SEBEX 2 | భారత సాయుధ బలగాలకు గేమ్‌ ఛేంజర్‌.. విధ్వంసం సృష్టించే సెబెక్స్‌-2

  • అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం
  • అభివృద్ధి చేసిన ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌

SEBEX 2 | న్యూఢిల్లీ, జూలై 1: సైనిక బలగాల శక్తిని మరింత పెంచే, అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్‌ తయారుచేసింది. నాగపూర్‌కు చెందిన ‘ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌’ సంస్థ అభివృద్ధి చేసిన ‘సెబెక్స్‌-2’ను భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపింది.

ఇది టీఎన్‌టీ కంటే 2.01 రెట్లు విధ్వంసకరమని తేల్చింది. ‘ఎకనామిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌’ అభివృద్ధి చేసిన మూడు పేలుడు పదార్థాలు.. భారత సైన్యానికి గేమ్‌ ఛేంజర్‌ అవుతాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత ఆయుధాగారం, సైన్యం వద్ద ఉన్న సాంప్రదాయ బాంబులతో పోల్చితే.. అత్యంత ఫైర్‌ పవర్‌, ప్రాణాంతకతమైనవిగా ఈ పేలుడు పదార్థాలు నిలుస్తాయని ‘ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌’ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.

పేలుడు శక్తిని ‘టీఎన్‌టీ’( ట్రైనైట్రోటాల్యూనీ)తో పోలుస్తారు. బాంబుల టీఎన్‌టీ ఈక్వివలెన్స్‌ ఎంత ఎక్కువుంటే.. అంత ఎక్కువ పేలుడు, విధ్వంసం సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్‌హెడ్స్‌, ఏరియల్‌ బాంబ్స్‌, ఇతర ఆయుధాల్లో వాడుతున్న బాంబుల టీఎన్‌టీ ఈక్వివలెన్స్‌ 1.25 నుంచి 1.30 వరకు ఉంటుంది.

దీనికి రెండు రెట్లు శక్తివంతమైన బాంబుగా సెబెక్స్‌-2 నిలుస్తుందని పరీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని వార్‌హెడ్స్‌, ఆర్టిలరీ షెల్స్‌, ఏరియల్‌ బాంబ్స్‌.. మొదలైన ఆయుధాల సామర్థ్యం మరింత పెరుగుతుందని ‘ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌’ పేర్కొన్నది.

2024-07-01T21:32:20Z dg43tfdfdgfd