HATHRAS STAMPEDE | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట స్పందించిన భోలేబాబా..! ప్రమాదానికి కారణం నిర్వాహకులేనట..!

Hathras Stampede | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై భోలేబాబా అలియాస సాకర్ హరిబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాటకు ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాస్‌లో జరిగిన సంఘటన అనంతరం భోలే బాబా మంగళవారం అర్ధరాత్రి మైన్‌పురిలోని బిచ్వాన్‌ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అక్కడ పోలీసు బలగాలను మోహరించారు. సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 124 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. ఘటనకు కారణమైన బాలే బాబా హత్రాస్‌ నుంచి బిచ్వాన్‌లోని తన విలాసవంతమైన ఆశ్రయానికి రాత్రికి చేరుకున్నారు.

ఆయన రాకపై సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీవో భోగావ్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బలగాలను ఆశ్రమం వద్ద మోహరించారు. బాబాను గృహనిర్బంధంలో ఉంచారు. అయితే, ఆశ్రమంలో బాబా ఉన్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించగా.. సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ఆశ్రయానికి చెందిన ఓ సేవకుడు భోలే బాబా ఆశ్రమంలోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. మంగళవారం బాబా ఆశ్రయానికి వచ్చారని.. ఆ తర్వాత ఆశ్రమంలోకి అనుమతి నిషేధించారన్నారు. మరో వైపు ఈ వార్తలను పోలీసులు ఖండిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. మీడియా వ్యక్తులను సైతం ఆశ్రమం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటూ వస్తున్నారు.

2024-07-03T15:24:13Z dg43tfdfdgfd