BRAHMAMUDI TODAY జూన్ 18 ఎపిసోడ్: హోటల్ రూమ్‌లో దొరికేసిన అప్పూ, కవి! అక్రమ సంబంధమంటూ మీడియాలో వార్తలు..

Brahmamudi 2024 june 18 Episode: ఒక సమస్య కోసం పోతే మరో సమస్యలో ఇరుక్కున్నారు కళావతి కో బ్యాచ్. అప్పూ, కవి ఇద్దరి మధ్య అక్రమసంబంధం.. పెద్ద పంచాయితీకి దారి తీసింది. ఈ క్రమంలోనే అసలు మాయను రుద్రాణిని కిడ్నాప్ చేయించేసింది .అసలేం జరిగిందో చూద్దాం.   (photo courtesy by star maa and disney+ hotstar)

Brahmamudi 2024 june 18 Episode: కావ్య బయట అటు ఇటు తిరుగుతూ.. అత్తయ్యగారిని మావయ్యగారిని కలపాలంటే ఒక్కటే మార్గం.. ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలియడమే. కానీ ఎలా? అని తనలో తానే మథనపడుతూ ఉంటుంది. అయితే ఆ పక్కనే కవి.. ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కవిని కావ్య చూడదు. కావ్యను కవి చూడదు. ఇంతలో అప్పూ గేట్ తీసుకుని లోపలికి వస్తుంది. ‘అప్పూ నువ్వేంటే ఇక్కడా?’ అంటుంది కావ్య. ‘అక్కా ఫోన్ చేస్తే ఎందుకులే ఎవరైనా వింటారేమో అని.. నేనే స్వయంగా వచ్చాను.. ఆ అసలు మాయ కోమాలోంచి బయటికి వచ్చిందంట అక్కా’ అంటుంది అప్పూ. ఆ మాటలు కవి చెవిన పడతాయి. ‘పద అప్పూ వెంటనే వెళ్దాం.. ఈ సమయంలో ఆమెతో మాట్లాడటం చాలా అవసరం’ అంటూ అప్పూని తీసుకుని వెళ్లబోతుంది కావ్య. ‘చాలా బాగుంది వదినా..’ అంటూ దగ్గరకు వస్తాడు కవి.మీ మరిదిని దూరం పెట్టేస్తారా?

‘నేనేమో అన్ని నిజాలు మీతో షేర్ చేసుకుంటాను. కానీ మీరేమో.. నా దగ్గర అన్ని దాచిపెట్టేస్తారు’ అంటూ అలిగినట్లుగా మాట్లాడతాడు కవి. ‘అయ్యో అదేం లేదు కవిగారు.. మీ దగ్గర దాచడం అంటూ ఎప్పటికీ జరగదు.. అయినా దాచానంటే.. అసలే అనామికకు మీకు పడటం లేదు. ఏదో విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. మళ్లీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు కదా.. అది కూడా నా వల్ల అని తెలిస్తే.. ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పలేదంతే’ అంటుంది కావ్య. ‘ఎవరో ఏదో అంటారని మీ మరిదినే దూరం పెట్టేస్తారా?’ అంటాడు కవి.

వద్దు కవిగారు.. కలుగజేసుకోవద్దు..

‘తను ఎవరో కాదు కవిగారు మీ భార్య’ అంటుంది కావ్య. ‘తను భార్యే కావచ్చు.. కానీ మీరు అమ్మ స్థానంలో వచ్చిన మా వదిన కదా?’ అంటాడు కవి. ‘హూ.. ఆపండి మీ సెంటిమెంట్ డైలాగ్స్.. కాస్త ఓవర్ అయ్యింది.. తగ్గించండి. అవతల ఆమెకు మెలుకువ వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే ఆవిడకు కావాల్సిన వాళ్లు కూడా వస్తారు’ అంటుంది అప్పూ. ‘అయితే మీతో పాటు నేను కూడా వస్తాను’ అంటాడు కవి. ‘కవిగారు నా మాట వినండి. ఈ విషయంలో మీరు కలుగజేసుకుంటే సమస్యలొస్తాయి’ అంటుంది కావ్య.

రుద్రాణికి సమాచారం..

