BHOLE BABA: ప‌రారీలో భోలే బాబా.. కొన‌సాగుతున్న పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌

హాథ్రాస్‌: యూపీలోని హాథ్రాస్‌లో జ‌రిగిన భోలే బాబా(Bhole Baba) స‌త్సంగ్‌లో విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ తొక్కిస‌లాట‌లో సుమారు 121 మంది మ‌ర‌ణించారు. అయితే ప్ర‌స్తుతం ఆ బాబా ఆచూకీ చిక్క‌డం లేదు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 నిమిషాల‌కు .. స‌త్సంగ్ ప్రాంగ‌ణం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. కానీ ఆ ఘ‌ట‌న త‌ర్వాత భోలే బాబా ఆన‌వాళ్లు దొర‌క‌డం లేదు. ఆయ‌న ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ బాబా కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత బాబా వాహ‌నం వెంట జ‌నం ఉరికిన‌ట్లు తెలుస్తోంది. బాబా న‌డిచిన ప్ర‌దేశంలోని మ‌ట్టిని తీసుకోవాల‌న్న ఉద్దేశంతో ఆయ‌న అనుచ‌రులు ఎగ‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలోనే తీవ్ర‌మైన తొక్కిస‌లాట జ‌రిగింది. మ‌ట్టి కోసం కింద‌కు వంగిన స‌మ‌యంలో జ‌నం ఒక‌రిపై ఒక‌రు ప‌డ్డారు.

మెయిన్‌పురి జిల్లాలోని భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిట‌బుల్ ట్ర‌స్టులో పోలీసులు సోదాలు చేశారు. అక్క‌డ ఆయ‌న ఆచూకీ చిక్క‌లేదు. ఎక్క‌డికి వెళ్లాడో తెలియ‌దు. విషాద ఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌న కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయ‌న ఆశ్ర‌మంలో బాబాను క‌నుగొన‌లేద‌ని, ఆయ‌న ఇక్క‌డ లేర‌ని డిప్యూటీ ఎస్పీ సునిల్ కుమార్ తెలిపారు. అయితే ఆ బాబాపై ఎటువంటి కేసు న‌మోదు చేస్తార‌న్న విష‌యం ఇంకా తెలియ‌దు. కానీ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో నిర్వాహాకుడు దేవ్ ప్ర‌కాశ్ మ‌ధుక‌ర్‌పై కేసు బుక్ చేశారు.

ఓ గ్రామ ప‌రిస‌రాల్లో జ‌రిగిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. నిజానికి 80 వేల మంది వ‌ర‌కే ప‌ర్మిష‌న్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కేవ‌లం 40 మంది పోలీసులు మాత్ర‌మే ర‌క్ష‌ణ విధుల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

2024-07-03T05:09:03Z dg43tfdfdgfd