సాఫ్ట్‌వేర్‌ సింగర్‌!

ఆ శాస్త్రీయ సంగీత సాధకురాలు..ఎస్పీ బాలును చూడాలనే ఒకే ఒక్క కారణంతో సినిమా పాట అందుకుంది. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ విజేతగా నిలిచింది. తేట తెలుగు కోసంరాయ్‌పూర్‌ను వదిలి విశాఖ వచ్చిన ఆ స్వరం పేరు భాగవతుల సౌజన్య. ఆ సరిగమల ప్రయాణమంతా ఆమె మాటల్లో..

మాది సంగీత కుటుంబం. మా తాతగారు భాగవతుల కృష్ణారావు హృద్యంగా పద్యాలు పాడతారు. ఆ పద్యాలే మాతో పాడించారు. నాన్న సత్యనారాయణ మూర్తి లలిత సంగీత అభిమాని. తనకు నచ్చిన పాటలను నాకు, చెల్లి శిరీషకు నేర్పించారు. మా తాతగారు రైల్వే ఉద్యోగి. నాన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీ. దీంతో, బదిలీల కారణంగా ఉత్తరాదిలోనే ఉండిపోయారు. మా మేనత్త అక్కడే పుట్టి పెరిగినా కర్ణాటక సంగీతం మీద మక్కువతో ఆంధ్రా వచ్చి.. విజయనగరం సంగీత కళాశాలలో వీణ, గాత్రం నేర్చుకున్నారు. అలా మా ఇంట్లో రాగజ్ఞానం రాజ్యమేలేది. అప్రయత్నంగానే మేము శ్రుతి తప్పకుండా పాడటం చూసి.. ఇంట్లోవాళ్లు సంగీతం నేర్పాలని అనుకున్నారు.

రాయ్‌పూర్‌లోఉపాధ్యాయుల లక్ష్మి గారి దగ్గర శిక్షణ ఇప్పించారు. అప్పటికి నా వయసు ఆరేండ్లు. హిందీ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల మా తెలుగు అంతంత మాత్రంగానే ఉండేది. మేము మాతృభాషకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నాన్నరాయ్‌పూర్‌లో సొంతిల్లు ఉన్నా.. కోరికోరి విశాఖ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. విశాఖలో మల్లా ప్రగడ జోగుళాంబ గారి శిష్యరికంలో శాస్త్రీయ సంగీతం సాధన చేశాను. ఆమె వీణపై రాగాలు వాయిస్తే, మేం ఆ రాగాలు పాడేవాళ్లం. మాకు సమస్య లేకుండా స్వరాలతో సహా కృతులు రాసి ఎదురుగా పెట్టేవారు. వాటిని చదవడం కోసం సంగీతంతోపాటే ఓనమాలు, భాష నేర్చుకున్నాం.

Soujanaya Bhagavathula

చూడాలని ఉంది

సంగీతాభిమానం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రేమ మా టీవీలో వచ్చే ‘పాడాలని ఉంది’ కార్యక్రమానికి ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. బాలు గారిని చూడాలని, ఆయనతో మాట్లాడాలని మా వాళ్ల కోరిక. ‘పాడాలని ఉంది’ కార్యక్రమానికి ఎంపికైనవారి కుటుంబ సభ్యులకు వేదిక దగ్గరికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆ ఒక్క కారణంతోనే నన్ను పోటీలకు పంపారు. అయితే ఇందుకు ఓ ప్రాథమిక నిబంధన ఉంది. మూడు సినిమా పాటలు రికార్డు చేసి పంపాలి. తప్పదు కాబట్టి నాకు సినిమా పాటలు నేర్పించారు. మొత్తానికి ఆడిషన్స్‌కు పిలుపు వచ్చింది.

క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకూ వెళ్లాను. ఈ లోపు బాలుగారిని చూడాలన్న మా పెద్దల కోరిక తీరింది. అదే మాకు పెద్ద గెలుపు. ఇంజినీరింగ్‌ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వచ్చింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తూనే ప్రతి ఆదివారం రామాచారి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అర్జున్‌ రెడ్డి సినిమాలో ‘గుండెలోన’ పాట పాడాను. అలా, ప్లే బ్యాక్‌ సింగర్‌ కావాలన్న కోరిక తీరింది. అంతలోనే నా పెండ్లయింది. పుణె వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే ‘షాకిని డాకిని’ సినిమా కోసం నేను, చెల్లి పాడాం. ఆ తర్వాత మా ఆయనకు కాకినాడ ట్రాన్స్‌ఫర్‌ అయింది. మళ్లీ విశాఖ చేరుకున్నాం. కొవిడ్‌ తర్వాత మాకు పాప పుట్టింది. చెల్లి సోనీ ఇండియన్‌ ఐడల్‌లో టాప్‌ 11 పొజిషన్‌ దాకా వెళ్లింది. అప్పుడే ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 1’ వచ్చింది. ఇది మంచి అవకాశం అనుకున్నాను. మూడో రౌండ్‌ దాకా వెళ్లాను.

ఈ రౌండ్‌ కోసం హైదరాబాద్‌ రావాలన్నారు. నాలుగు నెలల పాపను వదిలిపెట్టి వెళ్లడం అసాధ్యం కాబట్టి, ఆ అవకాశాన్ని వదులుకోక తప్పలేదు. కాలం గిర్రున తిరిగి ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’కూ ఆడిషన్స్‌ మొదలయ్యాయి. మేం పాపను చూసుకుంటాం. మరోసారి ప్రయత్నించ మంటూ ఇంట్లో వాళ్లు గట్టిగా సపోర్ట్‌ చేశారు. ‘నీ సంగీతానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని మా వారు సోమేశ్‌ కూరెళ్ల పెండ్లప్పుడే మాటిచ్చారు. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2, మెగా ఆడిషన్స్‌ తర్వాత ఫైనల్స్‌కు ఎంపికయ్యాను. పాప పుట్టిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చాయి. చాలాకాలం నుంచి సంగీత సాధన లేదు. అంతమందితో పోటీ పడగలనా అని భయపడ్డాను. అదీ తాత్కాలికమే. ఆత్మవిశ్వాసంతో వేదిక ఎక్కాను. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 టైటిల్‌ సాధించాను. ‘పాడాలని ఉంది’తో మొదలైన నా ప్రయాణం ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’లో జయభేరి మోగించింది. సినిమా నేపథ్య గాయనిగా మంచి పేరు సంపాదించాలన్నదే నా లక్ష్యం.

…? నాగవర్ధన్‌ రాయల

2023-06-06T21:30:38Z dg43tfdfdgfd