‘అక్కా ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైమ్ అయిపోతుంది. వస్తే ఏమవుతుంది. ఫర్వాలేదు రానీ’ అంటుంది అప్పూ. ‘బ్రో చెప్పేసిందిగా పదండి వెళ్దాం’ అంటాడు కవి. ముగ్గురూ కలిసి బయలుదేరతారు. ఇక సీన్ కట్ చేస్తే రుద్రాణికి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి.. ‘వాట్ నువ్వు చెప్పేది నిజమా.. ఎప్పుడు జరిగింది?’ అంటూ షాకింగ్‌గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది మామ్ అంటాడు రాహుల్. ‘ఆ అసలు మాయ కోమాలోంచి బయటికి వచ్చిందట’ అంటుంది రుద్రాణి. ‘ఇప్పుడు ఎలా మామ్.. ఆమె బయటికి వస్తే.. కావ్య సమస్యను చక్కబెట్టేస్తుంది. తర్వాత ఆ అత్తకోడళ్లు కలిసిపోతారు కదా? ఇప్పుడు ఎలా?’ అంటాడు రాహుల్ కంగారుగా.

అసలు మాయా కిడ్నాప్ ప్లాన్..

దాంతో రుద్రాణి ప్లాన్ చెబుతుంది. ‘నువ్వు ఓ పని చెయ్యాలిరా.. నీ మనుషుల్ని ఆ అసలు మాయా దగ్గరకు పంపించి.. ఆమెను అక్కడి నుంచి మాయం చెయ్యించు.. ఆ కావ్యకు మాత్రం మాయా దొరక్కూడదు.. ఆ తర్వాత..’ అంటూ ఇంకా ఏదో ప్లాన్ చెబుతుంది. సరే అంటాడు రాహుల్. అయితే అసలు మాయ ఆసుపత్రిలో ఉన్నట్లే రుద్రాణికి తెలియదనుకుంటుంటే.. మరి ఆమెకు ఈ సమాచారం ఎవరో ఇచ్చారో? ఏమో తెలియదు కానీ.. బహుశా డైరెక్టర్ ఇచ్చి ఉంటాడు. ముందు బయలుదేరిన కావ్య, అప్పూ, కవిల కంటే ముందే రౌడీలు వెళ్లిపోతారు. (ఆ రౌడీలను గత ప్రోమోలో చూసి.. వాళ్లు మాయా మనుషులే అనుకున్నాం. కానీ కాదు.. రుద్రాణి మనుషులని నేటి కథనంలో తెలిసిందే.)

రౌడీలతో కలిసి వెళ్లిపోయిన మాయా..

డైరెక్ట్‌గా మాయ ఉన్న గదిలోకి వెళ్లి.. ‘మేడమ్ మిమ్మల్ని డిస్ ఛార్జ్ చేశారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకుని రమ్మని కావ్య మేడమ్ చెప్పారు. అందుకే వచ్చాం.. పదండి వెళ్దాం’ అంటారు. నమ్మేసిన మాయా.. వాళ్ల వెంట నడుస్తుంది. సరిగ్గా అప్పుడే కావ్య, అప్పూ, కవి ముగ్గరు ఆసుపత్రి ముందు కారు ఆపి.. దిగి లోపలికి నడిచి వస్తూ ఉంటారు. మాయా వాళ్లు ఆ రౌడీలతో పాటు నమ్మి వెళ్లిపోతూ ఉంటుంది. అయితే వాళ్లు ఒక తలుపులోంచి బయటికి వెళ్తారు. కావ్య వాళ్లు మరో తలుపులోంచి లోపలికి వస్తారు. రౌడీల వెంట మాయ నడుస్తుంది. కారు ఎక్కేస్తుంది.

ఇప్పుడే తీసుకెళ్లారు..

ఇంతలో కావ్య, అప్పూ, కవి ముగ్గరూ రూమ్ మొత్తం వెతుకుతారు. అక్కడున్న నర్స్‌ని అడిగితే.. డిస్ ఛార్జ్ చేశారు అంటుంది. అలా ఎలా చేస్తారు అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది కావ్య. ‘అదేంటి మేడమ్.. మీరే డిస్ ఛార్జ్ చెయ్యమన్నారని.. చెప్పి.. మీతో మాట్లాడించి మరీ తీసుకెళ్లారు కదా? మీరే కదా.. మేము వస్తున్నాం.. ఆమెను డిస్ ఛార్జ్ చేసి పంపించండి అన్నారు?’ అంటుంది డాక్టర్. బిత్తరపోతారు కావ్య, అప్పూ, కవి ముగ్గరూ. ‘వాళ్లు ఇప్పుడే తీసుకెళ్లారు మేడమ్.. నాకు తెలిసి కిందే ఉంటారు’ అంటుంది డాక్టర్.

