శ్రీవారికి ఖరీదైన కానుక అందజేసిన తిరుపతికి చెందిన భక్తుడు.. విలువ ఎంతంటే!

తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి భక్తుడు విలువైన కానుకను అందజేశారు. తిరుపతికి చెందిన హేమంత్ శ్రీవారి ఏకాంత సేవకు వినియోగించేందుకు రూ .4 లక్షలు విలువైన వెండి ఉయ్యాలను సోమవారం సాయంత్రం బహుకరించారు. ఆలయంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌కు దాత ఉయ్యాలను అందించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే.

వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

మరోవైపు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

అంతకముందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6.55 నుంచి 7.25 గంటల వ‌ర‌కు మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఉదయం 6.20 నుంచి 6.55 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఇవాళ ఉదయం చిన్నశేష వాహనం.. సాయంత్రం హంస వాహనం సేవలు ఉన్నాయి.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు.. అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కల్యాణోత్సవంలో రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డు, ఒక అప్పం, ఒక ఉత్తరీయం, ఒక రవికె అందజేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా.. అన్నమాచార్య ప్రాజెక్టు, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-18T01:24:10Z dg43tfdfdgfd