KTR | మళ్లీ గెలిపించుకునే దమ్ముందా?.. ఫిరాయింపులపై సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

  • అయితే రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోండి
  • కొనుగోలు సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీ పాపమే
  • నాడు బీఆర్‌ఎస్‌లో చేరికలన్నీ రాజ్యాంగబద్ధం
  • నేడు అంగట్లో మాదిరి ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలు
  • ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో రేవంత్‌ చెప్పాలి

అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరు. ప్రజల మనసుల్లో నుంచి పార్టీ పోవడమనేది అసాధ్యం. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు ప్రజల మద్దతు తిరిగి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పూర్వవైభవం సాధిస్తుంది.

– జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల భేటీలో కేటీఆర్‌

KTR | జగిత్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ సంస్కృతికి నాంది పలికారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్‌ చేశారు. అలా చేస్తే పార్టీ మారినవారిని ప్రజలు రాళ్లతో కాదు ఓట్లతో చంపుతారని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని రేవంత్‌రెడ్డి, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో రోజుకో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ వారిని బొమ్మల్లా కూర్చోబెడుతున్నారని ధ్వజమెత్తారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అంగట్లో బర్లను, గొర్లను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన దొడ్లో కట్టేసుకుంటున్నాడని మండిపడ్డారు. ఒక పార్టీ బీఫాంపై గెలిచి, మరో పార్టీలోకి చేరడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. గతంలో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేర్చుకున్నదని కొందరంటున్నారని చెప్తూ, అప్పటి పరిస్థితులు వేరని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ తొలిసారి 63 సీట్లతో అధికారంలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని పేర్కొన్నారు.

వచ్చిన తెలంగాణను బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయింది, పరిపాలన చేతకావడం లేదు అనే విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నాడు ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారిని రాజ్యాంగబద్ధంగా చేర్చుకున్నామని వివరించారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు మంది తమ పార్టీ లెజిస్లేటరీ విభాగాన్ని ఇతర పార్టీల ఎల్‌పీల్లో విలీనం చేసేందుకు రాజ్యాంగం అనుమతి ఇస్తుందని చెప్పారు. అదే పద్ధతిలో అప్పటి చేరికలు జరిగాయని గుర్తుచేశారు. బీఎస్పీ నుంచి ఇద్దరు సభ్యులు గెలిస్తే వారిద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరారని ఉదహరించారు. టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో మెజార్టీ సభ్యులు, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 18 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని వివరించారు. అప్పటి చేరికల్లో ఏ ఒక్కటీ రాజ్యాంగ విరుద్ధంగా జరగలేదని తేల్చిచెప్పారు.

కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తరువాత పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలంటూ గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతోపాటు, పార్టీ బీఫాంపై గెలిచినవారు మరో పార్టీలోకి ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తామంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రదర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ చేర్చుకున్న సందర్భంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. సంజయ్‌కుమార్‌ చేరిక పాంచ్‌న్యాయ్‌ సూత్రాలకు విరుద్ధమని జీవన్‌రెడ్డి పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. రేవంత్‌, రాహుల్‌, జీవన్‌రెడ్డి మాటలను విన్న తర్వాత ప్రజలు ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలో నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.

హామీలపై నిలదీస్తారనే ఎమ్మెల్యేల కొనుగోళ్లు

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్‌ విమర్శించారు. ‘రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. పింఛన్లు పెంచలేదు. వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదు. బీసీలకు 42% రిజర్వేషన్‌ గంగలో కలిసింది. రూ.20 వేల కోట్లతో మైనార్టీల అభివృద్ధి జాడలేకుండా పోయింది. మహిళలకు నెలకు రూ.2,500 హామీ అమలు కాలేదు’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉచిత కరెంట్‌ వస్తున్నదా? అని ప్రశ్నిస్తూనే.. అసలు కరెంట్‌ ఉంటే కదా రావడానికి అని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల మనస్సుల్లో నుంచి పోవడమనేది సాధ్యం కాదని స్పష్టంచేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని చిన్నచిన్న సమస్యల వల్ల ఇబ్బంది వచ్చిందని పేర్కొన్నారు. వరుసగా రెండుసార్లు ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా బీఆర్‌ఎస్‌ పరిపాలించిందని గుర్తుచేశారు. చాలా రాష్ర్టాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేని పరిస్థితులు ఉన్నాయని, ఏపీ ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. 2014లో 63 స్థానాలు, 2018లో 88 సీట్లతో అధికారంలోకి వచ్చామని, 2023లో సైతం 39 సీట్లు గెలిచామని గుర్తుచేశారు. జుక్కల్‌, బోధన్‌ తదితర 14 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి చెందడం వల్ల అధికారంలోకి రాలేకపోయామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి దేశంలో రాజకీయాలు మారాయని, మెజార్టీ పార్టీలు ఎన్డీయే లేదంటే ఇండియా కూటమిలో చేరి పోటీ చేశాయని తెలిపారు.

