BRAHMAMUDI TODAY: ‘రేపు అప్పూని కోర్టుకు తీసుకుని రండి’ జడ్జ్ ఆదేశం.. ఒక్కో నిజం ఒక్కో లాయర్ బయటపెట్టడంతో..

Brahmamudi 2024 July 03 Episode: కవి న్యాయపోరాటం చేస్తుంటే.. అనామిక లేనిపోని కేసులన్నీ పెట్టి.. లోపల వెయ్యించాలని.. లేదంటే తన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని పరితపిస్తోంది. ఈ క్రమంలోనే.. ‘గృహహింస కేసు, కట్నం వేదింపులు, అక్రమసంబంధం’ ఇలా చాలా సెక్షన్స్‌ పెట్టించి.. కోర్టు దాకా లాక్కొచ్చింది. ఈ క్రమంలోనే నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Brahmamudi 2024 July 03 Episode:జిల్లా సెషన్స్ కోర్ట్ ముందు కవి రాగానే.. మీడియా చుట్టుముడుతుంది. మహిళా సంఘాలు.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుంటారు. పాపం ధాన్యం బాగా ఏడుస్తుంది. ‘ఏంట్రా ఇదంతా..? బంగారంలా చూసుకున్నా ఇలా పరువుతీసింది ఏంట్రా?’ అని కవితో అంటుంది. ‘క్షమించు అమ్మా.. అలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి.. నేనే మీ అందరి బాధకు కారణం అయ్యాను’ అంటాడు బాధగా కవి. ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు రిపోర్టర్స్. ‘మీకు అప్పూకి మధ్య అక్రమ సంబంధం నిజమేనా? అనామికను కట్నం కోసం వేధించారా?’ అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. ఇక రాజ్ అడ్డుపడాలని చూస్తే.. కావ్య అదుపు చేస్తుంది. ‘అంతా ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఇంకా సమస్య అవుతుంది. ఆగండి. నిజం బయటికి వచ్చినరోజు మనం మాట్లాడొచ్చు’ అని సద్దిచెబుతుంది. ఇంతలో అనామిక, తన తల్లిదండ్రులతో కలిసి ఎంట్రీ ఇస్తుంది.1

అనామిక ఎంట్రీ..

ఇక అనామిక.. కారు దిగి తండ్రితో.. ‘చూశారా డాడ్.. నేను తప్పు చేస్తున్నా అన్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ నా వెనుక ఎంతమంది నిలబడుతున్నారో’ అంటుంది. ‘నిజం బటయపడితే వీళ్లంతా వ్యతిరేకంగా మారతారమ్మా’ అంటాడు. ఆ అవకాశమే లేదులే డాడ్. రండి వెళ్దాం’ అంటుంది అనామిక.. ముందుకు నడుస్తూ. వెంటనే అనామిక చుట్టూ మీడియా వాళ్లు మూగిపోతారు. కాస్త దూరం నుంచి రాహుల్, రుద్రాణి చూస్తుంటారు. ‘అంతా కోర్ట్‌లో తేల్చుకుంటామండీ.. పదండి డాడ్’ అంటూ అనామిక కోర్టు వైపు నడుస్తుంది. అక్కడే ఉన్న కవి వైపు పొగరుతో చూస్తూ మెట్లు ఎక్కుతుంది అనామిక.

కళావతి రిక్వస్ట్..

ఇక కావ్య కుడివైపు నుంచి అనామికకు ఎదురుగా వచ్చి.. ‘చూడు అనామికా.. నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు.. నా మాట విను’ అంటుంది కావ్య. ‘ఇంత దూరం వచ్చాక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.. ఏదున్నా కోర్టు లోపలే తేల్చుకుందాం.. రండి నాన్నా’ అంటూ అనామిక.. వాళ్ల వాళ్లతో కలిసి లోపలికిపోతుంది. ఇక రుద్రాణి అయితే.. ‘హమ్మయ్యా ఎక్కడ కావ్య అనామికను మార్చేస్తుందో అని భయపడ్డానురా’ అంటుంది రుద్రాణి చిన్న స్వరంతో పక్కనే ఉన్న కొడుకు రాహుల్‌తో.

