదయం 6:15 గంటలకు భారీ పేలుళ్ల శబ్ధంతో నేను ఉలిక్కిపడి లేచాను. నా పిల్లలు భయంతో అరుస్తున్నారు. మేడ మీదకు వెళ్లి చూస్తే గాజా నుంచి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన రాకెట్లు కనిపించాయి.

కంచెను దాటుకొని హమాస్, ఇజ్రాయెల్‌లోకి వెళ్లిందని తెలియగానే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఉంటుందని మేం అనుకున్నాం. నాడు హమాస్ చేసిన దాడిలో దాదాపు 1200 మంది చనిపోయారు. 250 మంది బందీలయ్యారు.

హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం, ఇప్పటివరకు గాజాలో 34 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. ఇంకా అక్కడ ప్రాణనష్టం, గాయాలకు సంబంధించిన భయానక వాతావరణం నెలకొని ఉంది.

యుద్ధం మొదలైన రెండు రోజుల తర్వాత ఆహార సామగ్రి కోసం జబాలియాలోని స్థానిక మార్కెట్‌కు వెళ్లాను. ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పటికే ప్రజలంతా అక్కడికి రావడంతో అది కిక్కిరిసిపోయింది.

అక్కడి నుంచి నేను వెళ్లిపోయిన 10 నిమిషాల తర్వాత ఆ ఏరియాలో భారీ బాంబు దాడులు జరిగాయి. ఆ ప్రాంతం అంతా విధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు నేను సరుకులు కొనుగోలు చేసిన దుకాణంతో సహా అక్కడంతా తుడిచిపెట్టుకుపోయింది.

అక్కడి దుకాణాల యజమానులు నాకు తెలుసు. చనిపోయిన వారిలో వారు కూడా ఉన్నారు.

ఈ దాడిలో 69 మందికిపైగా చనిపోయారని, దీన్ని ఒక యుద్ధ నేరంగా దర్యాప్తు చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.

ఈ ఘటన గురించి బీబీసీ అడిగిన ప్రశ్నకు ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.

హమాస్ లక్ష్యంగా తమ ఆపరేషన్ సాగుతోందని, పౌర ప్రాంతాల నుంచి హమాస్ పనిచేస్తుందని యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ చెబుతోంది.

‘‘అంతర్జాతీయ చట్టంలోని సంబంధిత నిబంధనలకు లోబడే సైనిక లక్ష్యాలపై దాడి చేస్తున్నాం’’ అని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది.

యుద్ధానికి ముందు జబాలియా ఒక సుందరమైన, ప్రశాంతమైన పట్టణం. నేను జబాలియాలోనే పుట్టి పెరిగాను. అక్కడే నా కుటుంబంతో ఒక సాధారణ, సంతృప్తికర జీవితాన్ని గడిపాను. భవిష్యత్ గురించి మాకు ఎన్నో కలలు ఉన్నాయి.

మాకు పొలం కూడా ఉంది. అక్కడ నేనే స్వయంగా ఆలివ్, నిమ్మ, బత్తాయి మొక్కలను నాటాను. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. పని ముగిశాక పొలంలో టీ తాగుతూ సేదతీరడం నాకు ఇష్టం.

గాజా సిటీలోని మా ఇళ్లను, బీబీసీ ఆఫీసును వదిలేసి ఖాన్ యూనిస్‌కు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో అత్యంత కీలక క్షణం.

ఒక కారులో పది మందికి పైగా కూర్చొని నా కుటుంబం అంతా దక్షిణ గాజాకు తరలి వచ్చింది. మాతో పాటు సింగిల్ రోడ్‌లో వేలాది మంది ప్రజలు తమ సామాన్లతో వాహనాల్లో, కొందరు కాలినడకన బయల్దేరడంతో ఆ దారి అంతా రద్దీగా మారింది.

రోడ్డుకు ఇరువైపులా సమీప ప్రాంతాల్లో వైమానిక దాడుల కారణంగా వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. ఆ సమయంలో నా కుటుంబీకులతో సహా ప్రజలందరి ముఖాల్లో గందరగోళం, బాధ, అనిశ్చితి కనిపించింది.

‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? రేపు మళ్లీ తిరిగొచ్చేస్తామా?’’ అని పిల్లలు నన్ను అడుగుతూనే ఉన్నారు.

నా చిన్నప్పటి ఫోటోలు, నా తల్లిదండ్రులు, భార్య, పెళ్లినాటి ఫోటోలతో కూడిన ఆల్బాన్ని వెంట తెచ్చుకోవాలని అనుకున్నా. మా నాన్న అరబిక్ టీచర్. ఆయన చనిపోయాక నా దగ్గర ఉన్న ఆయన పుస్తకాలను కూడా వెంట తెచ్చుకోవాలని అనుకున్నాను.

తర్వాత, మా ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, పొలం పూర్తిగా కాలిపోయిందని మా పొరుగువారి ద్వారా నాకు తెలిసింది.

దక్షిణ గాజాకు భయంకర, దారుణమైన ప్రయాణం, రెడ్ క్రెసెంట్ హెడ్‌క్వార్టర్స్ బయట రాత్రిపూట నిద్ర వంటి పరిణామల తర్వాత కూడా నేను ఖాన్ యూనిస్ నుంచి పని చేస్తూనే ఉన్నా. అప్పటికీ నా కుటుంబం నుసీరత్‌లోనే ఉంది. వాళ్లకు దూరంగా ఉండటం మానసికంగా చాలా కష్టంగా ఉంది.

ఖాన్ యూనిస్ నుంచి కూడా గాజా ప్రజలు వెళ్లిపోవాలని డిసెంబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ చెప్పడం మొదలుపెటింది. రఫాతో పాటు దక్షిణాన ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.

నన్ను, నాకుటుంబాన్ని కలిపే... ఉత్తర గాజాను అనుసంధానించే ప్రధాన రహదారిని కూడా ఇజ్రాయెల్ సైన్యం మూసేసింది. నా కుటుంబం వద్దకు ఎలా చేరుకోవాలో నాకు అర్థం కాలేదు. ఒకవేళ వారి వద్దకు వెళ్లినా మేమంతా కలిసి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఎందుకంటే రఫా ఇప్పటికే వేలాదిమంది ప్రజలతో కిక్కిరిసిపోయింది. అక్కడ ఉండగలిగే ప్రదేశమే లేదు.

రోజుల తరబడి ఇదే మానసిక వ్యథను అనుభవించా. ఇజ్రాయెల్ బలగాలు ప్రధాన రహదారుల వైపు సాగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ మిలిటరీ దక్షిణ గాజాను సెంట్రల్, ఉత్తర రీజియన్ల నుంచి విభజించే లక్ష్యంతో ఉందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో నేను లేదా నా కుటుంబం చనిపోతామని, మేం మళ్లీ ఒకరినొకరు చూసుకోలేమని చాలా భయపడ్డాను.

మొదటిసారి నా కుటుంబాన్ని కోల్పోయిన భావన కలిగింది. ఉద్యోగం వదిలేసి నా కుటుంబం దగ్గరకు వెళ్లిపోవాలనుకున్నా. ఒకవేళ చనిపోయినా మేమంతా కలిసి చనిపోతాం అనుకున్నా.

ఎట్టకేలకు డిసెంబర్ 11న నా సహోద్యోగితో కలిసి కారులో నుసీరత్ వెళ్లాను. నన్ను చూడగానే నా చిన్నకూతురు రజాన్ పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకుంది. నా మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంది.

ఎలాగోలా నా కుటుంబాన్ని రఫాకు తరలించగలిగాను. బీబీసీ బృందం కూడా రఫాకు వెళ్లి అక్కడి నుంచి రిపోర్టింగ్ కొనసాగించింది. అక్కడ కొన్ని భయానక ఘటనల్ని చూడాల్సి వచ్చింది.

డిసెంబర్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాదాపు 80 మృతదేహాలను గాజాలోని అధికారులకు అప్పగించినట్లు నేను రిపోర్ట్ చేశాను. అందులో ఎవరైనా బందీలు ఉన్నారో లేదో పరిశీలించడం కోసం ఆ మృతదేహాలను గాజా నుంచి ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చినట్లు ఐడీఎఫ్ చెప్పింది.

