FRIENDSHIP MARRIAGE: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకుంటున్న యువతీయువకులు.. ఈ కొత్త ట్రెండ్‌ ఏంటో తెలుసా?

Friendship Marriage: రోజురోజుకూ సమాజం ఎంతో వేగంగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఇద్దరు యువతీ యువకులు పెళ్లి చేసుకునేవారు. కానీ ఆ తర్వాత కాలం మారుతున్న కొద్ది పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు ఆసక్తి చూపించారు. అంటే ఇద్దరు యువతీ యువకులు ఒకే ఇంట్లో ఉంటూ శృంగార పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా జీవిస్తూ ఉంటారు. మన దేశం కంటే విదేశాల్లో ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో కూడా నగర యువత ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ట్రెండ్‌కు బాగా అలవాటు పడింది. వీరికి చట్టపరంగా కొన్ని హక్కులు కూడా ఉంటాయి. అయితే తాజాగా మరో కొత్త రిలేషన్‌షిప్ వచ్చింది.. అదే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్.

జపాన్ యువత ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ అనే సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో యువతీ యువకులు ఇద్దరు చట్ట పరంగా వివాహం చేసుకుని.. ఒకే ఇంట్లో నివసిస్తారు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ గానీ, సెక్స్ గానీ ఉండదు. జపాన్‌లో 12.4 కోట్ల మంది ప్రజలు ఉండగా.. అందులో 1 శాతం మంది యువత ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. సంప్రదాయ పెళ్లి లేదా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కంటే ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. పెళ్లి, బంధాలు, బంధుత్వాలు ఇష్టం లేనివాళ్లు ఇలాంటి రిలేష‌న్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది.

2015 లో జపాన్‌లో ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 500 మంది ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో తమకు నచ్చిన భాగ‌స్వామిని.. వారికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి అంటే ఇది చట్టప్రకారంగానే జరుగుతుంది. ఇక ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజీల‌ను నిర్వహించేందుకు క‌ల‌ర్స్ అనే ఓ ఏజెన్సీ కూడా ఉన్నది. ఈ కలర్స్ ఏజెన్సీ వ‌ద్ద ఉన్న డేటా ఆధారంగా ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఇక ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకున్నవారు కుటుంబ సభ్యులతో కాకుండా వేరుగా ఉంటున్నారు.

ఇక ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజీలో ఇద్దరు భాగ‌స్వాములు.. సెక్స్ ద్వారా కాకుండా కృత్రిమ పద్దతుల్లో పిల్లల్ని క‌నేందుకు కూడా అవకాశం ఉంటుంది. పిల్లలు కావాలని ఇద్దరూ అనుకుంటే ఆ నిర్ణయం తీసుకోవ‌చ్చు. ఇక ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకున్న వారు.. పరస్పర అంగీకారంతో వేరే వ్యక్తులతో సెక్స్, రిలేషన్‌లో ఉండేందుకు కూడా వీలు ఉంటుంది. మొత్తానికి ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ అంటే ఒక పెళ్లి అనే రిలేషన్‌లా కాకుండా రూమ్‌మేట్ లాంటి రిలేషన్ అని.. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకున్న ఒకరు వెల్లడించారు.

ఇక ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకోవాలని అనుకునే వారు పెళ్లికి ముందే కలిసి మాట్లాడుకుంటారు. తమ ఇష్టాలు, కోరికలు, భవిష్యత్ ప్లాన్లు చర్చించుకుంటారు. ఇద్దరికీ ఇష్టం అనుకుంటే ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకుంటారు. అయితే లవ్, సెక్స్ లేకుండా ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకున్న 80 శాతం మంది జంటలు చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు క‌ల‌ర్స్ ఏజెన్సీ వెల్లడించింది. కొంతమంది పిల్లలను కూడా క‌న్నట్లు తెలిపింది. స‌గ‌టున 32 ఏళ్లు ఉన్న జపాన్ యువత ఇలాంటి ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్లు, హోమోసెక్స్ వ‌ర్గాలు, పెళ్లి చేసుకోవద్దు అనుకునేవారు ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజీ ప‌ట్ల ఆస‌క్తి చూపిస్తున్నట్లు కలర్స్ ఏజెన్సీ తెలిపింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-10T10:23:59Z dg43tfdfdgfd