ACTOR GOVINDA: మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా.. 14 ఏళ్ల వనవాసం పూర్తి

Actor Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి చేరిన గోవిందా.. 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2009 వరకు ఎంపీగా కొనసాగిన గోవిందా.. ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. అనంతరం 14 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన షిండే పార్టీలోకి చేరి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గోవిందా తమ పార్టీలో చేరడంతో శివసేన షిండే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలోని బాలాసాహెబ్‌ భవన్‌లో గోవిందా గురువారం షిండే శివసేన పార్టీలో చేరారు. గోవిందాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోవిందా షిండే శివసేన పార్టీ తరఫున నార్త్ వెస్ట్ ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గతంలో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన గోవిందా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నేత రామ్‌ నాయక్‌ను ఓడించి గెలిచారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న గోవిందా తాజాగా షిండే శివసేన పార్టీలో చేరారు. 2010 నుంచి 2014 వరకు 14 ఏళ్ల వనవాసం పూర్తి అయిందని.. ఈ సందర్భంగా గోవిందా ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానని గోవిందా స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే 2009 లోక్‌సభ ఎన్నికల్లో గోవిందా పోటీ చేయలేదు. అనంతరం కాంగ్రెస్‌కు, రాజకీయాలకు గుడ్ బై చెప్పి కాస్త దూరంగా ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ముగిసినట్లేనని అంతా భావించిన తరుణంలో ఆయన మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి షిండే శివసేన పార్టీలో చేరారు. ఇక ఇదే నార్త్ వెస్ట్ ముంబై నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తరఫున అమోల్‌ కీర్తికర్‌ బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ- షిండే వర్గం శివసేన - అజిత్ పవార్ ఎన్సీపీలు కలిసి ‘మహాయుతి’ కూటమిగా ఏర్పడి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌- ఉద్ధవ్ ఠాక్రే శివసేన- శరద్‌ పవార్‌ ఎన్సీపీలు మహా వికాస్ అఘాడీగా బరిలోకి దిగుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T13:50:50Z dg43tfdfdgfd