JANASENA: పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. మే 13వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మురం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారాహి విజయభేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం నేపథ్యంలో కార్యకర్తలకు జనసేన పార్టీ కీలకల సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ జ్వరంతో బాధపడుతున్నారని జనసేన తెలిపింది. ఆయన ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని.. ఫలితంగా రోజూ ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవడంలో పవన్ ఇబ్బంది పడుతున్నట్లు ట్వీట్ చేసింది. జ్వరంతో బాధపడుతూనే విజయభేరీ యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రచారానికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనసేన పార్టీ నేతలకు కీలక సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిన సమయంలో క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దని సూచించింది. అలాగే పవన్ కళ్యాణ్‌తో ఫోటోలు, సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ కోసం ఒత్తిడి చేయవద్దని కోరింది. పూలు చల్లే సమయంలో ఆయన ముఖం మీద పడేలా వేయొద్దంటూ జనసైనికులు, వీరమహిళలు, పవన్ అభిమానులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనూ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని మళ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారుచేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21న పవన్ కళ్యాణ్ భీమవరం, నరసాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 22న తాడేపల్లిగూడెంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 23న పిఠాపురంలో నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే పదో తేదీన మరోసారి పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్.. రోడ్ షో నిర్వహిస్తారు. మే 11వ తేదీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేసే రోడ్ షో‌తో పవన్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T15:48:13Z dg43tfdfdgfd