ఛేజింగ్ మొదలు..

తీరా వాళ్లు కిందకు పరుగున వచ్చేసరికి.. మాయను ఒక కారులో కూర్చోబెట్టి.. తీసుకుని వెళ్లడంతో పాటు.. కావ్య వాళ్లను అయోమయంలో పడెయ్యడానికి వాళ్ల మనుషులే మరో కారును కూడా వెనుకే పోనిస్తారు. దాంతో కావ్య, అప్పూ, కవిలకు రెండు కార్లు వెళ్లడం కనిపిస్తుంది. అందులో మాయ ఏ కారులో ఉందో అర్థం కాదు. దాంతో చెరో కారుని ఫాలో చేద్దాం అంటూ.. అప్పూ, కవి ఒక కారులో.. కళావతి మరో కారులో ఫాలో చెయ్యడానికి వెళ్తారు. ఆ కారులను ఫాలో చేస్తూ ఛేజింగ్ చేసినంత పని చేస్తారు ఇటు కవి కారు.. అటు కళావతి కారు.

కమింగ్ అప్‌లో షాకింగ్ ట్విస్ట్..

ఇక కమింగ్ అప్‌లో మామూలు ట్విస్ట్ కాదు. కవి, అప్పూ కలిసి ఒక కారుని.. కావ్య, కారు డ్రైవర్ కలిసి మరో కారుని.. కారుల్లో ఫాలో చేస్తూ వెళ్లినట్లు చూపిస్తారు. అయితే కవి వాళ్లు ఫాలో అయిన కారు ఓ లాడ్జ్‌లో ఆగుతుంది. అక్కడికి కవి, అప్పూ వెళ్లి.. రిసెప్షన్‌లోకి వెళ్లి అడిగితే.. ‘వాళ్లు 402లో ఉన్నారు సార్’ అంటాడు. దాంతో అప్పూ, కవి ఇద్దరూ ఆ రూమ్‌కి వెళ్లిపోతారు. తీరా గదిలోకి వెళ్లి గది మొత్తం వెతికుతుండగా.. అప్పూ, కవి ఇద్దరినీ గదిలో ఉంచి.. బయట నుంచి ఒకడు తలుపు పెట్టేస్తాడు కావాలనే. అతడు ఎవరి మనిషి.. ఎవరు అలా చేయించారు అనేది తెలియలేదు.

అడ్డంగా ఇరుక్కున్న కవి.. అప్పూ..

అది కూడా రుద్రాణీ ప్లానేనా? లేక అనామిక, ధాన్యలక్ష్మీల ప్లానా? అనేది తెలియదు కానీ.. అప్పూ, కవి ఇద్దరూ 402 రూమ్‌లో ఇరుక్కుపోతారు. తీరా వాళ్లు ఉన్న తలుపు తీసి బయటికి వచ్చేసరికి మీడియా మూగేస్తుంది. ‘దుగ్గిరాల వారసుడు పెళ్లి అయ్యాక కూడా అప్పూ అనే అమ్మాయితో హోటల్ రూమ్‌లో దొరికాడు’ అని టీవీల్లో న్యూస్ బయటికి వస్తుంది. అది కనకం, కృష్ణమూర్తి టీవీలో విని, చూసి బిత్తరపోతారు. ఇక ఇంట్లో అప్పూ, కవి కలసి నిలబడి ఉంటే.. పంచాయితీ కూడా మొదలైనట్లు చూపిస్తారు. ఇప్పుడు అసలు మాయ మాయం కావడంతో పాటు.. అప్పూ, కవిల మధ్య అక్రమసంబంధం ఉన్నట్లుగా ప్రపంచం ముందు దోషులుగా నిలబడ్డారు. ఇప్పుడు కళావతి ఏం చేస్తుందో చూడాలి మరి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. Read Also: ‘గుప్పెడంత మనసు’ జూన్ 18 ఎపిసోడ్: నేనే వసుధార భర్తని.. రంగాని కాదు రిషిని.. దిమ్మతిరిగే ట్విస్ట్ ​Read Also: ‘కార్తీకదీపం’ జూన్ 18 ఎపిసోడ్: నెల తప్పిన శోభా.. ‘నేను మగాడ్నే దీపా.. మీసం మెలేసిన నర్సింహ’

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-18T04:08:49Z dg43tfdfdgfd