AP NEWS | కారు గిఫ్ట్‌ ఇచ్చిన జనసైనికులు.. వద్దని వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే

AP News | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసైనికులు తమ ప్రేమను చాటుకున్నారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు కారు కొనుక్కునే స్థోమత కూడా లేదని తెలుసుకున్న జనసైనికులు చేయి చేయి కలిపారు. తలా కొంత డబ్బు చందాలు వేసుకుని టొయోటొ ఫార్చూనర్‌ కారును కొనుగోలు చేశారు. దీన్ని తీసుకెళ్లి ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అందజేశారు.

జనసైనికులు తనపై చూపిన అభిమానానికి చిర్రి బాలరాజు పొంగిపోయారు. వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కానీ జనసేన కార్యకర్తలు కొనిచ్చిన కారును తీసుకునేందుకు మాత్రం నిరాకరించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను అనుసరిస్తానని.. అందుకే కారు వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. పోలవరం నియోజకవర్గ సమస్యలపై ఏడేళ్లుగా పోరాడుతున్నానని.. ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

చిర్రి బాలరాజు నిరుపేద గిరిజన రైతు కుటుంబానికి చెందినవారు. రేకుల షెడ్డు తప్ప ఆయనకు చెప్పుకోదగ్గ ఆస్తులేవీ లేవు. జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన ఆయన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చారు. ఇది గమనించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో ఆయన గెలవలేకపోయారు. అయినప్పటికీ 2024లో మళ్లీ ఆయనకే పవన్‌ కల్యాణ్‌ అవకాశం కల్పించారు. దీంతో గత ఎన్నికల్లో పోలవరం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన చిర్రి బాలరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత వాహనం కొనుక్కునే అంత ఆర్థిక స్థోమత ఆయనకు లేదు. ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గంలో తిరగాలన్నా, సమీక్షలకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన జనసేన కార్యకర్తలు కొంత డబ్బును చందాలు వేసుకున్నారు. దానితో డౌన్‌ పేమెంట్‌ చేసి టొయోటొ ఫార్చూనర్‌ కారును బుక్‌ చేశారు. ఆ కారును అందజేశారు. కానీ ఆ కారును తీసుకునేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు.

2024-07-03T07:24:32Z dg43tfdfdgfd