BOMB THREAT | టీవీలో వార్తలు చూసి.. సరదా కోసం విమానానికే బాంబు బెదిరింపు.. బాలుడి నిర్వాకం

Bomb Threat | దేశంలో ఇటీవలే బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, పలువురు నేతలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 13 ఏళ్ల బాలుడు సరదా కోసం టొరంటో విమానానికే బాంబు బెదిరింపు మెయిల్‌ పంపడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా (Air Canada) విమానానికి ఇటీవలే బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చిన సంగతి తెలిసిందే. విమానం గత మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో (Delhi – Toronto Flight)కు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (Delhi International Airport Limited) కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఓ మెయిల్‌ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా.. బెదిరింపు బూటకమని తేలింది. బాంబు బెదిరింపు అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు తాజాగా గుర్తించారు.

ఈ పని చేసింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడని (Meerut Boy) దర్యాప్తులో తేల్చారు. ఆ బాలుడు ఈ మెయిల్‌ పంపేందుకు ఏకంగా నకిలీ ఐడీని క్రియేట్‌ చేసినట్లు గుర్తించారు. మెయిల్‌ చేసిన అనంతరం బాలుడు అకౌంట్‌ను డిలీట్‌ చేసేసినట్లు అధికారులు తెలిపారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ విషయాలు బయటపడ్డాయి. సరదా కోసమే బెదిరింపు మెయిల్‌ పంపినట్లు బాలుడు పోలీసులకు చెప్పాడు. ఇటీవలే పలు నగరాల్లోని పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు టీవీలో వార్తలు చూశానని, వాటిని చూసి తనకు ఇలాంటి ఆలోచన వచ్చినట్లుగా పోలీసులకు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

Also Read..

Malawi | మిస్సైన సైనిక విమానం దట్టమైన అడవిలో కూలిపోయి ఉండొచ్చు : మలావీ మిలటరీ

Parliament session | ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. ఆరోజే లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక!

Toll Booth | ట్యాక్స్‌ చెల్లించమన్నందుకు టోల్‌ బూత్‌ను బుల్డోజర్‌తో ధ్వంసం చేసిన డ్రైవర్‌.. VIDEO

2024-06-11T11:15:50Z dg43tfdfdgfd