PRIYANKA GANDHI | ప్రియాంకాగాంధీని వాయనాడ్‌కు స్వాగతిస్తూ తీర్మానం.. VIDEO

Priyanka Gandhi : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి స్వాగతిస్తూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు తీర్మానం చేశారు. మంగళవారం నియోజవకర్గ కాంగ్రెస్ కమిటీ సమావేశమై తీర్మానానికి ఆమోదం తెలిపింది. దాంతో వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంకా వాద్రా బరిలో దిగేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి కేరళలోని వాయనాడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. దాంతో ఏదో ఒక స్థానాన్ని మాత్రమే అట్టిపెట్టుకుని, మరో స్థానాన్ని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో అగ్ర నేతలు సమావేశమయ్యారు.

రాహుల్ గాంధీ తన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో దేన్ని వదులుకోవాలనే విషయంలో సుదీర్ఘ చర్చ జరిపారు. అనంతరం ఖర్గే, రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకుని, వాయనాడ్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్‌గాంధీ తెలిపారు. వాయనాడ్‌ నుంచి తన సోదరి ప్రియాంకాగాంధీని పోటీకి దించాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇవాళ వాయనాడ్‌ కాంగ్రెస్ నేతలు ఆమెను స్వాగతిస్తూ తీర్మానం చేశారు.

2024-06-18T09:45:38Z dg43tfdfdgfd