GUNDE NINDA GUDI GANTALU: స్నేహితులుగా మారిన మీనా, రోహిణీ! పొట్ట చెక్కలు చేసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu 2024 July 03 Episode: రోహిణీ.. మొత్తానికీ మోసం చేసి మనోజ్‌తో తాళి కట్టించేసుకుంది. ఈ క్రమంలోనే మీనాపై ప్రభావతి అనుక్షణం చెడు అభిప్రాయం కలిగిస్తూ ఉండగా.. మీనా సరసన చేసింది రోహిణి. ఈ క్రమంలోనే బాలు చురకలు, మీనా ఊహలు.. బాలు ప్రవర్తన ప్రతీదీ నేటి కథనాన్ని అహ్లాదంగా మార్చేసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Gunde Ninda Gudi Gantalu: విద్య ఆసుపత్రికి వెళ్లి మరీ వర్ధన్ పరిస్థితి చూసి.. రోహిణీకి కాల్ చేస్తుంది. ‘రోహిణీ.. పండుగ చేసుకో.. వాడు కోమాలోంచి బయటికి వస్తాడో లేదో కూడా డాక్టర్‌లు చెప్పలేకపోతున్నారు.. సో ఇదంతా వదిలేసి.. మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చెయ్’ అంటుంది. దాంతో ఇక రోహిణి చిందులేసినంత పని చేస్తుంది. సంబరంగా కిందకు వచ్చి.. ‘ఆంటీ.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.. పెళ్లిలో ఏదో మా నాన్న గురించి ఆలోచించి అలా ఉన్నాను కానీ.. ఇక నుంచి నేను చాలా హ్యాపీగా ఉంటాను’ అంటూ తన ఆనందాన్ని మొత్తం వ్యక్తపరుస్తుంది. అక్కడే మీనా పనులు చేసుకుంటూ ఉంటుంది. సత్యం, మౌనిక కూర్చుని ఉంటారు. మనోజ్ అక్కడికి వస్తాడు. రోహిణీ ఆనందాన్ని చూసి చాలా పొంగిపోతాడు. ఇక ప్రభావతి ఎప్పటిలానే మీనాని మాటలు అంటూ.. రోహిణిని ఆకాశానికి ఎత్తేస్తుంది. సత్యం ప్రశ్నలు..

అయితే మనోజ్ తల్లితో.. ‘అమ్మా మాకు పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లు అవీ జరిపించొచ్చు కదా?’ అంటాడు గారంగా. ‘దానిదేముందిరా?’ అంటుంది ప్రభావతి. ‘అలా జరిపించాలంటే పెళ్లికూతురు పుట్టింటి వాళ్లు ఎవరైనా ఉండాలి కదరా పాపం’ అంటాడు సత్యం. ‘నా పక్కన అమ్మలాంటి అత్త ఉండగా నాకు ఇంకెవరూ అవసరం లేదు’ అంటుంది రోహిణి. ఇక ప్రభావతి పొంగిపోయి.. ‘హేయ్ మీనా ఇలారా.. ఆ ఏర్పాట్లు అవీ చూడు’అంటుంది. వెంటనే సత్యం కోపంగా.. ‘పెళ్లిలో పనికిరాని మీనా చెయ్యి.. ఇప్పుడెందుకు అసవరం అయ్యింది?’ అంటాడు.

మీనా ఏర్పాట్లు..

‘అన్నీ చక్కబెట్టడానికి మనకు పని మనుషులు లేరు కదండి’ అంటుంది ప్రభావతి. పాపం మీనా అల్లాడిపోతుంది. ‘ఛా.. ఆ నోరు కచ్చితంగా పడిపోతుంది. మొన్న కాలు జారి పడినట్లే.. ఏదొక రోజు ఆ నోరు కూడా పడిపోతుంది’ అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ‘హేయ్ ఏంటి చూస్తున్నావ్.. చెప్పింది చెయ్’అంటుంది మీనాను ప్రభావతి పొగరుగా. సరే అంటుంది మీనా. ఇక సీన్ కట్ చేస్తే బిందెలో ఉంగరం తీసే తంతు కోసం అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది మీనా. ఇంతలో మౌనిక వచ్చి.. ‘వదినా భలే చేశావే అప్పుడే’ అంటుంది నవ్వుతూ.

మీనా, రోహిణీల మధ్య కుదిరిన స్నేహం..

