PHOTOS: దేవుడి సాక్షిగా తాళి కట్టుకున్న హిజ్రాలు

కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.
అభిజిత్ లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10:55నిమిషాల కళ్యాణ తంతును ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించి 12గంటల 5నిమిషాల వరకు కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పార్వతి దేవి నూతన కళ్యాణ బొట్టును, బుగ్గల కాసింత దిష్టి చుక్కలు పెట్టుకొని ఆలయ అధికారులు సమర్పించిన పట్టు వస్త్రాలను ధరించి పార్వతి అమ్మవారుపెళ్లి కూతురయింది. కళ్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశారు.అనుకున్న సమయం రానే వచ్చింది. శివపార్వతుల శూలాలు, భక్తుల జయజయ ధ్వనుల మధ్య అభిజిత్ లగ్నంలో శ్రీ పార్వతి దేవిని శ్రీ రాజరాజేశ్వర స్వామి వైభవోపేతంగా పరిణయమాడారు.
ఓవైపు స్వామి వారి దివ్య కళ్యాణతంతు ఇలా జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్రబెల్లం పెట్టుకొని శులాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవ మూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివ పార్వతులు కూడా తమ శిరస్సుపై అక్షింతలను చల్లుకున్న దృశ్యాలు ప్రత్యేకమనే చెప్పాలి.
30వేలకు పైగా భక్తులు, శివపార్వతులు దివ్య కల్యాణాన్ని తిలకించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమ శంకర శర్మ ఇందిరా దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణ మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తామని ట్రాన్స్ జెండర్స్, శివసత్తులు, శివపార్వతులు లోకల్18కి తెలిపారు.
ప్రతి సంవత్సరం అంతరాలయంలో శివ కళ్యాణ మహోత్సవం జరిపించే వారని, ఈసారి ఆలయ చైర్మన్ ఛాంబర్ ముందు ప్రాంతంలో శివ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం, స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులందరికీ అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు.
ఏ శివాలయంలోనైనా మహాశివరాత్రి పర్వదినం రోజునే శివ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా కామ దహనం తర్వాత ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా శివ కళ్యాణ మహోత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.
దీంతో ఈ శివ కల్యాణ మహోత్సవంలో శివసత్తులు, జోగినిలు, శివపార్వతులు, ట్రాన్స్ జెండర్స్ సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో వచ్చి తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా స్వామివారికి వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు.
స్వామివారు అమ్మవారిని కళ్యాణమాడే సమయంలో.. వారు కూడా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ.. ఒకరికొకరు జీలకర్ర,బెల్లం పెట్టుకొని పసుపు కొమ్మును మంగళసూత్రంగా భావించి స్వామివారిని కళ్యాణ మాడడమనేది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో అపురూప ఘట్టమనే చెప్పాలి.
ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. కన్నుల పండుగగా స్వామి వారి దివ్య కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణ తంతును ప్రత్యేకంగా వీక్షించి సేవలో తరించారు.

2024-03-28T11:59:40Z dg43tfdfdgfd