కొన్ని పార్టీలే రెండు కూటమిలకు దూరంగా ఉండి స్వతంత్రంగా పోటీ చేశాయని చెప్పారు. కూటమిలో ఉన్న పార్టీలు గెలిస్తే, కూటముల్లో లేనివారు దెబ్బతిన్నారని ఉదహరించారు. కేరళలో కూటమిలో లేని సీపీఎం కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిందని, తమిళనాడులో కూటమిలో ఉన్న సీపీఐ రెండు సీట్లు గెలిచిందని వివరించారు. కూటమిల్లో లేని జగన్మోహన్‌రెడ్డి, నవీన్‌పట్నాయక్‌, బీఎస్పీ, అకాళీ శిరోదల్‌ పార్టీలు దెబ్బతిన్నాయని ఉదహరించారు. వాటి మాదిరిగా కూటములకు దూరం గా ఉన్న బీఆర్‌ఎస్‌ సైతం రాష్ట్రంలో కొంత ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకోవాల్సిన స్థితి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ప్రజలకు అన్నీ తెలుస్తాయని, ప్ర జా సంక్షేమం, అభివృద్ధి చేసే కేసీఆర్‌కు వారి మద్దతు తిరిగి ప్రారంభమవుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తిరిగి పూర్వవైభవం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఎంగిలి మెతుకులకు ఆశపడే వారికి బుద్ధిచెప్పాలి

సీఎం రేవంత్‌రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి పోతున్న ఎమ్మెల్యేకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తన వియ్యంకుడి కాంట్రాక్టుల కోసం, కష్రర్ల కోసం పార్టీ మారారని విమర్శించారు. ‘కవితక్క సైతం వస్తుంది. నేనూ వస్తాను. జగిత్యాలలో గల్లీగల్లీ తిరుగుదాం. సంజయ్‌కి బుద్ధిచెబుదాం’ అంటూ కేటీఆర్‌ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో సంజయ్‌కుమార్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఒక్క ఎంపీటీసీ బీఫాం కూడా ఇవ్వనివ్వడని, సంజయ్‌ని రాజకీయంగా జీవన్‌రెడ్డి బతుకనివ్వడని పేర్కొన్నారు. సంజయ్‌కుమార్‌ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు.

తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరినా.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఆదరణ తగ్గలేదు. ఆయన పార్టీ మారిన తర్వాత జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక దశలో పద్మనాయక కల్యాణ మం డపం సరిపోలేదు. చాలామంది సమావేశమంతా సేపు నిలబడే కనిపించారు. కేటీఆర్‌తోపాటు ఇతర నాయకుల ప్రసంగాలకు కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు ఓరుగంటి రమణారావు, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, రామకృష్ణారావు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై విషం చిమ్మిననోళ్లు చెంపలేసుకోవాలి

కేసీఆర్‌ జలసంకల్పాన్ని హేళన చేసినవారు క్షమాపణ చెప్పాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై విషం చిమ్మినవారు చెంపలేసుకోవాలని, కల్పతరువులాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసినవారు తమ తప్పు ఒప్పుకొని కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముకు నేలకు రాయాలని సోమవారం ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. నిన్నటి దాకా మేడిగడ్డ మేడిపండు.. మరమ్మతులు అసాధ్యం.. ఇక పనికిరాదంటూ విమర్శించిన వారే, నేడు మేడిగడ్డ మరమ్మతులు పూర్తయ్యాయని చెప్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంతకాలం కాంగ్రెస్‌ చేసింది విష ప్రచారమని తేలిపోయిందని స్పష్టంచేశారు. ఏడు నెలల నుంచి కాంగ్రెస్‌ సర్కార్‌ కాలయాపన చేసిందని, చిల్లర రాజకీయం చేసిందనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రిపేర్ల మాటున చేసింది చిల్లర రాజకీయమని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ‘ఇకనైనా కేసిఆర్‌ జల సంకల్పాన్ని హేళన చేసినవారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మినవారు లెంపలేసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

2024-07-02T00:19:26Z dg43tfdfdgfd