ఇంతలో రోహిణీ వచ్చి.. ‘మీనా.. నాకంటే ముందు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చావ్ కాబట్టి.. నిన్ను అక్కా అని పిలవాలా? లేక మరిది గారి భార్యవు కాబట్టి చెల్లి అనాలా?’ అంటుంది. ‘ఎలా పిలిచినా ఫర్వాలేదు కానీ.. మరిది భార్యను కాబట్టి చెల్లి వరసే అవుతాను’ అంటుంది మీనా. ‘అయితే ఇద్దరికీ ఒక ఐడియా చెప్పనా.. ఇద్దరూ మంచిగా పేర్లు పెట్టి పిలుచుకోండి’ అంటుంది మౌనిక. ‘ఓకే’ అనుకుంటారు ఇద్దరూ తోటికోడళ్లు. నవ్వుకుంటారు ఆప్యాయంగా. అప్పుడే మౌనిక నవ్వుతూ.. ‘వదినా మీరిద్దరూ ఎప్పుడూ ఇంత ప్రేమగా కలిసిపోయి ఉండాలి. రండి ఓ సెల్ఫీ తీసుకుందాం’ అంటుంది. దాంతో రోహిణీ మీనా పక్కనే కూర్చుని ప్రేమగా సెల్ఫీకి పోజులు ఇస్తుంది.

రోహిణీకి దిష్టి చుక్క..

ఇక సరిగ్గా అప్పుడే ప్రభావతి, సత్యం, మనోజ్ అంతా అక్కడికి వస్తారు. బాలు కూడా వస్తాడు. ‘టైమ్‌కి వచ్చాడు దిక్కుమాలిన ముఖం వేసుకుని’అంటుంది బాలుని రగిలిపోతూ ప్రభావతి. ‘ఈ ముఖం నీ కడుపులో పుట్టిందే మాతా.. అంత దిక్కుమాలిన ముఖాన్ని ఎందుకు మోసావ్?’ అంటాడు బాలు చురకలేస్తూ. ‘అమ్మా ముందు జరగాల్సింది చూడు’ అంటుంది మౌనిక. ఇక వెంటనే ప్రభావతి.. కోడలు రోహిణీని పట్టుకుని.. ప్రేమగా.. ఆమె కంటి కాటుకను వేలితో తీసి.. ‘ఏ పాపిష్టి(మీనా) కళ్లు పడ్డాయో’ అంటూ దిష్టి చుక్కను రోహిణి చెవి వెనుక పెడుతుంది ప్రభావతి. అది బాలు గమనిస్తాడు.

నవ్వించేసిన బాలు..

వెంటనే బాలు.. మీనా ముఖం చూసి.. ‘ఏంటి ముఖం అలా వాడిపోయింది? ఏ కోపిష్టి(ప్రభావతి వైపు చేయి చూపించి.. వెంటనే పక్కకు తిప్పేసి).. ఏ కోపిష్టి కళ్లు పడ్డాయో ఏంటో.. ఉండు దిష్టి చుక్కపెడతాను’ అంటూ మీనా కంటి కాటుకను తన చిటికెన వేలుతో తీసి.. మీనా చెవి పక్కనే కసక్కున పొడినట్లు చుక్కపెడతాడు. వెంటనే అదే వేలుని తన చెవి వెనుక కూడా పెట్టుకుని ప్రభావతి వైపు చూస్తాడు. రగిలిపోతుంది ప్రభావతి. అమ్మా జరగాల్సిన కార్యక్రమం జరిపించు అమ్మా అంటాడు మనోజ్ గారంగా. దాంతో ప్రభావతి సరే అంటుంది.

తంతు మొదలు...

ఇంతలో బాలు.. మీనాతో.. ‘మీనా ఏం జరుగుతుంది ఇక్కడా?’ అంటాడు. ‘బిందె లోంచి ఉంగరం తీసే వేడుక’ అంటుంది మీనా. ‘ఉంగరం ఎవరిది వేస్తున్నారో’ అంటాడు బాలు. ‘నాదే వేస్తున్నను’ అంటుంది రోహిణీ నవ్వుతూ. ‘అయ్యో జాగ్రత్త అమ్మా.. లకారాలు మింగినోడు లటుక్కున మింగేసినా మింగేస్తాడు’అంటూ చురకలు వేస్తాడు బాలు. ఇక ఆ తంతు జరుగుతుంటే చుట్టుపక్కల అమ్మలక్కలు వస్తారు. వాళ్లందరికీ బొట్టుపెట్టి ఆహ్వాస్తుంది మీనా. ఇక తంతులో మనోజ్ తరపున సత్యం.. రోహిణీ తరపున ప్రభావతి ఉంటారు.

చురకలే చురకలు..

