టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ: ‘ఎవరెస్ట్‌పైకి సాధారణ వ్యక్తులుగా వెళ్లి, ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు’

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని మొట్టమొదటిసారి అధిరోహించి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 8,849 మీటర్ల ఎత్తయిన ఈ పర్వత శిఖరంపై తొలిసారి పాదం మోపింది టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ.

వారిద్దరూ ఇప్పుడు లేరు.. కానీ, వారి కుమారులు తమ తండ్రులు సాధించిన విజయాలు పర్వతోహరణను ఎలా మార్చాయో బీబీసీతో చెప్పారు.

‘తెలియని చోటికి తోవ చూపిన అసలైన అన్వేషకులుగా, మార్గదర్శకులుగా నేను వారిని చూస్తాను. కేవలం ఆ ఇద్దరు, వారి బృందం కారణంగానే ఇప్పుడు మనం ఎన్నో చేయగలుగుతున్నాం’ అని జామ్లింగ్ టెన్జింగ్ నార్గే చెప్పారు.

70 ఏళ్ల కిందట మే 29న తన తండ్రి విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ మాట చెప్పారు.

న్యూజీలాండ్‌కు చెందిన తేనెటీగల పెంపకందారు ఎడ్మండ్ హిల్లరీ 70 ఏళ్ల కిందట నేపాల్, చైనా సరిహద్దులలో ఉన్న ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లినప్పుడు శిఖరం పైవరకు ఆయనతో పాటు టెన్జింగ్ నార్గే ఉన్నారు.

ఈ ఇద్దరు పర్వతారోహకుల కుమారులు జామ్లింగ్ టెన్జింగ్ నార్గే, పీటర్ హిల్లరీ వారి తండ్రుల వీరోచిత గాథలను వింటూ పెరిగారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ వారి తండ్రులలానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.

ఎవరెస్ట్ తొలి అధిరోహణకు 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వారు తమ తండ్రుల విజయంపై బీబీసీతో మాట్లాడారు.

ఎవరెస్ట్ ఎక్కారనే విషయం లండన్‌కు ఎప్పుడు చేరింది?

‘వారు సాధారణ మనుషులుగా వెళ్లి ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు. కానీ, ఆ విజయం వారిని ఏమీ మార్చలేదు. ఆ తరువాత కూడా వారు మునుపటిలాగే సాదాసీదాగా, వినయంగా ఉండేవారు. ఇద్దరూ తమ జీవితాంతం హిమాలయ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ గడిపారు’ అని జామ్లింగ్ చెప్పారు.

‘అంతవరకు ఎవరూ చేయని పనిని ఎవరైనా సాధ్యం చేసి చూపగలిగితే మిగతావారికీ ఆ పనిని సుసాధ్యం చేయాలన్న స్ఫూర్తి కలుగుతుంది. ఈ 70వ వార్షికోత్సవం సందర్భంగా నాటి విజయాన్ని ఒక వేడుకగా చేసుకుందాం’ అన్నారు పీటర్ హిల్లరీ.

1953లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్‌ను అధిరోహించడమనేది అనేక మందికి ఆ శిఖరం వైపు దారి చూపింది. ఈ ఏడాది క్లైంబింగ్ సీజన్ తొలి 10 రోజుల్లోనే ఇంతవరకు 500 మంది 8,849 మీటర్ల ఎత్తయిన ఈ శిఖరాన్ని అధిరోహించారు.

సాంకేతికత, రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాలలో మెరుగుదలతో ఇదంతా సాధ్యమవుతోంది. కానీ, 70 ఏళ్ల కిందట టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీలు జీపీఎస్, శాటిలైట్ ఫోన్‌ వంటి ఆధునిక గాడ్జెట్‌లు లేకుండానే ఎవరెస్ట్ ఎక్కగలిగారు.

నిజానికి వారు ఎవరెస్ట్ ఎక్కిన విషయం లండన్ చేరడానికి మూడు రోజుల సమయం పట్టింది.

వారిద్దరూ ఆ ఘనత సాధించడానికి ముందు అనేకసార్లు ఎవరెస్ట్‌పైకి సాహస యాత్రలు చేసినా శిఖరం చేరుకోవడంలో విఫలమయ్యారు.

అంతకుముందు రెండు దశాబ్దాలలో ఎవరెస్ట్ అధిరోహణకు జరిగిన ఆరు ప్రయత్నాలలో టెన్జింగ్ నార్గే భాగస్వామి. 1952లో దాదాపు శిఖరం వరకు వెళ్లినా పూర్తిగా చేరలేకపోయారు.

