ASHADHA AMAVASYA 2024 : ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

Ashada Masam 2024:  చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి నెలలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ నెలకి పేర్లు నిర్ణయించారు పండితులు. పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చే మాసాన్ని ఆషాడమాసం అని పిలుస్తారు. 

2024 లో ఆషాడమాసం ప్రారంభం -  జూలై 06 శనివారం 

ఆషాడమాసం ముగింపు - ఆగష్టు 04 ఆదివారం 

 

కొత్త దంపతులకు ఎడబాటు

ఆషాడం ప్రారంభం కాగానే కొత్త దంపతులకు ఎడబాటు తప్పదు. కొత్తగా పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన వధువు...ఈ నెల రోజులు తిరిగి పుట్టింటికి తీసుకెళ్లిపోతారు. ఈ నెలరోజులు అత్తా కోడలు, అత్తా అల్లుడు ఒకే ఇంట్లో ఉండకూడదంటారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఈ నియమాలన్నీ పాటించేవారు. ఇప్పుడు పెళ్లిచేసుకుని ఉద్యోగాల రీత్యా కుటుంబాలతో కలసిఉండడం లేదు. అందుకే భార్య-భర్త మాత్రమే ఉంటే ఆషాడంలో ఎడబాటు పాటించాల్సిన అవసరం లేదు. 

Also Read: దాన వీర శూర 'కర్ణుడు' నిజంగా హీరోనేనా? విలన్ ని చేశారా..భీష్ముడు ఏం చెప్పాడంటే!

ఆషాడంలో ఎడబాటుకి అసలు కారణాలివే...

ఆషాడ మాసంలో నెలతప్పితే...ప్రసవం సరిగ్గా మంచి ఎండల టైమ్ లో ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసవం అంటే ఆ సమయంలో ఉన్న వేడి వాతావరణం తల్లి - బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా వేసవిలో సాధారణ ప్రసవాల సమయంలో అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంది...పైగా అప్పట్లో హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందేది కాదు..అందుకే ఈ సంప్రదాయం పెట్టారు పెద్దలు. పైగా వర్షాకాలం ప్రారంభమైన వ్యవసాయపనులు మొదలయ్యే సమయం ఇది. అప్పట్లో కుటుంబం అంతా కలసి వ్యవసాయపనులు చేసేవారు. ఒక్కరు తగ్గినా పనులు ముందుకుసాగేవికాదు. కొత్తగా పెళ్లైన జంట ఇంట్లో ఉంటే వ్యవసాయ పనులకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఆషాడంలో ఎడబాటు అనే నియమం పాటించడం మొదలెట్టారు. కొత్త అల్లుడు అత్తింటి గడపతొక్కకూడదు అని చెప్పడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు..కొత్తగా పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయి పుట్టింటికి ఒక్కసారిగా దూరం అయిపోవాల్సి ఉంటుంది. కొత్త వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత తిరిగి పుట్టింట్లో నెల రోజులు ఉంటే అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఉండాలో, ఆ కుటుంబంలో ఒకరిగా ఎలా మెలగాలో...పెద్దలు నేర్పించి పంపించేవారు.  ఇప్పుడంటే ఉద్యోగాల పేరుతో పెళ్లికి ముందు నుంచీ దూరంగా ఉంటున్నారు, పైగా ఫోన్లు ఉండనే ఉన్నాయి..అందుకే నూతన దంపతుల ఎడబాటు అనే మాటే లేదు.  

 

శక్తి మాసం

ఆషాడ మాసాన్ని శక్తి మాసం అంటారు. ఈ నెలరోజులు అమ్మవార్లకు..ముఖ్యంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణలో నిర్వహించే బోనాలు ఈ కోవకు చెందినదే. ఆషాడంలో జగన్నాథుడి రథయాత్రతో పాటూ పలు ఆలయాల్లో ప్రత్యేక సేవలు జరుగుతాయి.

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 ఆషాఢ అమావాస్య  ( ఆగష్టు 04 ఆదివారం)

ప్రతి తెలుగు నెల చివర్లో వచ్చే అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తారు..ఆషాడంలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడతారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కావడంతో  ఈ రోజు పితృదేవతలను పూజిస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు

ఆషాడంలో గోరింట ప్రత్యేకం

ఆషాడమాసంలో వాతావారణంలో వచ్చే మార్పులు, పొలం పనులు కారణంగా చేతులు, పాదాలపై ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. అందుకే ఈ నెలలో గోరింట పెట్టుకోవాలి అనే సంప్రదాయం తెచ్చిపెట్టారు.  

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

2024-07-03T05:29:05Z dg43tfdfdgfd