తన గొయ్యి తానే తవ్వుకుంది అనామికా.. రుద్రాణి హ్యాపీ..

‘కావ్య మాట్లాడినంత మాత్రాన్న అనామిక ఎందుకు ఒప్పుకుంటుంది మమ్మీ?’ అంటాడు రాహుల్. ‘రేయ్ నువ్వు కావ్యను తక్కువ అంచనా వేస్తున్నావ్‌రా.. అది ఆఖరి నిమిషంలో కూడా ఏదైనా చేసి అనుకున్నది సాధించగలదు. అనామిక కనీసం కావ్యతో కూడా మాట్లాడకుండా తన గొయ్యి అదే తవ్వుకుంది. పదా లోపలేం జరుగుతుందో చూద్దాం’ అంటుంది రుద్రాణి. ఇక కోర్టు లోపల కవి.. ఒక బోనులో నిలబడతాడు. ఎదురుగా మరో బోనులో అనామిక నిలబడుతుంది. కాసేపటికి జడ్జ్‌ గారు రావడం.. అంతా లేచి నిలబడి నమస్కరించడం.. ‘మొదలుపెట్టండి’ అని ఆయన చెప్పడంతో వాదోపవాదాలు మొదలవుతాయి.

వాదోపవాదాలు మొదలు..

అనామిక తరపున లేడీ లాయర్ లేచి.. ‘మిస్ అనామిక.. వైఫ్ ఆఫ్ దుగ్గిరాల కళ్యాణ్ అయ్యాక.. ఈ రోజు ఈ కోర్టులో నిలబడటానికి ఒక్కటే కారణం యువరానర్.. తను అనుభవించిన శారీరక, మానసిక చిత్రహింసలే కారణం.. పైగా పెళ్లికి ముందు నుంచే ఈ ముద్దాయి కళ్యాణ్.. అప్పూ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంగా ఈ భార్యభర్తల మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి.. అనామిక ఒకసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. తర్వాత వారిద్దరినీ హోటల్‌ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం కూడా జరిగింది.. పైగా కట్నం గురించి కూడా వేదించేవాడు’ అంటూ అనామిక తరపున లాయర్ బలంగా వాదించి కూర్చుంటుంది.

కవిని మానసికంగా ఈ అనామిక వేదించింది..

తర్వాత కళ్యాణ్ తరపున లాయర్ పైకిలేచి.. ఇతడొక కవి.. ఇతడికి కవిత్వం తప్ప మరేం తెలియదు. గొప్ప భావుకత్వం ఉన్న మనిషి.. ఏమ్మా అనామికా.. ఇతడ్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినప్పుడు ఇతడు కవిగా తెలసా? లేక బిజినెస్ మెన్‌గా పరిచయమా?’ అంటాడు లాయర్. ‘కవిగానే తెలుసు. ఎంత సేపు అదే పనిలో ఉండేవాడు’ అంటుంది అనామిక. ‘నోట్ దిస్ పాయింట్ యువరానర్.. కవి అయిన నా క్లయింట్‌ని మానసికంగా ఒత్తిడి తెచ్చి.. బిజినెస్‌కి పంపించాలని తీవ్రంగా ప్రయత్నించింది ఈ అనామిక. ఇది పైకి కనిపించని మానసిక చిత్రవధ’ అంటూ తేల్చేస్తాడు లాయర్.

రాజ్ చేసిన సాయం బయటకి.. బిత్తరపోయిన అనామిక...

