SATURDAY MOTIVATION: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Saturday Motivation: ఒక రాజుకు ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. రాజు ప్రతి విషయాన్ని తన స్నేహితుడితో చెప్పేవాడు. ఆయన స్నేహితుడు ఏం జరిగినా కూడా ‘అంతా మంచికే జరిగింది’ అనేవాడు. అతనికి పాజిటివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉండేది.

ఒకరోజు రాజు తన స్నేహితుడితో కలిసి వేటకు వెళ్ళాడు. దట్టమైన అడవిలో రాజు వేటాడుతూ ఉంటే స్నేహితుడు అతనికి బాణాలు అందించేవాడు. ఓసారి బాణం రాజు చేతికి తగిలి బొటనవేలు తెగి పడిపోయింది.

వెంటనే అప్రమత్తమైన స్నేహితుడు ప్రధమ చికిత్సను చేశాడు. ఇద్దరూ కూర్చుని ఎందుకిలా జరిగిందో అనుకున్నారు. చివరిలో స్నేహితుడు ‘ఏం జరిగినా అంతా మంచికే జరుగుతుంది’ అని అన్నాడు. దానికి రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. తన బొటనవేలు ఊడి పడిపోతే స్నేహితుడు మంచే జరిగిందని అనడం ఆయనకు నచ్చలేదు. వెంటనే కొంతమంది భటులను పిలిచి తన స్నేహితుడిని రెండు నెలలపాటు జైల్లో ఉంచాల్సిందిగా చెప్పాడు.

రెండు నెలలు పాటు రాజు ఒంటరిగానే వేటకు వెళ్ళాడు. ఓసారి వేటకు వెళ్లి తప్పిపోయాడు. ఎటు వెళ్ళాడో తెలియదు. ఓచోట నరమాంస భక్షకులు ఆయనకు ఎదురయ్యారు. రాజును చూసి అతడిని తమ ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడిని ఒక చెట్టుకు కట్టి చుట్టూ మంట పెట్టేందుకు కర్రలు పేర్చారు. ఆ మంటల్లో రాజుని ఆహుతి చేసి అతడిని తినేయాలి అన్నది నరమాంస భక్షకుల ప్లాన్. కట్టెలకు నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా... రాజుకు బొటనవేలు లేని సంగతి కనబడింది. ఆ నరమాంసభక్షకులకు మూఢనమ్మకాలు ఎక్కువ. మనిషిలో ఏదైనా లోపం ఉంటే వారు అతడిని తినరు. వెంటనే రాజును వారు వదిలేసారు.

రాజు తనకు బొటనవేలు లేకపోవడమే ప్రాణాన్ని కాపాడిందని అనుకుని అక్కడ నుంచి వచ్చేసాడు. తన స్నేహితుడు బొటనవేలు ఊడి కింద పడినప్పుడు అంతా మన మంచికే అని ఎందుకు అన్నాడో అతనికి గుర్తొచ్చింది. వెంటనే స్నేహితుడి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఈ బొటనవేలు లేకపోవడం వల్లే నేను ఈరోజు బతికి బట్టకట్టగలిగాను అని చెప్పాడు. అలాగే జైల్లో పెట్టినందుకు క్షమించమని అడిగాడు.

వెంటనే స్నేహితుడు ఏదైనా ప్రతిదీ మంచికే జరుగుతుంది అని మళ్ళీ అన్నాడు. రాజు ‘నేను జైల్లో పెట్టిస్తే నీకెలా మంచి జరిగింది’ అని ప్రశ్నించాడు. దానికి ఆ స్నేహితుడు ‘నువ్వు నన్ను రెండు నెలలపాటు జైల్లో పెట్టడం వల్లే నీతో పాటు వేటకు నేను రాలేదు. లేకుంటే నేను కూడా వచ్చేవాడిని. బొటనవేలు లేని కారణంగా వారు నిన్ను వదిలేసేవారు. నన్ను మాత్రం తినేసేవారు. జైల్లో ఉండడం వల్లే నా ప్రాణం నిలిచింది’ అని చెప్పాడు

రాజుకు సానుకూల ఆలోచనల శక్తి ఏంటో తెలిసింది. చిన్న చిన్న విషయాలకు తల్లడిల్లిపోవడం, సమస్య ఎదుర్కోవడం, అప్పటికప్పుడే పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అర్థం చేసుకున్నాడు.రాజే కాదు, ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి సమస్యకు తల్లడిల్లిపోయి అరచి గోల పెడితే ఆరోగ్యం చెడిపోతుంది. కానీ దక్కేది ఏమీ ఉండదు. ఏం జరిగినా మన మంచికే జరిగిందని అనుకునే ముందుకు సాగిపోతూ ఉండండి. ఏదో రోజు కచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు.

2024-05-03T23:39:05Z dg43tfdfdgfd