రఫా ఏరియాలోని ఒక స్మశానంలోకి ఒక పెద్ద లారీ వచ్చింది. ఆ లారీ కంటెయినర్‌ను తెరవగానే దుర్వాసన వెదజల్లింది. అప్రాన్లు, మాస్క్‌లు ధరించిన కొందరు పురుషులు, అక్కడ తవ్విన ఒక భారీ సమాధిలో ఆ మృతదేహాలను పూడ్చేశారు.

అలాంటి దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. అది ఎంత భయంకరమైనదో మాటల్లో చెప్పలేము.

జనవరిలో రఫాలోని ఒక ఆసుపత్రికి పలు మృతదేహాలను తీసుకురావడంతో అక్కడి నుంచే నేను రిపోర్టింగ్ చేస్తున్నా. ఆ మృతుల్లో వేల్ కుమారుల్లో ఒకరైన హంజా కూడా ఉన్నారు. వేల్ పెద్ద కుమారుడు హంజా. అతను కూడా అల్ జజీరా జర్నలిస్ట్‌గా పనిచేశారు.

హంజా మరణవార్త గురించి వేల్‌కు ఎవరు చెబుతారు? ఇప్పటికే అతను విషాదంలో ఉన్నాడు. మళ్లీ ఈ విషయాన్ని చెప్పడం ఎవరి వల్లా కాలేదు. మా సహోద్యోగుల్లో ఒకరు ఈ విషయాన్ని చెప్పడం కోసం వేల్‌కు ఫోన్ చేసినప్పుడు నేను కనీసం అక్కడ ఉండలేకపోయాను, వారి మాటలు వినలేకపోయాను.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కారులో ప్రయాణిస్తున్న హంజాతో పాటు అతని సహోద్యోగి అయిన ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్ ముస్తఫా తురాయా చనిపోయారు. వారు అక్కడే జరిగిన మరో దాడి తర్వాతి పరిణామాల గురించి రిపోర్ట్ చేసి వస్తుండగా ఈ దాడి జరిగి మృత్యువాత పడ్డారు.

గాజాలోని తీవ్రవాద సంస్థల సభ్యులని వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపణలు చేసింది. వారి కుటుంబాలతో పాటు అల్ జజీరా సంస్థ ఈ ఆరోపణలను కొట్టేసింది.

ఆ ఇద్దరూ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారని, ఐడీఎఫ్ బలగాలకు ముప్పుగా కనిపించారని ఐడీఎఫ్ చెప్పింది. అయితే, వాషింగ్టన్ పోస్ట్ దర్యాప్తులో అలాంటిదేమీ లేదని తేలింది.

అక్టోబర్ 7 నుంచి గాజాలో 100 మందికిపైగా జర్నలిస్టులు చనిపోయారు.

తామెప్పుడూ ఉద్దేశపూర్వకంగా జర్నలిస్ట్‌లను లక్ష్యంగా చేసుకోలేదని, చేయబోమని ఐడీఎఫ్ చెప్పింది.

గాజాను విడిచి వెళ్లేందుకు బీబీసీ ఉద్యోగుల కుటుంబాలకు అనుమతి లభించడంతో నాలుగు వారాల తర్వాత, రఫా క్రాసింగ్ ద్వారా అక్కడి నుంచి బయటపడ్డాం.

ఖతర్ నుంచి నేను ఈ కథనాన్ని రాస్తున్నా. ఇక్కడ నేను బాగానే ఉన్నాను. కానీ, అక్కడ జబాలియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనే సంగతి తెలిసి నాకు తిండి సహించట్లేదు.

భవిష్యత్ అంతా అంధకారంగా ఉంది. గాజాలోనే నా జీవితం. ఏదో ఒకరోజు మళ్లీ అక్కడికి తిరిగి వెళ్తాను. కానీ, ఇప్పటికైతే అది అసాధ్యం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-04-29T12:12:38Z dg43tfdfdgfd