BRAHMAMUDI ఏప్రిల్ 23 ఎపిసోడ్: వాటే ట్విస్ట్.. సీతారాముల కళ్యాణాన్ని ఆపేసిన అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి

Brahmamudi April 23 Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సీతారాముల కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్తుంది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మీడియా రాజ్ ఫ్యామిలీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా దుగ్గిరాల కుటుంబం చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరిపించాలని పంతులు గారు చెబుతారు. దీనికి ఏం సమాధానం చెప్పాలా అని దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచిస్తుంది. ఇంతలో ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా తమ చేతుల మీదుగానే కళ్యాణం జరుగుతుందని ఇందిరాదేవి హామీ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని ప్రకాశానికి అప్పజెబుతాడు సీతారామయ్య. ఇక పంతులు వెళ్లిపోయిన తర్వాత అసలు రచ్చ మొదలవుతుంది. అన్నీ తెలిసి మీరు ఎలా హామీ ఇచ్చారంటూ ఇందిరాదేవిని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఇంట్లో నా సుపుత్రుడు సృష్టించిన సునామీ గుర్తులేదా అత్తయ్య.. రేపు కళ్యాణానికి ఆ బిడ్డని తీసుకొని ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం.. అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతామంటూ అపర్ణ వరుసగా ప్రశ్నలు వేస్తుంది. దీనికి ఇందిరాదేవి అంతే దీటుగా బదులిస్తుంది. మరి ప్రతి ఏడాది జరిగే కళ్యాణానికి ఈసారి దుగ్గిరాల కుటుంబం ఎందుకు రాలేదని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతాం అపర్ణ.. అలా సీతారాముల కళ్యాణం ఆపడం మన కుటుంబానికే అరిష్టం అంటూ ఇందిరాదేవి చెబుతుంది. కావ్యదే బాధ్యత

ఇక ఇందిరాదేవికి ఎదురుచెప్పలేకపోయిన అపర్ణ తాను గుడికి రానంటూ మొండిపట్టు పడుతుంది. కానీ సుభాష్ ఎలాగైనా అపర్ణని తీసుకువస్తానంటూ ఇందిరాదేవికి మాటిస్తాడు. ఇంతలో రుద్రాణి కూడా రాజ్ మీద నాలుగు సెటైర్లు వేస్తుంది. దీంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజ్‌ను గుడికి తీసుకువచ్చే బాధ్యత నువ్వే తీసుకోవాలంటూ కావ్యకి చెబుతుంది ఇందిరాదేవి. సమస్యలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ వాటి గురించి తరతరాలుగా వస్తున్న ఆచారాలను, ఆనవాయితీలనూ పక్కన పెట్టలేం.. రేపు జరగబోయే సీతారాముల కళ్యాణానికి రాజ్ వచ్చేలా నువ్వే ఒప్పించాలంటూ ఇందిరాదేవి కోరుతుంది. దీనికి కావ్య కూడా సరే అమ్మమ్మ ప్రయత్నిస్తానంటూ మాటిస్తుంది.

రుద్రాణి ప్లాన్ అదుర్స్

మరోవైపు అందరూ రేపు సీతారాముల కళ్యాణం జరిపించి ఒక్కటైపోతున్నారంటూ రాహుల్ వెధవ ఏడుపు ఏడుస్తాడు. అదే జరిగితే ఆఫీసులో ఉన్న నా మేనేజర్ పోస్ట్ కూడా పోతుంది.. మళ్లీ రాజ్ తిరిగి బాధ్యతలు తీసుకుంటాడంటూ కంగారు పడతాడు. దీనికి రుద్రాణి ఓ అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. కంగారు పడకురా దుష్ట పుత్ర.. రేపు కళ్యాణానికి రాజ్ ఆ బిడ్డతో పాటు గుడికి వస్తాడు.. అక్కడికి మీడియాను పిలిపించి ఈ బిడ్డ ఎవరు అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయమను.. దెబ్బకి దుకాణం బంద్ అంటూ రుద్రాణి సలహా ఇస్తుంది. ఈ ఐడియా అదిరిపోయింది ఇప్పుడే ఆ పనిలో ఉంటానంటూ రాహుల్ ఓయస్ అంటాడు. ఇక రుద్రాణి కూడా రేపటితో రాజ్ ఆట కట్టు అంటూ కలలు కంటుంది.