తన తండ్రి(టెన్జింగ్ నార్గే) చిన్నతనంలో జడలబర్రెలు(యాక్) కాసేటప్పుడు ఎవరెస్ట్‌పై ఒక్క పక్షి కూడా ఎగురుతూ కనిపించకపోవడంతో ఆ ఒక్క శిఖరంపైనే ఏ పక్షీ ఎందుకు ఎగరడం లేదని ఆశ్చర్యపోయేవారని జామ్లింగ్ చెప్పారు.

ఎప్పుడైనా ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదట అధిరోహించేది బౌద్ధ మతానికి చెందినవారేనని ఓ లామా(బౌద్ధ మతాచార్యుడు) చెప్పే మాటలతో తన తండ్రి స్ఫూర్తి పొందారని జామ్లింగ్ చెప్పారు.

శిఖరంపైనే 15 నిమిషాలున్నారు

ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తున్న 9వ బ్రిటిష్ బృందంలో చేరాలని తనను కోరినప్పుడు చరిత్ర సృష్టించడానికి అదో మంచి అవకాశంగా తన తండ్రి భావించారని పీటర్ హిల్లరీ చెప్పారు.

‘ఆయన అనుకున్నది సాధించాలన్న ప్రగాఢ వాంఛగల వ్యక్తి. ఆ క్రమంలో ఎప్పుడూ ముందుంటానన్న విషయం ఆయనకు తెలుసు’ అన్నారు పీటర్.

‘శిఖరం దక్షిణ భాగం వైపు మంచులోంచి పైకెక్కడం గురించి ఆయన వివరించడం నాకు బాగా గుర్తుంది’ అని బీబీసీతో చెప్పారు పీటర్.

భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వారు తమ ప్రయత్నాన్ని కొనసాగించారు.

ఎవరెస్ట్ కాకుండా ఇంకేదైనా పర్వతమైతే అలాంటి కఠిన పరిస్థితులలో తన తండ్రి వెనక్కు తిరిగివచ్చేసేవారని, కానీ, ఎవరెస్ట్ ఎలాగైనా ఎక్కాలనుకున్న ఆయనకు ముందుకే సాగాలని అంతరాత్మ చెప్పిందని పీటర్ తెలిపారు.

వారు శిఖరంపైకి చేరుకున్నప్పుడు అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంది. సుమారు 15 నిమిషాలు ప్రపంచపు పైఅంచున(ఎవరెస్ట్ శిఖరంపై) గడిపిన తరువాత వారు అక్కడి నుంచి కిందకు దిగారని చెప్పారు.

శిఖరంపైకి చేరిన తరువాత టెన్జింగ్ నార్గే అక్కడ కొన్ని మిఠాయిలు, బిస్కెట్లను దేవతలకు బౌద్ధ నైవేద్యంగా సమర్పిస్తూ మంచులో పాతిపెట్టారు.

ఎడ్మండ్ అక్కడ అనేక ఫొటోలు తీశారు. అక్కడి దృశ్యాలతో పాటు టెన్జింగ్ బ్రిటన్, నేపాల్, ఐరాస, భారత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా జెండాలు ఊపుతున్న చిత్రాలను తీశారు.

అయితే, శిఖరంపై ఎడ్మండ్ హిల్లరీ ఉన్న ఫొటో ఒక్కటి కూడా లేదు.

‘తనకు తెలిసినంతవరకు టెన్జింగ్ నార్గేకు అంతకుముందు కెమెరా ఉపయోగించిన అనుభవం లేదని, ఆయన కెమెరా ఉపయోగించడం ప్రారంభించడానికి సరైన ప్రదేశం అదే అని తాను అనుకోలేదని తన తండ్రి సరదాగా అన్నారు’ అని పీటర్ చెప్పారు.

టెన్జింగ్ నార్గేకు కెమెరాతో ఫొటోలు తీయడం రాకపోవడం వల్ల శిఖరంపై ఎడ్మండ్ చిత్రం లేదన్న అర్థంలో పీటర్ ఈ విషయం చెప్పారు.

దశాబ్దాల తరువాత పీటర్, జామ్లింగ్‌ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అంతకుముందు తమ తండ్రులు దాటుకుంటూ వెళ్లిన ప్రదేశాలను వారు బాగా అర్థం చేసుకున్నారు.

‘‘నేను తొలుత 1990లో ఎవరెస్ట్ ఎక్కాను. అక్కడ మా నాన్న గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. నేను ‘హిల్లరీ మెట్ల’ వద్దకు చేరుకున్నప్పుడు మా నాన్న అక్కడ ఏం చూశారో అదంతా చూసినట్లు అనిపించింది. చాలా భావోద్వేగానికి లోనయ్యాను’ అని పీటర్ చెప్పారు.

