SHE’S ALIVE | ఏళ్లుగా కనిపించని మహిళ హత్యకు గురైందన్న పోలీసులు.. ఒప్పుకోని కుమారుడు

తిరువనంతపురం: సుమారు 15 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలీసుల వాదనను మహిళ కుమారుడు నిరాకరించాడు. తన తల్లి బతికే ఉందని (She’s Alive) మీడియాతో అన్నాడు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల వయస్సున కాలా అనే మహిళ 15 ఏళ్ల కిందట అదృశ్యమైంది. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు అందిన ఒక లేఖ ఆధారంగా మంగళవారం ఆమె భర్త ఇంట్లోని రెండు సెప్టిక్ ట్యాంక్‌లను తెరిపించి వెతికించారు. మనిషి ఎముకలు, కొన్ని రసాయనాలను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉంటున్న భ ర్తే, భార్య కాలాను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కాగా, తన తల్లి హత్యకు గురైందన్న పోలీసుల స్టేట్‌మెంట్‌ను ప్రస్తుతం యువకుడైన కాలా కుమారుడు ఖండించాడు. ఆమె బతికే ఉందని తెలిపాడు. ‘అలాంటి (హత్య) ఘటనేమీ జరుగలేదు. మా అమ్మ బతికే ఉందని నాకు నమ్మకం ఉంది. నేను ఆమె కొడుకుని. నాకు టెన్షన్‌ లేదు’ అని మీడియాతో అన్నాడు.

మరోవైపు విదేశాల్లో ఉన్న తండ్రిపైనా ఆ యువకుడు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ‘దీని గురించి ఒత్తిడికి గురికావద్దని మా నాన్న చెప్పారు. కొంత అప్పు ఉండటంతో ఇప్పుడే దేశానికి తిరిగి రాలేనని ఆయన అన్నారు’ అని వెల్లడించాడు.

2024-07-03T11:38:34Z dg43tfdfdgfd