‘ఎవరైతే ఉంగరం పైకి తీస్తారో వాళ్లదే జీవితంతం పై చేయి’అంటుంది ప్రభావతి. ‘నాన్నా అంటే.. అప్పట్లో ఉంగరం..(మీ ఉంగరాల ఆటలో అమ్మే గెలిచిందా? అనే అర్థం వచ్చేలా)’ అంటూ నసుగుతాడు బాలు. ‘డౌట్ ఎందుకు? మీ అమ్మే తీసింది’ అంటాడు సత్యం. ‘ఛా.. అక్కడ కొట్టిందా దెబ్బా’అంటాడు బాలు నవ్వుతూ. రగిలిపోతూ చూస్తుంది ప్రభావతి. ఇక తంతు మొదలవుతుంది. చివరికి బిందెలో చేయి పెట్టి కాసేపు కొట్లాట తర్వాత.. మనోజ్‌కే ఉంగరాన్ని వదిలేస్తుంది రోహిణి. మనోజ్ ఉంగరాన్ని బయటికి తీస్తాడు. ‘ఎందుకమ్మా వదిలేశావ్’ అంటుంది ప్రభావతి.. కోడలు రోహిణీతో.

బాలుకి పెద్ద డౌటే వచ్చింది..

‘మా ఇద్దరిలో ఎవరిది పై చేయి అయినా నాకు ఓకే’ అంటుంది రోహిణి సిగ్గుపడుతూ. ‘అది భార్య అంటే అలా ఉండాలి’ అంటుంది ప్రభావతి మురిసిపోతూ. ‘మరి చూసి నేర్చుకోవే?’ అంటాడు బాలు వెంటనే. రగిలిపోతుంది ప్రభావతి. వెంటనే బాలు.. తండ్రితో.. ‘నాన్నా అమ్మ ఎప్పుడూ మనోజ్‌గాడి పార్టీ కదా.. ఇప్పుడేంటి పార్లర్ అమ్మ పార్టీలో ఉంది?’ అంటాడు చిన్న స్వరంతో. ‘మీ అన్నయ్యకంటే ఆ అమ్మాయి సంపాదన ఎక్కువ కదరా’ అంటాడు సత్యం నవ్వుతూ. ఆ మాటలు ఎవ్వరూ వినరు. ఇంతలో ప్రభావతి.. మౌనికతో.. ‘స్వీట్ తీసుకునిరా.. ఒక్కటే తే’ అంటుంది. ‘ఎందుకంత పొదుపు.. వీడు లకారాలు మింగినట్లు.. మిగిలిన స్వీట్స్ నువ్వు మింగుతావా?’అంటాడు బాలు. ‘ఒక్కటే తినిపిస్తార్రా’ అంటాడు సత్యం. ఇక స్వీట్‌ని చెరిసగం పంచుకుంటారు మనోజ్, రోహిణీలు.

రెస్టారెంట్‌‌లో కలుసుకున్న శత్రువుల అమ్మాయి..

ఇక సీన్ కట్ చేస్తే.. రవిని, శ్రుతి.. ఓ రెస్టారెంట్‌లో కలుస్తుంది. ఆమె తీరు చూడబోతే రవిని ప్రేమిస్తున్నట్లే ఉంది. నిజానికి శ్రుతి తండ్రికి.. సత్యానికి గతంలో శత్రుత్వం ఉంది. ఆ విషయం రవికి కానీ శ్రుతికి కానీ తెలియదు. ఇక పోతే.. బాలు తినడానికి వస్తాడు కాసేపటికి. మీనా బాలుకి వడ్డిస్తూ.. పెళ్లి తర్వాత జరిగే ఉంగరం తంతు గురించి.. స్వీట్ తినిపించడం గురించి చర్చించుకుంటారు. అప్పుడే మీనా.. ‘వాళ్లకు కనీసం జరిగింది. మనకు ఆ ముచ్చట కూడా లేదుగా’అంటుంది. ఇక ఊహల్లోకి వెళ్లిపోతుంది. బాలు, మీనా కలిసి.. బిందెలో ఉంగరం తీయ్యడం.. స్వీట్ తినిపించడం ఊహించుకుంటుంది.

ఊహల్లో మీనా..

అప్పుడే సాంబారులో గరిటె పెట్టి తెగ తిప్పేస్తూ ఉంటుంది. అది గమనించిన బాలు.. చేతిలోని గరిటె లాగి నెమ్మదిగా పక్కన పెట్టేస్తాడు. ఇక మీనా మాత్రం అదే ఊహల్లో.. ఏకంగా చేయి పెట్టి సాంబారులో తిప్పేస్తుంది. తింటున్న బాలు బిత్తరపోయి.. కాస్త దూరంగా పక్కకు వాలి చూస్తుంటాడు. అందులోంచి చింతపండు తుక్కుని.. ఉంగరం అనుకుని పైకి తీస్తుంది. మురిసిపోతూ.. అదే స్వీట్ అనుకుని.. హూ తినండి అంటూ బాలు నోటి దగ్గరకు తెస్తుంది. వెంటనే బాలు.. ఎడమ చేత్తో మీనా నెత్తి మీద ఒకటి కొట్టి.. ‘ఏంటది?’ అంటాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T05:06:38Z dg43tfdfdgfd