రాజ్‌ను ఒప్పించిన కళావతి

మరోవైపు సీతారాముల కళ్యాణానికి ససేమిరా రానంటూ రాజ్ మొండిపట్టు పడతాడు. కానీ కళావతి మాత్రం సంప్రదాయం, ఆచారం, ఆనవాయితీ అంటూ నాలుగు నీతి గుళికలు వదులుతుంది. దీంతో రాజ్ కాస్త ఆలోచనలో పడతాడు. పైగా మీ అమ్మగారి మనసు ఇప్పటికే నొచ్చుకుంది.. మిమ్మల్ని ఇంటి నుంచి పంపించేసి ఆవిడ ఇక్కడ సుఖంగా ఉండగలరా.. ఏదో మిమ్మల్ని నాలుగు మాటలు అన్నంత మాత్రాన ఏమైపోతుంది.. మీ అమ్మే కదా.. ఆ మాత్రం ఓర్చుకోలేరా? రేపు కళ్యాణానికి రండి.. అన్ని సమస్యలూ అవే సద్దుకుంటాయి అంటూ కళావతి సలహా ఇస్తుంది. దీంతో రాజ్ కాస్త ఆలోచనలో పడతాడు. సర్లే ఏదైతే అదే అయిందనుకొని గుడికి వచ్చేందుకు రెడీ అయిపోతాడు.

అప్పుతో కలిసి కనకం సై

మరోవైపు సీతారాముల కళ్యాణానికి వెళ్లేందుకు కనకం కూడా తయారవుతుంది. పైగా ఏదో పని మీద వెళ్తున్న అప్పూను ఆపేసి మరీ కళ్యాణానికి వెళ్లాలంటూ చెబుతుంది. నీ పెళ్లి విషయంలో మాకు తగిలిన స్ట్రోకులు చాలు.. నీకు ఓ మంచి మొగుడు రావాలని కోరుకున్నాను.. కనుక నువ్వు కూడా కళ్యాణానికి రా అంటూ అప్పును అడుగుతుంది కనకం. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా.. అక్కడికి వెళితే ఆ అనామిక మళ్లీ ఏదో ఒకటి వాగుతుంది.. గొడవ జరుగుతుంది అవసరమా అంటూ అప్పు బదులిస్తుంది. అక్కడ జరుగుతున్న కళ్యాణానికి రమ్మని మీ అక్క ఆహ్వానం పలికింది.. అదెవరో ఏదో అంటే మనకేంటి.. ఎక్కువ మాట్లాడితే నాలుగు పళ్లు రాలగొడతా అంటూ కనకం సీరియస్ అవుతుంది. మొత్తానికి అప్పును తీసుకొని కళ్యాణానికి వచ్చేందుకు రెడీ అయిపోతుంది.

ఈ బాబు ఎవరు సార్?

ఇక సీన్ కట్ చేస్తే దుగ్గిరాల ఫ్యామిలీ కళ్యాణం కోసం గుడికి చేరుకుంటుంది. ఇక అప్పటికే మీడియా అంతా కవరేజ్ కోసం సిద్ధంగా ఉంటుంది. ఇక కారు ఇలా దిగగానే మీడియాను చూసి రాజ్ కంగుతింటాడు. ఇంతలో ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సుభాష్-అపర్ణ చేతుల మీదుగానే కళ్యాణం జరిపిస్తారా అంటూ రిపోర్టర్ ప్రశ్నిస్తుంది. దీనికి ఇందిరాదేవి సమాధానమిస్తూ లేదు ఈసారి మా కొత్త తరం నుంచి నా మనవడు రాజ్-తన భార్య కావ్య చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంది అంటూ ప్రకటిస్తుంది. ఇంతలో రాజ్ మీదకి కెమెరా తిప్ప్పుతూ ఈ బాబు ఎవరు సార్ అంటూ రిపోర్టర్ అడుగుతుంది. దీంతో అపర్ణ సహా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కంగారుపడుతుంది. ఇదే సరైన టైమ్ అని రుద్రాణి మధ్యలో దూరుతుంది. ఇంకెవరూ.. ఆ పోలికలు చూస్తే తెలీడం లేదా.. వాడు మా రాజ్ కొడుకు.. మా రక్తం.. దుగ్గిరాల వారసుడు అంటూ రుద్రాణి మీడియాకి చెప్పేస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అదేంటి.. దుగ్గిరాల ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మీడియాకి తెలుస్తుంది కదా.. మరి మీ ఇంటి కోడలు ప్రెగ్నెంట్ అవ్వడం, కాన్పులు, బారసాల ఇవేమీ తెలీకుండా ఇంత సీక్రెట్‌గా ఎందుకు ఉంచారంటూ మీడియా ప్రశ్నిస్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

Brahmamudi

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T03:39:59Z dg43tfdfdgfd