మరో నాలుగు నెలల్లో పెళ్లి జరగనుండగా.. ఓ కుటుంబం తమకు కాబోయే కోడలితో కలిసి సరదాగా గడపడానికి సమీపంలో ఉండే పర్యాటక ప్రాంతానికి వెళ్లింది. అయితే, వారి సంతోషం కొద్ది సేపటికే ఆవిరయ్యింది. తాను చేసుకోబోయే అమ్మాయి చెరువులో పడిపోగా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం .. గ్రేటర్ హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్ ఖాన్ (22) తన తల్లి కాజాబీ, ఇద్దరు అక్క చెల్లెళ్లు, కాబోయే భార్యతో కలిసి గురువారం బయటకు వెళ్లాడు.
వీరంతా ముందు కౌకూరులోని ఎంబీ దర్గాకు వెళ్లామని అనుకున్నారు. కానీ, ముందు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట లేక్ వద్ద పర్యాటక కేంద్రానికి వెళ్లి.. అటు నుంచి దర్గాను దర్శించుకోవాలని భావించారు. ఈ క్రమంలో శామీర్‌పేట్ పెద్ద చెరువు వద్దకు చేరుకుని, కుడి వైపున బంగారు తెలంగాణ బోర్డు ఉన్న ప్రాంతంలో కూర్చున్నారు. అయితే, తనకు కాబోయే భర్త అమీర్ ఖాన్‌తో మాట్లాడుకుంటూ చెరువు కట్ట అంచుకు వెళ్లిన అమ్మాయి.. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది.
దీంతో పక్కనే ఉన్న అమీర్‌ఖాన్ ఆమెను కాపాండేదుకు నీటిలోకి దూకాడు. ఈలోగా కుటుంబసభ్యులు తమ చున్నీలు విసిరి బయటకు లాగటంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. కానీ, కాబోయే భార్యను రక్షించే ప్రయత్నంలో అమీర్ గల్లంతయ్యాడు. దీంతో అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాలను చూసినవారు కన్నీటిపర్యంతమయ్యారు. చెరువులో పడిపోయిన మూడున్నర గంటల అనంతరం అమీర్‌ఖాన్ మృతదేహం లభ్యమైంది. కౌకూరులోని ఎంబీ దర్గాకు వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరామని, ముందు శామీర్‌పేట చెరువు చూద్దామని వచ్చామని బాధితులు వాపోయారు. నేరుగా దర్గాకు వెళ్లినా తన కుమారుడి ప్రాణం దక్కేదంటూ తల్లి గుండె పగిలేలా రోదిస్తోంది.
Read More Latest Telangana News And Telugu News
2023-05-26T06:17:18Z dg43tfdfdgfd