మతపరమైన, వ్యక్తిగత కారణాలతో జామ్లింగ్ టెన్జింగ్ నార్గే 1996లో ఎవరెస్ట్ ఎక్కారు.

ఆయన, ఆయన తండ్రి ఇద్దరూ షెర్పాలు. షెర్పాలంటే పర్వతాలు ఎక్కడంలో నైపుణ్యం ఉన్న టిబెట్ జాతి. వీరు హిమాలయాలతో చాలా లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉన్నట్లు అనుభూతి చెందుతారు.

‘నేను ఎవరెస్ట్ ఎక్కడమనేది నాకు సాహస యాత్ర కంటే ఆధ్యాత్మిక యాత్ర. నా మతం, ఆచారాలతో మళ్లీ కనెక్ట్ కావడం కోసం.. నా తండ్రి ఎలాంటి అనుభూతి పొందారో తెలుసుకోవడం కోసం నేను ఎవరెస్ట్ ఎక్కాను’ అని చెప్పారు జామ్లింగ్ టెన్జింగ్ నార్గే.

వారికి ఎవరూ సాటి రాలేరు!

ఏటా పెద్దసంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నప్పటికీ తమ తండ్రులు సాధించిన ప్రజాభిమానానికి ఎవరూ సాటి రాలేరని జామ్లింగ్, పీటర్ భావిస్తున్నారు.

మే 23న కామీ రీటా ఎవరెస్ట్ శిఖరాన్ని 28వ సారి ఎక్కి అక్కడికి వారం రోజుల ముందే మే 17న సాధించిన తన రికార్డ్‌ను తానే అధిగమించారు.

వారంలోనే రెండు సార్లు ఎవరెస్ట్ ఎక్కారు కామీ రీటా.

అయితే, ఇప్పట్లో తానేమీ ఎవరెస్ట్ ఎక్కే పని ఆపబోనని కామీ చెప్తున్నారు. కామీతో దాదాపు సమానంగా 26 సార్లు ఈ శిఖరాన్ని ఎక్కిన మరో షెర్పా పసాంగ్ దావా ఇంకా ఈ శిఖరం ఎక్కే ఉత్సాహంలో ఉండడంతో కామీ కూడా ఈ పని కొనసాగించాలనుకుంటున్నారు.

మహిళా షెర్పా లక్పా నిరుడు పదోసారి ఎవరెస్ట్ ఎక్కి అత్యధిక సార్లు ఆ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా రికార్డ్ సృష్టించారు.

‘ఎవరెస్ట్ ఎక్కడం ఇప్పుడు ఈజీ’

‘మా నాన్న కాలంతో పోలిస్తే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడం సులభంగా మారింది. సాంకేతికత సాయపడుతోంది. రెండో శిబిరం నుంచి కఠ్మాండూ వరకు కొందరు హెలికాప్టర్లతో వెళ్తున్నారు. అన్ని మార్గాలు సెట్ చేసి ఉన్నాయి. ఆక్సిజన్, ఇతర సామగ్రిని షెర్పాలు తీసుకెళ్తున్నారు’ అన్నారు జామ్లింగ్.

‘ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడంలో సాహసం చేసిన థ్రిల్ లేదు. కేవలం ఫొటోగ్రఫీ ఈవెంట్‌గా మారింది. ఇప్పటివారు ఎవరెస్ట్ ఎక్కడాన్ని ఎంజాయ్ చేస్తారే కానీ ఎవరెస్ట్‌ను అధిరోహించరు’ అన్నారు జామ్లింగ్.

పీటర్ కూడా జామ్లింగ్ అభిప్రాయంతో కొంత వరకు ఏకీభవించారు. ‘ఇప్పుడు బేస్ క్యాంప్ నుంచి శిఖరం పైవరకు తాడు ఉంటోంది. మంచు పగుళ్ల మీదుగా వెళ్లడానికి నిచ్చెనలున్నాయి. క్యాంపులలో వేడివేడి టీ అందించే షెర్పాలు ఉంటున్నారు. 6,300 నుంచి 6,500 మీటర్ల ఎత్తువరకు కూడా రక్షించేందుకు వీలుగా హెలికాప్టర్లు అందుబాటులో ఉంటున్నాయి. కానీ, పర్వతం మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. సవాళ్లతో కూడిన పెద్ద పర్వతం ఇది’ అన్నారు పీటర్.

మరో విషయం ఏంటంటే గత 100 ఏళ్లలో 300 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో మరణించారు. ఈ సీజన్‌లోనూ మృతుల సంఖ్య 11కి చేరింది.

‘ప్రకృతిని గౌరవించాలని ఈ పర్వతం మనకు నేర్పిస్తుంది’ అన్నారు జామ్లింగ్.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-05-28T04:18:31Z dg43tfdfdgfd