POSANI KRISHNA MURALI: ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు, వాళ్ల జీవితాలు నాశనం - పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali on Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతూ చిరంజీవి వీడియో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజ్యం పార్టీ ఎత్తేసిన సమయంలో చిరంజీవి ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారని.. తద్వారా ఎంతోమంది కాపులు బలయ్యారని విమర్శించారు. ఆ విషయంలో చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని కోరడం ఏంటని నిలదీశారు.

ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రజా రాజ్యం పార్టీ పెట్టారని బాగా కష్టపడితే 18 స్థానాలు గెలిచారని గుర్తు చేశారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చుని ఉంటే ఆయనకు ఎంతో గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రస్థానం అప్పుడే మూసుకొని ఉంటే.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీగా అవతరించేది కాదని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తిత్వం చిరంజీవికి లేదని.. డబ్బుల కోసమే ఆలోచించాడని విమర్శించారు. సినిమాలను, రాజకీయాలను చిరంజీవి బిజినెస్‌ గానే చూశారని అన్నారు. తన 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు అమ్మేసి.. తద్వారా వారు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వ పదవిని, కేంద్ర మంత్రి పదవిని చిరంజీవి అనుభవించారని ఆరోపించారు. ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని సినిమాల్లోకి వెళ్లిపోవడం మంచిదే అని అన్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో చిరంజీవి జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. తన తమ్ముడికి ఓటు వేయమని కోరుతున్నారని అన్నారు.

చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయన ఏనాడైనా సంపద సృష్టించారా? అని మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. రెవెన్యూ లోటు బడ్జెట్టే ఉండేదని విమర్శించారు. జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెళ్లదీశారని.. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. అది నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారని అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు పోసాని. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పారు.

2024-05-08T10:45:07Z dg43tfdfdgfd