SAJJALA RAMAKRISHNA: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Sajjala Ramakrishna Reddy Counters Chandrababu Naidu: పులివెందులో నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార విపక్ష నేతలు ఒకరిపై మరొకరు కౌంటర్ ఎటాక్ లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా స్పందించారు. తొలుత గురువారం (ఏప్రిల్ 25) జరిగిన అక్కడి బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వివేకా హత్య కేసుతో పాటు తనకు వ్యతిరేకంగా మారిన తన చెల్లెళ్లు షర్మిల, సునీతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఓ రకంగా తన చెల్లెళ్లు ఇంత కాలం తనపై వ్యతిరేకంగా చేస్తూ వస్తున్న దుష్ర్పచారానికి సీఎం కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని జగన్ అన్నారు. పసుపు చీర కట్టుకుని వైఎస్ వ్యతిరేకులు చేసే కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అని మండిపడ్డారు. వివేకా కేసులో అవినాష్‌ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానని అన్నారు.

అయితే, షర్మిలపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’’ అని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అటు నారా లోకేశ్ కూడా ఎక్స్ ద్వారా జగన్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.

తాజాగా చంద్రబాబు స్పందించిన తీరుపైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే.. చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి పోస్ట్ చేశారు.

2024-04-25T13:09:12Z dg43tfdfdgfd