ARIF MOHAMMED KHAN: అయోధ్య రామాలయంలో కేరళ గవర్నర్, విగ్రహానికి శిరస్సు వంచి మొక్కిన ఆరిఫ్ ఖాన్

Ram Mandir in Ayodhya: అయోధ్యలోని రామ మందిరంలో బుధవారం (మే 8) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్య రామాలయ దర్శనం చేసుకొని, రామ్ లల్లా విగ్రహం ఎదుట నేలపై పడుకొని నమస్కారం చేశారు. మరో మతానికి చెందిన వ్యక్తి రాముడిని దర్శించుకోవడం, పైగా ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి.

సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం అని అంటారు. కానీ, ఆరీఫ్ ఖాన్ శ్రీరాముడిని ఇలా దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా ఆరీఫ్ ఖాన్ చాలా కాలంగా ఇస్లాంలో సంస్కరణల కోసం పోరాడుతున్నారు. కాబట్టి, ఆయన శ్రీరాముడ్ని అలా దర్శించుకోవడంలో ఆశ్చర్యం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యను సందర్శించిన వారం రోజుల తర్వాత కేరళ గవర్నర్ ఇప్పుడు దర్శించుకున్నారు. ముర్ము గిరిజనులు అయినందున రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆమెను ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆరీఫ్ ఖాన్ తప్పుబట్టారు. మరోవైపు, అయోధ్య మందిరాన్ని హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు కూడా దర్శించుకుంటున్నారు. గత ఫిబ్రవరిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అయోధ్య మందిరాన్ని సందర్శించారు. ఈయన సిక్కు మతానికి చెందిన వారు.

పాకిస్థాన్ నుంచి కూడా

పాకిస్తాన్ నుంచి దాదాపు 250 మందికి పైగా హిందువులు, సింధ్ నుంచి వచ్చి రామ్ లల్లా దర్శనం చేసుకున్నారు. వీరు గత శుక్రవారం అయోధ్యకు వచ్చారు. ఈ వ్యక్తులు సింధ్ ప్రావిన్స్‌లోని 34 జిల్లాలకు చెందినవారని ఆలయ అధికారులు తెలిపారు. జనవరి 22న అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుండి 100 దేశాలకు చెందిన ప్రతినిధులతో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఆలయ దర్శనం చేసుకున్నారు. ఇటీవల మారిషస్, శ్రీలంక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు.

2024-05-08T16:14:20Z dg43tfdfdgfd