తిరుమల: విద్యార్థులకు టీటీడీ గుడ్‌న్యూస్.. రూ.50 మాత్రమే, అద్భుతమైన అవకాశం!

టీటీడీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మే 25వ తేదీ నుంచి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది.. పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తులను జూన్ 12వ తేదీ వ‌ర‌కు స్వీకరిస్తారని చెప్పారు.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, ఫ్లూట్‌, నాద‌స్వ‌రం, వ‌యోలిన్‌, వీణ‌, మృదంగం, డోలు, భ‌ర‌త‌నాట్యం, హ‌రిక‌థ‌, ఘ‌టం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశార‌ద‌ (డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు కాలేజీలో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చని టీటీడీ తెలిపింది. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం 7330811173, 9848374408, 9440793205,0877-2264597, నంబ‌ర్ల‌లో సంప్రదించాలని సూచించారు.

మే 22న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 22న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

నేటి నుంచి 12వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

మే 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళాశాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగనాథన్‌ ” శ్రీ రామానుజ వైభవం” పై ఉపన్యసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-10T03:42:57Z dg43tfdfdgfd