స్కాట్లాండ్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారతీయ స్నేహితులతో కలిసి పెర్త్‌షైర్‌లోని లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.

వెంటనే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో వీరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం పై లండన్‌లోని అధికారి స్పందించి.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు. జితేంద్ర, చాణక్య కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నారు.

ఈ ఘటనపై లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి స్పందించారు. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అలాగే, డూండీ విశ్వవిద్యాలయం సాధ్యమైన అన్ని సహాయానికి హామీ ఇచ్చింది. ఏప్రిల్ 19న పోస్ట్‌మార్టం నిర్వహించి, ఆ తర్వాత మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T03:17:12Z dg43tfdfdgfd