BEST THRILLER MOVIES ON OTT: ఊరిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ - ఆధారాలు వదిలినా పట్టుకోలేరు, చివరికి ఊహించని ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్ అవుద్ది

Best Thriller Movies On OTT: హారర్ సినిమాలు అంటే ప్రేక్షకులను భయపెడితే చాలు.. అలా భయపెట్టడం కోసం ప్రత్యేకంగా మూవీలో దెయ్యాలే ఉండాల్సిన అవసరం లేదని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి వాటిలో ‘ఐ సీ యూ’ (I See You) కూడా ఒకటి. ఆడమ్ ర్యాండెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రత్యేకంగా ఏ జోనర్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యింటాయి. దీన్ని బట్టి చూస్తే ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. 2019లో విడుదలయిన ‘ఐ సీ యూ’.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫీచర్ అయ్యి పాజిటివ్ రివ్యూలను అందుకొని ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

కథ

‘ఐ సీ యూ’ కథ విషయానికొస్తే.. సినిమా ఓపెన్ చేయగానే స్కూల్ ముగించుకొని పదేళ్ల అబ్బాయి జస్టిన్ విట్టర్.. సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒక అడవి మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు తనను ఏదో లాగి పడేసినట్టుగా ఉంటుంది. అప్పటినుంచి జస్టిన్ కనిపించకుండా పోతాడు. దాంతో పాటు మరో అబ్బాయి మిస్సింగ్ కేసును ఛేదించడానికి గ్రెగ్ హార్పర్ (జాన్ టెన్నీ) రంగంలోకి దిగుతాడు. గ్రెగ్‌కు అప్పటికే పెళ్లి అయ్యి ఒక కొడుకు కూడా ఉంటాడు. తనే కానర్ హార్పర్ (జుడా లెవీస్). ప్రొఫెషనల్‌గా గ్రెగ్.. ఎంత మంచి ఆఫీసర్ అయినా పర్సనల్‌గా తన ఇంట్లో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటాడు. గ్రెగ్ భార్య జాకీ హార్పర్‌ (హెలెన్ హంట్)కు ఒక వివాహేతర సంబంధం ఉంటుంది. ఈ విషయం గ్రెగ్, కానర్‌కు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో కలిసే ఉంటారు. 

మరోవైపు గ్రెగ్.. మిస్ అయిన పిల్లల కోసం వెతుకుతున్న సమయంలో వారికి ఒక చిన్న కత్తి దొరుకుతుంది. చాలా ఏళ్ల క్రితం ఒక సైకో కిల్లర్ (కోల్ గార్డెన్) కూడా ఇదే తరహాలో పిల్లలను కిడ్నాప్ చేసి.. తన గుర్తుగా అక్కడ అలాంటి గ్రీన్ కలర్ కత్తిని వదిలి వెళ్లేవాడు. కానీ ఇప్పుడు అతడు జైలులో ఉండడంతో తనలాగే ఇంకెవరైనా ఇదే తరహాలో కిడ్నాప్‌లు చేస్తున్నారా అని గ్రెగ్‌కు అనుమానం వస్తుంది. ప్రొఫెషనల్‌గా చాలా ఒత్తిడిలో ఉన్న గ్రెగ్‌కు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతత ఉండదు. తన ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

Also Read: హైట్స్ అంటే భయమా? ఈ మూవీ చూస్తే జడుసుకుంటారు - టవర్ అంచున మృత్యుక్రీడ

(స్పాయిలర్ అలర్ట్.. ఈ మూవీని మీరు చూడాలని అనుకుంటే.. చివరి పేరా చదవద్దు. ట్విస్ట్ రివీల్ చేశాం)

అదే సమయంలో జాకీ మాజీ ప్రేమికుడు టాడ్ (సామ్ ట్రామెల్) తనను కలిసి తనతో పాటు తీసుకెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో జాకీ ఇంట్లోనే టాడ్ చనిపోయి ఉంటాడు. ఇంట్లో జరుగుతున్న విచిత్ర సంఘటనలకు, టాడ్ చావుకు తమ కొడుకు కానరే కారణమని గ్రెగ్, జాకీ అనుకుంటారు. కానీ అదంతా ఫ్రాగర్స్ పని. ఫ్రాగర్స్ అంటే ఒకరి ఇంట్లోకి దూరి, ఆ ఇంట్లో మనుషులకు తెలియకుండానే 10 రోజుల పాటు వారు చేసే పనులు అన్నీ రికార్డ్ చేస్తుంటారు. అలా ఫ్రాగింగ్ కోసం వచ్చిన మిండీ (లైబ్ బారెర్)కు పోలీస్ అధికారి గ్రెగే కిడ్నాపర్ అని తెలుస్తుంది. అదే సినిమాలోని అసలు ట్విస్ట్. కానీ గ్రెగ్ కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? చివరికి తనకు ఏమైంది? అనేది తెరపై చూస్తేనే మజా వస్తుంది.

పర్ఫెక్ట్ థ్రిల్లర్‌

‘ఐ సీ యూ’ సినిమాను ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా మలిచాడు దర్శకుడు ఆడమ్ ర్యాండెల్. సినిమా మొత్తాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ హాఫ్‌లో ఒక కథ, సెకండ్ హాఫ్‌లో మరో కథను చెప్పి.. ప్రేక్షకులను ఏ మాత్రం కన్‌ఫ్యూజ్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్‌ను ఇవ్వగలిగాడు దర్శకుడు. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలామంది ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవ్వక తప్పదు. సినిమాను మళ్లీ వెనక్కి వెళ్లి చూస్తే తప్పా అసలు క్లైమాక్స్‌లో ఏం జరిగింది అనే విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు. అసలు విలన్ ఎవరు అనే ట్విస్ట్ ‘ఐ సీ యూ’ మూవీకే హైలెట్‌గా నిలుస్తుంది. ఒక మంచి హాలీవుడ్ థ్రిల్లర్‌ను చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ‘ఐ సీ యూ’ మూవీని చూసేయండి.

Also Read: సవతి తల్లి కూతురితో ప్రేమ, ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే? ఒకే ఇంట్లో అరాచకం - ఇదో అరుదైన ప్రేమ కథ!

2024-04-23T10:15:45Z dg43tfdfdgfd