CHICKEN SHAWARMA: చికెన్ షవర్మా తినడం వల్ల ఎందుకు చనిపోతున్నారు.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Chicken Shawarma: వీకెండ్ బయటికి వెళ్లామంటే చాలు చికెన్, మటన్ లాగించాల్సిందే. అంతేకాకుండా ఇంట్లో కూడా నాన్‌వెజ్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చికెన్, మటన్‌తో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక చికెన్‌తో తయారు చేసే షవర్మాను తినేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ షవర్మా తిని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగుచూడటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే అసలు చికెన్ షవర్మా తింటే చనిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అసలు చికెన్ షవర్మా తయారు చేయడం, దాన్ని నిల్వచేయడం గురించి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే చికెన్ షవర్మా తినడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దాన్ని తయారు చేయడం, పరిశుభ్రత పాటించడంలోనే అసలు సమస్య ఉందని పేర్కొంటున్నారు. చికెన్ సరిగా ఉడకకపోవడం, లేదా దాన్ని సరిగా ఫ్రిజ్‌లో పెట్టకపోవడం కారణంగానే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని చెబుతున్నారు. సాధారణంగా షవర్మా తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడమే అసలు సమస్యకు కారణం అని వెల్లడించారు. షవర్మా తయారు చేసే సమయంలో చికెన్ ముక్కలను ఒక రాడ్‌కు గుచ్చి మంటతో గంటల తరబడి నెమ్మదిగా కాల్చుతూ ఉంటారు. దీని వల్ల రద్దీగా ఉన్న సమయంలో రెస్టారెంట్‌లు పూర్తిగా ఉడకని చికెన్‌ను కస్టమర్లకు అందిస్తూ ఉంటాయి. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

ఇక అంతే కాకుండా షవర్మా కోసం ఉపయోగించే చికెన్‌ను ఎక్కువ రోజులుగా నిల్వ ఉంచడం.. ఆ నిల్వ ఉంచడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణం అని పేర్కొన్నారు. షవర్మా మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాతి రోజు కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో ఆ షవర్మాను సరిగా స్టోరీ చేయకపోవడం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ షవర్మాలో హానికరమైన బ్యాక్టీరియా తయారై.. ఫుడ్ పాయిజనింగ్‌ సహా ఇతర అనారోగ్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T11:42:02Z dg43tfdfdgfd