ఇక అనామికతో కవి తరపు లాయర్ ఇలా అంటాడు. ‘అమ్మా అనామికా.. కట్నం గురించి వేదించారని ఇందులో రాయించావ్.. వేదించారు అంటే మీరు ముందే ఎంతో కొంత కట్నం తీసుకుని ఉండాలి కదా? ఎంతిచ్చారు?’ అంటాడు సూటిగా. ‘కోటి రూపాయల కట్నం ఇచ్చాం’అని అబద్దం చెప్పేస్తుంది అనామిక. ‘అవునా.. మరి కోటి రూపాయాల కట్నం ఇచ్చినవారు అయితే.. పెళ్లిరోజు రెండు కోట్ల రూపాయల అప్పూ కోసం పెళ్లి ఆపబోయిన సేటుకి కళ్యాణ్ వాళ్ల అన్నయ్య స్వరాజ్ ఎందుకు ఫ్రీగా అప్పూ తీర్చాడు?’ అంటాడు లాయర్ కూల్‌గా. బిత్తరపోతుంది అనామిక.

అనామిక తరపు లాయర్ ప్రశ్నల వర్షం..

వెంటనే రాజ్.. కావ్య వైపు చూసి.. ‘ఇదంతా నువ్వు చెప్పావా?’ అంటాడు. ‘మరి తను కోటి రూపాయలు కట్నం తెచ్చుకోవడం నిజమా? అందుకే లాయర్‌కి చెప్పాను’ అంటుంది కళావతి. ఇక వాదన కొనసాగుతుంది. ‘యువరానర్.. స్వరాజ్ గారు రెండు కోట్ల అప్పూ తీర్చినట్లు చెక్ నంబర్, అలాగే డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి’ అని అందజేస్తాడు. ఆ వెంటనే అనామిక తరపు లాయర్ లేచి.. ‘యువరానర్.. నేను కూడా కళ్యాణ్‌ని కొన్ని ప్రశ్నలు వేయాలి’ అంటుంది. సరే అంటాడు జడ్జ్. వెంటనే ఆమె కవి దగ్గరకు వెళ్లి.. ప్రశ్నలు వేయడం మొదలుపెడుతుంది.

ఒక్కో నిజం బటయికి..

‘కళ్యాణ్ గారు.. మీకు అప్పూ ఎప్పటి నుంచి పరిచయం. తనని ప్రేమించి మోసం చేసి అనామికను పెళ్లి చేసుకోబోతున్నందుకే కదా పెళ్లి ఆపడానికి ఆ అప్పూ.. ఆమె తల్లి కనకం ప్రయత్నించింది?’ అంటూ అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి.. మాది పవిత్రమైన ప్రేమ అని కవి చెబుతున్నా వినకుండా.. ‘పెళ్లినాటి వీడియో క్లిప్ మీ ముందు ఉంచాం యువరానర్.. అలాగే పోలీస్ కంప్లైంట్ కాపీ కూడా అందిస్తున్నాం. గత శ్రీరామనవమి రోజు అప్పూతో మాట్లాడొద్దని కళ్యాణ్‌ని అనామిక అదుపు చేసినందుకు.. అనామికపై చేయి చేసుకున్నాడు కళ్యాణ్’ అంటూ ఆమె తన వాదన వినిపిస్తుంది.

‘రేపు కోర్టుకి అప్పూని తీసుకునిరండి’ తేల్చేసిన జడ్జ్

ఇక అప్పటి దాకా మాది పవిత్రమైన స్నేహం అన్న కళ్యాణ్.. ‘అప్పూ నన్ను ప్రేమించింది. కానీ ఏ రోజు ఆ మాట నాకు చెప్పలేదు’ అంటూ అప్పూ గొప్పతనాన్ని చెప్పే క్రమంలో.. జడ్జ్ అనుమానంగా... ‘ఇదేంటయ్యా మళ్లీ ప్రేమ అంటావ్.. ఇప్పుడే కథా పవిత్రమైన స్నేహం అన్నావ్.. ఇదంతా కాదు.. కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈ భార్యభర్తల మధ్య చిచ్చుకు కారణం అయిన అప్పూనో సప్పూనో ఆమెను తీసుకుని రండి.. ఆమెను కూడా హాజరు పరచండి’ అంటాడు జడ్జ్. దాంతో కేసు వాయిదా పడింది. రేపు అప్పూని పోలీసులే తీసుకుని వస్తారు కాబోలు. చూద్దాం ఏం జరుగుతుందో.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T03:06:34Z dg43tfdfdgfd