AADUJEEVITHAM MOVIE REVIEW - ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran's Aadujeevitham Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి ఇండియాకు మళ్లీ ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. 

కథ (Aadujeevitham Movie Story): నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. నదిలో నీళ్లలో మునిగి ఇసుక తీయడం అతని పని. భార్య సైను (అమలా పాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్, సొంత ఇల్లు, మెరుగైన జీవితం కోసం ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి... 30 వేలు ఖర్చు చేసి సౌదీ వెళతాడు. నజీబ్, అతనితో పాటు వచ్చిన హకీమ్ (కెఆర్ గోకుల్)ను తీసుకువెళ్లిన  కఫీల్ (తాలిబ్) గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పని దగ్గర పెడతాడు. అక్కడ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కఫీల్ ఏం చేశాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) సహాయంతో నజీబ్, హకీమ్ పని వదిలేసి వచ్చిన తర్వాత ఎడారిలో ఏం జరిగింది? ఇసుక తుఫాను, ఎడారి సర్పాలు, ఆకలి బాధలు తట్టుకుని ప్రాణాలతో ముగ్గురూ బయట పడ్డారా? లేదా? అనేది సినిమాలో చూడాలి. 

విశ్లేషణ (Aadujeevitham movie review Telugu): వాస్తవిక పరిస్థితులను వెండితెరపై ఆవిష్కరించడంలో మలయాళ చిత్రసీమది ప్రత్యేక శైలి. నిదానంగా సాగినా ప్రతిదీ డిటెయిల్డ్‌గా చెబుతారు. 'ఆడు జీవితం' ఆ జాబితాలో చిత్రమే. నజీబ్ ఎదుర్కొన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు బ్లెస్సీ. దాంతో కథనం మరీ నెమ్మదించింది. ఒక దశలో ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? త్వరగా ముగిస్తే బావుంటుంది? అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది.

జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక జీవన శైలికి అలవాటు పడతారు. అటువంటి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా దూరమై, పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తే... ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనేది బ్లెస్సీ చూపించిన తీరు బావుంది. నీళ్లలో పని చేసి వెళ్లిన వ్యక్తికి ఒక్కసారిగా నీరు దూరమైన తరుణంలో, కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీరు దొరకని పరిస్థితుల్లో అతని మానసిక స్థితిని చక్కగా చూపించారు. బ్లెస్సీ దర్శకత్వంలో మెరుపులు ఉన్నాయి. సినిమాలో కంటతడి పెట్టించే దృశ్యాలు ఉన్నాయి. అయితే... ముందుగా చెప్పినట్టు ఎంత సేపటికీ కథ ముందుకు కదలని ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. 

ఎడారి జీవితం, కేరళలో జీవితం... రెండిటినీ కంపేర్ చేస్తూ ఫస్టాఫ్ బాగా సాగింది. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి... ఎడారి నుంచి నజీబ్, ఖాదిరి, హకీమ్ బయట పడతారా? లేదా? అనే పాయింట్ చుట్టూ తిరిగింది. దాంతో లెంగ్త్ ఎక్కువైన ఫీల్ వస్తుంది. అయితే... పృథ్వీరాజ్ సుకుమారన్ నటన చాలా వరకు సినిమాను నిలబెట్టింది. ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. మధ్యలో ఇసుక తుఫాను, ఎడారిలో సర్పాలు వచ్చే సన్నివేశాలు షాక్ ఇస్తాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, సునీల్ కెఎస్ ఛాయాగ్రహణం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్! పాటల కంటే నేపథ్య సంగీతంలో రెహమాన్ మార్క్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. 

'ఆడు జీవితం' చిత్రీకరణ మార్చి 1, 2018లో ప్రారంభించామని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఇన్నేళ్లు ఆయన ఈ సినిమా కోసం ఎందుకు కష్టపడ్డారు? అనే ప్రశ్నకు సమాధానం సినిమాలో లభిస్తుంది. నజీబ్ పాత్రలో ప్రాణం పెట్టి నటించారు. నిజ జీవితంలో నజీబ్ పడిన కష్టం మనకు తెలియదు. కానీ, 'ఆడు జీవితం' సినిమా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన చూస్తున్నంత సేపూ ఆ బాధను మనం అనుభవిస్తాం. అంత గొప్పగా ఆయన నటించారు. ఆయన నుంచి అంత గొప్ప నటనను దర్శకుడు బ్లెస్సీ తీసుకున్నారు.

Also Readఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ నటించిన ఉషా మెహతా బయోపిక్ ఎలా ఉందంటే?

లుక్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ పరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించిన వేరియేషన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమాతో ఆయనకు అవార్డులు రావడం గ్యారంటీ. నజీబ్ భార్యగా అమలా పాల్ స్క్రీన్ స్పేస్ తక్కువ. పాత్ర పరిధి మేరకు ఆవిడ నటించారు. పాటలో పృథ్వీరాజ్, అమల జోడీ చూడముచ్చటగా ఉంది. ఇబ్రహీం ఖాదిరిగా జిమ్మీ జాన్ లూయిస్, హకీమ్ పాత్రలో కెఆర్ గోకుల్ నటన బావుంది.

నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ సినిమా 'ఆడు జీవితం - ది గోట్ లైఫ్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే... కష్టాలు మరీ ఎక్కువ కావడం, సాగతీయడంతో థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక అవసరం. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లడం మంచిది.

Also Readమమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

2024-03-28T08:16:18Z dg43tfdfdgfd