పక్షులపై ప్రేమ.. పెళ్లికి వచ్చిన వారికి బర్డ్ ఫీడర్లు గిఫ్టులుగా ఇచ్చిన కొత్త జంట

పెళ్లంటే నిండు నూరేళ్ల సావాసం. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య అట్టహాసంగా జరుపుకునే ఓ సంబరం. అలాగే పెళ్లికి వచ్చిన అతిథులు కొత్త జంట నిండు నూరేళ్లు కలిసి మెలిసి పిల్లాపాపలతో సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా వచ్చిన అతిథులకు వధూవరుల కుటుంబాలు తమ తాహతుకు తగ్గట్టుగా బహుమతులు, కానుకలు అందిస్తుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ఓ కొత్త జంట ఇచ్చిన బహుమతులు.. అతిథులను ఆశ్చర్యపరిచాయి. వారు ఊహించని విధంగా బహుమతులు అందించిన వధూవరులు.. ఆశీర్వాదాలతో పాటుగా అభినందనలూ అందుకున్నారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఈడుపుగంటి భూపయ్య చౌదరికి ప్రకృతి అన్నా, పర్యావరణం అన్నా ప్రేమ ఎక్కువ. పక్షులూ, జంతువులంటే ఆయనకు అమితమైన ఇష్టం. అందుకనే తన కుమార్తె రోహిణి వివాహం సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు ఊహించని కానుకలు అందజేశారు. కుమార్తె రోహిణికి, రాజేష్ అనే యువకుడితో పెళ్లి జరిపించారు. ఇక ఈ పెళ్లికి వచ్చిన వారికి పిచ్చుకలు, పావురాలు, చిలుకలు వంటివి ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉండే ఒక ప్లాస్టిక్ పరికరంతో పాటు వెదురు బొంగు పరికరాలను బహుమతిగా అందించారు.

ఇక ఈ బర్డ్ ఫీడర్లను ఇంటి ఆవరణలోనూ, పోర్టుకోలకు వేలాడదీసి.. ఆహారం పెట్టాలని పెళ్లికి వచ్చిన బంధువులకు భూపయ్య సూచించారు. మరోవైపు ఈ బహుమతులు అందుకున్న బంధుమిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాక ఎంతో ఆలోజింపజేసేలా ఉన్నాయన్నారు. అంతరించిపోతున్న పక్షిజాతికి ఊపిరి పోయడానికి దోహదపడతాయని చెప్పారు. వివాహ వేడుకలకు ఇచ్చే రిటర్న్ గిఫ్టులను చాలావరకు ఇంట్లో మూల దాచుకోవడం తప్ప పెద్దగా ఉపయోగకరంగా ఉండవని.. ఇవి మాత్రం పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

అయితే భూపయ్య చౌదరి ఇలాంటి అరుదైన బహుమతులు అందించడం ఇదే తొలిసారి కాదు. తన పెద్ద కుమార్తె వివాహ వేడుకలకు ఆక్సిజన్ మొక్కలు అందించి వార్తలకు ఎక్కారు. అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేసే ఇద్దరి కుమార్తెల వివాహ వేడుకలలో ఈ అరుదైన కానుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T16:23:40Z dg43tfdfdgfd